Archive for September 2nd, 2008

తెలుగు దళిత కథాపరిణామం

 

 

 

 

 

 

 

 

 

-

 

డా//

దార్ల వెంకటేశ్వరరావు

 

 

తెలుగులో దళిత సాహిత్యం కవిత్వం, కథ, నవల, నాటకం, పాట, విమర్శ తదితర ప్రక్రియలతో పరిపుష్టిగానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, దళిత సాహిత్యం ప్రక్రియాపరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో ప్రత్యక్ష సంబంధాల ప్రతిఫలనం కూడా దళితసాహిత్యంలో కనిపించే విశిష్టతల్లో ఒకటి. విప్లవ సాహిత్యనంతరం తమ సమస్యల కోసం ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు నడిపి, భావాలను సాహిత్యంగా సృజనీకరించే సాహిత్య దృక్పథం దళిత సాహిత్యంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి దళిత సాహిత్యం వర్తమాన సాహిత్యంలో ఉద్యమస్థాయిని పొందింది. చాలామంది దళితులుచేసే ఉద్యమాలను దళిత ఉద్యమాలుగాను , దళితకవులు, కథకులు రాసే సాహిత్యాన్ని దళిత సాహిత్యవాదంగానూ పిలుస్తున్నారు

.

 

 

సాహిత్య పరిభాషను వాడటంలో కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, మరికొంత మంది అంత జాగరూకతతోనూ వ్యవహరిస్తుంటారు. మార్కిస్టులు, అంతకుముందే సంప్రదాయవాదులు దళితసాహిత్యాన్ని ఉద్యమంగా గుర్తించడానికి అంగీకరించలేకపోతున్నారు. అయితే, సాహిత్యంలో వాదం, ధోరణి, ఉద్యమం మొదలైన పారిభాషిక పదాలను వాడటంలో చాలా జాగ్రత్త అవసరం. ‘వాదంలో తాత్త్విక దృక్పథం కంటే, తమ ఆశలను, ఆశయాలను వినిపించడమే ప్రధానమవుతుంది. అందులో తాత్త్విక నేపథ్యం ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం లేదు. అది కొన్నిసార్లు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తుంది. తార్కిక నిరూపణల తో ముడిపడి ఉంటుంది. కానీ, ఉద్యమంలో స్పష్టమైన ప్రణాళిక, లక్ష్యం, తాత్త్విక నేపథ్యం, దృక్పథం మొదలైవి ఉంటాయి. దళిత సాహిత్యానికి దళిత పాంథర్స్” (1971) నుండే ఒక ప్రణాళిక ఉంది. కుల నిర్మూలన లక్ష్యం ఉంది. వర్ణాశ్రమ ధర్మాలపై నిర్మితమైన భారతీయ సమాజం, వివిధ మతాల ప్రభావాలు వంటి నుండి శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక క్షోభలను, అవమానాలను ఎదుర్కొన్న జాతులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలనే నేపథ్యం ఉంది. డా//బి.ఆర్. అంబేద్కర్, జ్యోతి బాపూలే,పెరియార్ రామస్వామి నాయకర్ మొదలైన వారి భావజాలం అర్థం చేసుకుంటే గాని ఇవన్నీ అవగాహనలోకి రావు. దృక్పథంతో తెలుగు దళిత సాహిత్యాన్ని చూస్తే గాని తెలియదు. అలా చూడగలిగినపుడు దళిత సాహిత్యంవాదమో, ఉద్యమమో స్పష్టమవుతుంది

.

 

 

బహూశా, నిర్వాహకుల దృష్టిలో తాత్త్విక దృక్కోణాన్ని అంతా సోదాహరణంగా తెలుగు దళిత కథలుద్వారా నిరూపించమనే ఉద్దేశంతో వాదంఅని తార్కిక నిరూపణతో ముడిపెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే సదస్సులో ఆధునిక సాహిత్య దృక్పథాలనువినిపించేటట్లు లేదా పున: సమీక్షించుకొనేటట్లు ప్రణాళికను రూపొందించారు. దీనిలో భాగంగానే నేమో స్త్రీ వాదం’, ‘ ముస్లిం వాదంఅంటూ పత్ర సమర్పణను నిర్దేశించారు. కనుక, ‘ దళిత వాదంఅనే పారిభాషిక పదాన్ని దళిత సాహిత్య ఉద్యమంఅనే విస్తృతార్థంలో అవగాహన చేసుకోవాలని కోరుతూ, అవగాహనతోనే పత్రాన్ని సమర్పిస్తున్నాను

.

 

 

ముందుగా తెలుగు కథ ఎప్పుడు ప్రారంభమైందీ, అలాగే దళిత కథ ఎప్పుడు ప్రారంభమైందీ మొదలైన ప్రశ్నలకు సమాధానాని అన్వేషిస్తూ పత్రాన్నిముందుకి తీసుకొని వెళ్ళ వలసిన అవసరం ఉంది.అప్పుడే దళిత కథా పరిణామాని అవగాహన చేసుకోగలుగుతాం. సందర్భాన్ని బట్టి దాన్నీ వివరిస్తాను. నిజానికి స్వాతంత్ర్యానికి ముందూ, తరువాతా కూడా తెలుగులోదళితులగురించి చాలామంది కథలు రాశారు. భార్గవీరావు గారుఇంకానా ఇక పై చెల్లదు’( ) పేరుతో కొన్ని కథలను సంకలనంగా తీసుకొచ్చారు. తర్వాత డా//ఆర్. చంద్రశేఖర్ రెడ్డి డా//కె.లక్ష్మీనారాయణల సంపాదకత్వంలో దళిత కథలు’ (1996) పేరుతో విశాలాంధ్ర వారు ఒక కథా సంపుటిని ప్రచురించారు . దీనిలో తీసుకున్న కథలు దళిత కథలు కావని సంకలనం బయటికి వచ్చిన తర్వాత చాలా మంది విమర్శించారు. దానికి కారణం సంకలనం లో దళితులగురించి రాసిన కథలు ఉన్నాయి గానీ, ‘దళితజాతులగురించి కొన్ని కథలే ఉన్నాయి. దళిత రచయితల రచనలకంటే, దళితేతర రచయితల రచనలే ఉండటం విమర్శకు ఒక కారణం. ఇలాంటి విమర్శ వచ్చినా కానీ, కాలక్రమంలో దళితకథా పరిణామాన్ని తెలుసుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడున్నాయి. ఆపుస్తకాల తరువాత డా//కె. లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో దళిత కథల పేరుతో 8 సంపుటాలు వెలువడ్డాయి. వాటిలో దళితులు అనుభవించిన అనేక సమస్యలను గుర్తించే అవకాశం కలిగింది. వాటితో పాటు ఇంకా చాలా సంకలనాలు వచ్చాయి.ఇంకా రావలసినవి అనేకం ఉన్నాయి. చాలా కథలు పత్రికల్లో ప్రచురణ పొందాయి. నేటికీ కొన్ని పత్రికల్లో దళితకథలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. వీటితో పాటు ఆయా రచయితలు తాము ప్రచురించాలనుకుంటున్న కథా సంపుటాల్లోనూ కొన్ని కథలు ఉన్నాయి. కథలన్నింటినీ చూస్తే దళిత కథల్లో కింది పరిణామాలు స్పష్టమవుతాయి. కనుక, దళిత కథల్లో దళితవాదానికిప్రాతినిధ్యమనదగిన కొన్ని కథలను పరిశీలించడం ద్వారా తెలుగులో వచ్చిన దళిత కథస్వరూప స్వభావాలు , పరిణామం తెలిసే అవకాశం ఉంది. పరిధి లో నా పత్రాన్ని సమర్పిస్తున్నాను

.

 

 

సంస్కరణోధ్యమ ప్రభావంతో గురజాడ దిద్దుబాటు’ (1910) కథానిక ప్రారంభమయ్యింది. ఇది దళిత కథ కాదు. కానీ సంస్కరణోద్యమ ప్రభావంతోనే వెలువడిందని చెప్పవచ్చు. దళితుల సమస్యలు కూడా సానుభూతితో స్వీకరించిన సహృదయతను అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. ఇంత చెప్పినా గురజాడ వారి దిద్దుబాటు కథానికలో దళితుల గురించేమీ లేదు. 1925 లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుల్లంరాజుకథ రాశారు. తరువాత 1931 లో సాగర సంగమం’, ఇలాంటి తవ్వాయి వస్తే, (1934 ) అనే కథలను కూడా ఆయనే రాశారు. వీటిలో ఆయన దళితుల మధ్య గల అనైక్యతనూ, దళితుల మతాంతరీకరణను చిత్రించారు. తరువాత దళితేతరులు రాసిన దళితకథల్లో దళితుల పట్ల సానుభూతి వ్యక్తమవుతుంది. అయినా గానీ జాతీయోద్యమం కోసం గాంధీ నడిపిన హరిజనోధ్ధరణే వీటిలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘మాల - మాదిగమొదలైన షెడ్యూల్డు కులాల్లోని ఉప కులాలాను కలిపి హరిజనులు అనిపిలుస్తూ రాసిన కథలు అనేకం వచ్చాయి. ‘హరిజన సమస్య లోతులు తెలియకుండా రాసిన కథలు కూడా చాలానే వచ్చాయి. చలం రాసిన హరిజన సమస్య’, ‘మాదిగమ్మాయి మొదలైన కథలన్నీ కోవలోనే చెప్పుకోవచ్చు. అడవి బాపిరాజు గారు రాసిన నరసన్నపాపాయి ‘ (1954) కథ, దళితుల దేవాలయ ప్రవేశ నిషేధాన్ని నిరసిస్తూ, వాళ్ళు కూడా మనుషులేననీ, చదువుకున్న దళితేతరులు దళితులతోసంస్కరణ భావాలతో మెలిగే వారని స్పష్టం చేస్తుందీ కథ.
దళితుల సమస్యలను ముఖ్యంగా అస్పృశ్యత, నీటి సమస్య, రాజకీయాధికారం, వృతి వల్ల వచ్చే అనారోగ్యం, వృత్తులు మారి చదువుకున్నా, కులపీడన మరో రూపంలో ప్రవేశించిన పరిస్థితులను వర్ణిస్తూ దళితేతర కథా రచయితల నుండి అనేక కథలు వచ్చాయి. వర్ణాంతర వివాహాలు, గ్రామాల్లో భూస్వామ్య పెత్తందారీ విధానాల వల్ల దళితులు పడుతున్న ఇబ్బందులను వర్ణించిన వారూ ఉన్నారు. దళిత కథా పరిణామాలను వివిధ వ్యాసాల్లో, గ్రంథాల్లో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఆచార్య ననుమాసస్వామి, నిఖిలేశ్వర్, బి.ఎస్.రాములు, గుడిపాటి తదితరులు వివరించే ప్రయత్నం చేశారు. వాటిలో 1934 నుండి 1968 వరకూ దళిత కథలకు ప్రాథమిక స్థాయిగా విమర్శకులు గుర్తించారు. కాలంలో దళిత సమస్యలను దళితేతరులు రాశారనీ నిఖిలేశ్వర్ ( తెలుగు కథ : దళితవాదం1996:63) అన్నారు. “1969 నుండి 1980 మధ్యలో మాల- మాదిగల మధ్య సమష్టి పోరాట స్థాయి లేదు. పోరాటాలు ముందుగా దళితుల్లో ఏర్పడాలని ఉద్బోధిస్తూ కథలు రాశారు. అప్పటికే నక్సల్బరీ - శ్రీకాకుళ పోరాటాలు వచ్చినా రచయితలు వాటిని పట్టించుకోలేదుఅని కూడా నిఖిలేశ్వర్ వ్యాఖ్యానించారు. 1990 నుండి 1995 మధ్యలో దళితుల పై జరిగిన దాడుల వల్ల ప్రతిఘటన చైతన్యం వచ్చినా, అది కథల్లో ప్రతిఫలించలేదన్నారు. నేపథ్యంతో పరిశీలించినప్పుడు దళితులు, దళితేతరులు దళితకథలను రాశారనీ, అందులో భిన్న కోణాలు ప్రతిఫలించాయని తెలుస్తుంది. దీనిలో భాగంగానే దళిత సంస్కృతిని తెలిపే కథలు కూడా వచ్చాయి. ఎండ్లూరి సుధాకర్ గారి మల్లె మొగ్గల గొడుగుమాదిగ కథలు (1997)లో, నాగప్ప గారి సుందర్రాజు గారి (1968 – 2000) ‘ మాదిగోడుకథల (1997లో మాదిగ జీవితాల్లోని అనేక కోణాలు వర్ణితమయ్యాయి. ‘జాంబవంతుడూ - పిచ్చిమామ’, ‘ ఆరంజోతికథలలో ఎండ్లూరి సుధాకర్ గారు మాదిగ జీవితాలకున్న పౌరాణిక వారసత్వాన్ని కొనియాడుతూనే అందులో ఉన్న కుట్రను పసిగట్టేటట్లు రాశారు. తెలుగులో వచ్చిన తొలి దళిత ఆత్మకథలుగా వీటిని చెప్పుకోవచ్చు. నాగప్ప గారి సుందర్రాజు ‘ ‘ మాదిగోడుకథల ద్వారా మాదిగ సంస్కృతి, భాషలన్నింటినీ రాయలసీమ ప్రాంతం నుండి చూపించారు. కొలకలూరి ఇనాక్ గారు పొట్ట పేగులెబ్బింది గోడుకథలో మాదిగ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. లోతుగా పరిశీలిస్తే ఇనాక్ గారు దళిత కథకు తాత్త్విక దృక్పథాన్ని సమకూర్చ గలిగారి నిరూపితమవుతుంది. ఆయన రాసిన తాకట్టు ‘, ‘ కులవృత్తిమొదలైన కథలలో దళిత తాత్త్విక దృక్పథం వ్యక్తమౌతుంది. ‘ గొడ్ల దొంగకథలో మాదిగల పై జరిపే అగ్రవర్ణ భూస్వాముల దురాగతాలు వర్ణితమయ్యాయి. 1969 లో కొలకలూరి ఇనాక్ గారు రాసిన ఊరబావికథలో వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన సాహసం వెల్లడవుతుంది. అగ్రవర్ణ చాణక్యనీతిని దళిత స్త్రీ తిప్పికొట్టిన వైనం కనిపిస్తుంది. దీన్ని దళిత జీవితాన్ని స్పృశిస్తూ రాసిన మొట్ట మొదటి దళిత కథగా ననుమాసస్వామి, బి.ఎస్.రాములు మొదలైన కథా విమర్శకులు భావిస్తున్నారు.కొలకలూరి ఇనాక్ గారు ప్రజాసాహితి మాస పత్రికలో రాసిన కులవృతి’ (2006) కథ కొంత వివాదాస్పదమైంది. పత్రికలోనే రచయిత కథకు సంబంధించిన స్పందనను కూడా ప్రకటించారు. అన్ని వృత్తులు గౌరవింపబడుతున్నా మాదిగ కులవృత్తి సమజ గౌరవానికి నోచుకోవడం లేదనే ఆవేదన కథలో ప్రధానంగా కనిపిస్తుంది. స్వామి తల్లిమాట’ (1990), సింగమనేని నారాయణ మకరముఖం’ (1995) మొదలైన కథల్లో దళితులు తమ కులాన్ని చెప్పుకోవడానికి వెనుకాడుతున్నారని వివరించారు

.

 

 

ఎస్సీ వర్గీకరణ నేపథ్యంతో కూడా కొన్ని దళిత కథలు వచ్చాయి. పైడి తెరేష్ బాబు రాసిన అనుబంధ ప్రశ్న’ (1996) కథ అగ్రవర్ణాల వారు దళితుల్ని విడగొట్టేందుకే వర్గీకరణ సమస్యను పైకి తెచ్చారని వివరిస్తుంది. నేపథ్యం తోనే మరి కొంతమంది కూడా కథలు రాశారు. జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో నల్ల రేగటి సాల్లుకథలు (2006) వెలువడ్డాయి. దానిలో మాదిగ ఉపకుల స్త్రీల జీవితాల్లోని కొత్త కోణాలు చిత్రితమయ్యాయి. జూపాక సుభద్ర, గోగు శ్యామల మొదలైన రచయిత్రులు తెలంగాణ భాష లో చక్కని నుడికారంతో కథలు రాస్తున్నారు. దళిత కథల్లో కనిపించే మరొక ధోరణి దళితులు క్రైస్తవులుగా, మంస్లింలుగా మారటాన్ని వివరించారు. స్వాతంత్ర్యానికి పూర్వం హిందూ మతంలో దళితుల పై ఉన్న నిర్బంధాల కారణంగా దళితులు ఇతర మతాల్లోకి వెళ్ళారని వర్ణించారు. స్వాతంత్ర్యానంతరం కూడా ధోరణీతో కొన్ని కథలు వచ్చాయి. కొలకలూరి ఇనాక్, ప్రసాదరావు తదితరుల కథల్లో ఇలాంటి ఇతివృత్తం కనిపిస్తుంది. అయితే, క్రైస్తవ మతంలోకి వెళ్లిన తర్వాత దళితుల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాలను ధారాగోపి గుడిసె ఏసోపుకథలలో వర్ణించారు. క్రైస్తవులలో కొంతమంది దళితులను దోచుకుతింటున్న వైనాన్నిఈ కథల్లో వర్ణించ గలిగారు. చిలుకూరి దేవ పుత్ర బంది కథలో క్రైస్తవ మతం, దళితులలో క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే వారి పట్ల వ్యవహరించే తీరుతెన్నుల్ని వివరించారు. బోయ జంగయ్య గారి పనిష్మింట్కథలో అగ్రకుల ఎం.ఎల్.., గిరిజన స్త్రీ శీలాన్ని దోచుకోవడం, తదనంతరం జరిగే కోర్టు వ్యవహారాలు, దళితులకున్న భూమిని కోల్పోవడం మొదలైన అంశాల్ని వర్ణించారు. ప్రజా ప్రతి నిధులు దళితుల పట్ల వ్యవహరించే తీరుని కథ కళ్ళకు కట్టినట్లుగా చూపుతుంది. ఈయనే రాసిన బంచరాయి’ ‘ ఇంకానా ఇక పై సాగదుకథలలో భూమి సమస్య, సమ్మె ప్రభావం మొదలైన దళిత సమస్యలను వర్ణించారు

.

 

 

దళిత కథలను మరింత లోతుగా పరిశీలించినపుడు దళిత స్త్రీ వాదానికి సంబంధించిన అంశాలను గోగు శ్యామల, జూపాక సుభద్ర, జె. గౌరి, కొలకలూరి స్వరూపారాణి మొదలైనవారు తమ కథల్లో చూపే ప్రయత్నం చేశారు. ‘ దళిత స్త్రీఅని పేరు పెట్టి రాయక పోయినా, ఉద్యోగినిగా స్త్రీ ఎదుర్కొనే మానసిక హింస వెనుక కులాధిపత్య భావజాలం ఉందని తెలిపే కథలను ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి నీకూ నాకూ నడుమ’, ‘ వెండి కిరీటంకథా సంపుటాల్లో చూడవచ్చు. ఇంచుమించు ఇదే నేపథ్యంతో డా.వి. చంద్రశేఖరరావు గారు నలుపు అనే కథ రాశారు. సదానంద శారద రాసిన ఉప్పునీళ్ళు’, స్వామి రాసిన హెచ్. సరస్వతి కథలు విద్యాలయాల్లో దళిత బాలికలు, స్త్రీలకు జరిగే అవమానాలను వర్ణిస్తాయి. దళిత సౌందర్యాన్ని దళిత స్త్రీకోణంలో నలుపుకథను కాలువ మల్లయ్య గారు రాశారు. ఇలా దళితులు అస్పృశ్యత వల్ల మానసికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కోల్పోతున్న జీవితాలను చాలా వరకూ ఆయా రచయితలు ఆయా కథల్లో చూపించగలిగారు

.

 

 

దళిత కథల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుందని పైన పేర్కొన్న కొన్ని కథలను చూసినా తెలుస్తుంది. అయితే స్వామి, సింగమనేని నారాయణ మొదలైన వారు దళితుల గురించి కథలు రాసినా, దళితులు తమ కులాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారనే ఆలోచన కలిగిస్తాయి. కానీ,దళితుల మానసిక కోణాలను మరింతగా పట్టుకోవలసిన అవసరం ఉంది. సామాజిక పరిస్థితులను మరింతగా చిత్రించవలసి ఉంది. దళిత జీవిత లోతులు మరింతగా తెలిస్తే అలాంటి వాటిని సరిగ్గా రాయగలిగి ఉండేవారెమో! లేకపోతే దళితులలోని కోణాన్ని కూడ చెప్పాలనే ఆలోచంతో కూడా అలాంటి దృష్టిని ప్రదర్శించి ఉండవచ్చు. కొలకలూరి ఇనాక్, ఎండ్లూరి సుధాకర్, బోయ జంగయ్య, అల్లం రాజయ్య గారలు తాత్త్విక, సాంస్కృతిక, ఆర్థిక కోణాలను వారి కథలో చూపడంలో నిజమైన దళిత జీవితం కనిపిస్తుంది. దళితులు రాసిన కథల్లో సమస్యను చెప్పడంతోపాటు, సమస్య వెనుకున్న అనేక కారణాలను చెప్తూనే, వాటిని అధిగమించే తత్వం బాగా వ్యక్తమవుతుంది. అయినా, దళితులు కూడా మాల - మాదిగల మధ్య ఉండే సమస్యలకు అగ్రవర్ణాల వారే కారణమని అనడంలో కొంత వాస్తవం ఉన్నా, అదే పరిపూర్ణ సత్యం అనుకోవడానికి వీల్లేదు. దళితులు కథలు రాయని లేదా పరిస్థితుల్లో ఏదొక దృష్టితో దళితుల గురించి కూడా దళితేతరులు కథలు రాసారని, అది ఒక సామాజిక,సాహిత్య పరిణామాన్ని అర్థం చేసుకోవడాని దోహదపడుతుందని, కథలను కూడా స్వాగతించవలసిందే.ప్రస్తుతం సాంస్కృతిక కోణాల నుండి కూడా కథలను చిత్రించవలసిన అవసరం ఉంది. దళితులు ఎదుర్కొంటున్న ప్రాంతీయ సమస్యలను చిత్రించాలి.ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న తరుణంలో దళితుల మనోభావాలను కథలుగా వర్ణించవలసి ఉంది. ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల గానీ, రాకపోవడం వల్ల గానీ, దళితులకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలేమిటో వివరించే కథలు రావలసిన అవసరం ఉంది.అలాగే దళితుల్లో రిజర్వేషన్లు పొందిన, పొందని వర్గాల మధ్య సంఘర్షణను, గ్రామీణ, పట్టణ, చదువుకున్న తరం , చదువు కోసం ఎదురు చూసే తరాల మధ్య అంతరాలనూ వర్ణించవలసి ఉంది.మొత్తం మీద దళిత కథ జీవిత వాస్తవాల ను కథనీకరించే దిశగానే వెళ్తుందని భావించవచ్చు

.

 

 

Add comment September 2, 2008

http://prajakala.org/mag/2007/09/amrapali_samiksha

- డా॥ దార్ల వెంకటేశ్వరరావు

ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను.తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు.

గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం ఎంతవరకూ అంగీకరిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న! ఆ ప్రశ్నకు సరైన సమాధానమే బుద్ధుడు ఆమ్రపాలిని బౌద్ధమతంలోకి ఆహ్వానించడం. బౌద్ధ హిందూమతంలో అనాచారులుగా కనిపించే చాలా వాటిని సంస్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. సమాజ నిరాదరణకు గురయిన వాళ్ళనెంతోమందిని దరి చేర్చుకొని, తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాపించ గలిగింది. సామాజిక నిర్బంధాల కారణంగా గణభోగ్యగా మారిన ఆమ్రపాలి కథ ఇంచుమించు అన్ని భారతీయ భాషలలోను ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగులో చాలామంది ఈ కథను రాశారు. ఈ వ్యాసంలో ఇద్దరు రాసిన కావ్యాలను, మరొకరు రాసిన నవలను తీసుకొని, ఆ కథను ఆయా రచయితలు ఎలా తీర్చిదిద్దారో పరిశీలించే ప్రయత్నం చేస్తాను.
‘ఆమ్రపాలి’ బౌద్ధ జాతక కథను యస్.టి.జ్ఞానానంద కవిగారు ఎనిమిది ఆశ్వాసాలుగాను, కరటూరి సత్యనారాయణగారు ఏడు సర్గలుగాను విభజించి ‘ఆమ్రపాలి’ అనే పేర్లతో కావ్యాలుగా రాశారు. జ్ఞానానందకవిగారు శాంతాన్నీ, కరటూరి వారు ‘కరుణ’ను ప్రధాన రసాలుగా పోషించారు.

ఇరువురు కవులూ ఆమ్రవనంలో ‘ఆమ్రపాలి’ అనాధగానే దొరికినట్లు పేర్కొన్నారు. లల్లాదేవి మాత్రం పూర్తి భిన్నంగా కథను సామాజిక అంశాలతో పరిశీలించి రచించారు. ఆమ్రపాలి అసలు పేరు ‘ఉదాయి’గా మార్పు చేసి, ఆమ్రవనంలో నివసించటం వల్ల ‘ఆమ్రపాలి’గా మారినట్లు, ఆ పిల్ల పుట్టిన తరువాత తల్లిదండ్రులు చనిపోయినట్లు లల్లాదేవి మార్పులు చేశారు.
యస్.టి. జ్ఞానానందకవిగారు తన కావ్యంలో పిల్లలు లేని మహానామునికి (శాక్య ధనికునికి) ‘ఆమ్రపాలి’ దొరకగా, కరటూరి వారి కావ్యంలో ఆనందుడనే కొడుకు కలిగిన శాక్యధనికునికి ఆ పసిపిల్ల దొరికినట్లు చిత్రించారు.

ఆడపిల్ల పెళ్ళీడుకొస్తుంటే, పెళ్ళి చేయాలనే తపన తండ్రికి ఎలా పెరుగుతుందో అది జ్ఞానానందకవిగారి కావ్యంలో బాగా కనిపిస్తుంది. కానీ, కరటూరివారు, ‘తండ్రి రాజ్య నిర్వహణా భారంలో పడి కూతురికి వివాహం చేయటం మరచిపోయినట్లు రాశారు. ఇటువంటి ప్రయత్నమేదీ లల్లాదేవి నవలలో కనిపించలేదు. ఆమ్రపాలి తండ్రి లిచ్ఛవుల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి వల్ల కూతురికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయంతో ఉండేవాడనీ, కనుక సరియైన సమయంలో తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని భావించి స్వయంవర సభను ఏర్పాటు చేసినట్లు జ్ఞానానందకవిగారు వివరించారు.
గణతంత్ర రాజ్యాలలో అందమైన యువతి కనిపిస్తే, ఆ దేశ పాలకులు గణభోగ్యగా చేసుకొనే ఆచారం ఉంది. శాక్యధనికుడు గణతంత్ర రాజ్యానికి చక్రవర్తి అయినా, పాలకులంతా ఏకమయి తీర్మానిస్తే తన కూతురినయినా గణభోగ్యగా చేయవలసిందే! కానీ, ‘స్వయంవరం’ అనేది ఒక సంప్రదాయం మాత్రం ఉంది. స్వయంవరంలో యువతికి నచ్చిన యువరాజుని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఉన్నా, అది గణనాయకుడైన చక్రవర్తి చేతిలో ఉండదు. గణరాజ్యాలలో ఒక గణ పరిషత్తు ఉంటుంది. విధి, విధానాలను అన్నింటినీ ఆ గణపరిషత్తే నిర్ణయిస్తుంది.

అందుకనే స్వయంవర సభలో గణపరిషత్తులో సభ్యులైన లిచ్ఛవ రాజులు అందగత్తె అయిన ఆమ్రపాలి తమకే చెందాలని, ఇతరులకు చెందకూడదనీ పట్టుపడతారు. గణనాయకుడైన శాక్యధనికుణ్ణి, లిచ్ఛవులు తమ అభిప్రాయం ప్రకారం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తారు. గణనాయకుడైనా తండ్రికి నామమాత్రమైన అధికారాలే ఉన్నాయని ఆ పరిస్థితిని గమనించి సభలోనే ఉన్న ఆమ్రపాలి ‘గణభోగ్య’గా ఉండటానికి అంగీకరిస్తుంది. అందుకుగాను కొన్ని నియమ నిబంధనలను విధిస్తుంది. తనతోపాటు మొదటినుండీ సభల్లోనూ, రాచకార్యాల్లోనూ పాల్గొన్నట్లు జాగ్రత్తపడ్డారు జ్ఞానానంద కవిగారు.

కరటూరివారు లిచ్ఛవుల్లో ‘అభయుడు’ అనే బలవంతుడైన మూర్ఖుడు ఆమ్రపాలి పట్ల వ్యామోహం పెంచుకుని, లిచ్ఛవులను రెచ్చగొట్టి, ఆమ్రపాలికి పెళ్ళి చేయకపోవటం వల్లనే రాకుమారులు రాజ్యంలో అశాంతిని సృష్టిస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారని రాజైన శాక్యధనికునికి నివేదించినట్లు వర్ణించారు.

సభలో మహానాముడిని ‘గణభోగ్య’గా ఆమ్రపాలిని చేయమని పట్టుపట్టడం తనకో ధర్మం, పరులకో ధర్మం పని చేయదని లిచ్ఛవులు రాజుని వ్యతిరేకించటం వల్ల మహానాముడే ఆమ్రపాలిని, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోకుండా ‘గణభోగ్య’గా ప్రకటించాడు. ఆ విషయాన్ని, కూతురైన ఆమ్రపాలికి చెప్పటానికి బాధాతప్త హృదయుడై ఆమె భవనానికి వెళతాడు. వెళ్ళి కూడా అక్కడే మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. తండ్రిని చూసి, ఆమ్రపాలి బింబిసారుని వల్ల మోసగింపబడిన విషయం ఎక్కడ తెలిసిపోయిందోనని, అందుకే ఎంతో ప్రేమగా పిలిచి ఆదరించే తండ్రి తాను చేసిన పనికి బాధపడుతున్నాడనుకొంటుంది. ఈ సన్నివేశం చక్కని నాటకీయతతో సాగింది. జరిగిన విషయాన్ని అంతటినీ తండ్రికి చెప్పేసి, శత్రురాజైన బింబిసారుడని తెలియదనీ, దేశద్రోహం చేయననీ, క్షమించమనీ ప్రాధేయపడుతుంది.

తండ్రి ఆమ్రపాలిని సముదాయించి, అనివార్యమైన పరిస్థితుల్లో గణభోగ్యగా చేయవలసి వచ్చిందని, సభా విషయాలను ఆమెకు తెలుపుతాడు. ఆ సందర్భంలోనే ఆమ్రపాలి తనకు ఆమ్రవనంలో దొరికిందనీ, స్వంత కుమారుడైన ఆనందుడినీ నిన్నూ ఒకేలా పెంచాననీ చెపుతాడు.
తెలిసిన విషయాలు ఇరువురికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమ్రపాలి దేశభక్తి (దేశంలో అల్లకల్లోలాలను ఆపడం కూడా దేశభక్తిగానే భావిస్తుంది.) దేశం కోసం దేనికైనా సిద్ధమవుతాననీ, బింబిసారుని చేతిలో మోసపోయినందుకు క్షమించమని చెపుతుంది.

ఇది జరిగిన తర్వాత కూతురు గురించి బెంగ పెట్టుకొని తండ్రి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఆనందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు. ఆమ్రపాలికి పుట్టిన కొడుకు ‘విమలకొండ’ను వేశ్య బిడ్డగా సమాజం గౌరవించదని ఆనందుడు చెప్పటం వల్ల బౌద్ధ సంఘంలో చేరటానికి తల్లి అంగీకరిస్తుంది. కానీ కొడుకు పట్ల పుత్ర వాత్సల్యం వీడలేకపోతుంది. ఏదో ఒక నెపంతో పుత్రుణ్ణి చూడాలనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి, బుద్ధుణ్ణి, ‘కొడుకుని తల్లి నుండి విడదీయడం ధర్మమేనా?’ అని నిలదీస్తుంది. బుద్ధుడు జీవిత సత్యాన్ని, దుఃఖ నివారణను చెప్పటం వల్ల ఆమె బౌద్ధ సంఘంలో చేరగలుగుతుంది.

లల్లాదేవి రాసిన ‘ఆమ్రపాలి’ నవలలో కథను పరిశీలిస్తే ‘ఉదాయి’కి తల్లిదండ్రులు చనిపోవడంతో, వైశాలినీ రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి మేనమామ ఆ పిల్లను తీసుకొని వెళుతుంటాడు. మార్గమధ్యంలో దొంగలబారిన పడటంతో మేనమామ చనిపోతాడు. భైరవుడనే మంచి దొంగ ఆ పసిపిల్లను చేరదీసి వైశాలినీ నగరానికి చేర్చి యశోదేవి దగ్గర విద్యాభ్యాసం కొనసాగేలా దోహదపడతాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అభ్యసిస్తూ రాజుగారి అనుగ్రహం పొంది, వారి ఆదరణకు పాత్రమవుతుంది. ఆమె చేసిన నాట్యానికి మెచ్చి, నర్తకి పదవినిచ్చి ఒక ఆమ్రవనాన్ని కేటాయించి, దానిలో చక్కని భవనాన్ని నిర్మించాలని రాజు చేతనుడు ఆదేశిస్తాడు. ఆమె ఆమ్రవనంలో ఉండటం వల్ల ‘ఆమ్రపాలిక’గా, తర్వాత ‘ఆమ్రపాలి’గా పిలువబడుతుంది.

భవన నిర్మాణానికి వినియోగించిన శిల్పులలో లౌకిక విషయాలను పట్టించుకోని ‘ఉదయుడు’ అనే శిల్పి ఏకాగ్రతతతో శిల్పాలను చెక్కుతుంటాడు. అతని శిల్ప నైపుణ్యాన్ని ఆమ్రపాలి అభిమానిస్తుంది. అతని దగ్గరే ఎక్కువసేపు గడుపుతుండేది. ఆమె కూర్చున్న భంగిమను ఒకసారి ‘ఉదయుడు’ చూసి చక్కని శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పంతోపాటు, బుద్ధుని ప్రశాంతమైన విగ్రహాన్ని కూడా ఆమెకు బహూకరిస్తాడు. ఉదయునుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం గమనించిన రాజు ఆ శిల్పిని మరొక చోటికి పంపాలనుకొంటాడు. ఉదయునుడు ఒక స్వేచ్ఛాజీవి. ఎవరి నియమ నిబంధనలకు తలొగ్గనివాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరోచోటికి శిల్పాలను చెక్కటానికి వెళ్ళమంటే ఇష్టపడక ఆ రాజ్యమే వదిలిపోతాడు.

బుద్ధుని ప్రశాంతమైన శిల్పాన్ని చూస్తూ బుద్ధుని గురించి, అతని ఆశయాలు, ధర్మాలను గురువుగారి సహాయంతో తెలుసుకొని, బుద్ధుణ్ణి దర్శించాలని తహతహలాడుతుంటుంది ఆమ్రపాలి. అదే సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఆ రాజ్యం వచ్చాడని తెలిసి తన భిక్షను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు మొదట అంగీకరించి ఆమె ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించాలనుకొంటాడు. అంతలో ఒక ధనస్వామి అనే ధనవంతుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బౌద్ధ భిక్షువుతో, ‘ఆమె ఒక వేశ్య’ అనీ, ఆ భిక్షను స్వీకరించవద్దనీ, మా ధనవంతుల దగ్గర స్వీకరించమనీ చెపుతాడు. ఆ బౌద్ధ సన్యాసి వెంటనే ఆమె పెట్టే భిక్షను తిరస్కరిస్తాడు. దానితో ఆమె ఎంతో బాధపడుతుంది. వేశ్య అంటే ఏమిటో, ఆ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే ఒక వేశ్యావాడలోని ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ‘ఆమ్రపాలి’ని కొంతమంది పట్టుకొని వేశ్యగా ముద్రవేసి, రాజు చేత ఆమెను నర్తకి పదవి నుండి తప్పించి, రాజ్య బహిష్కార శిక్ష వేస్తారు. బుద్ధుడు ఆ నగరం వచ్చేవరకూ ఏ తిండీ బట్టా పట్టించుకోకుండా నిరీక్షించి, బుద్ధుని కరుణ వల్ల బౌద్ధ సన్యాసినిగా మారటంతో కథ ముగుస్తుంది.

ముగ్గురు రచయితలూ మూడు విధాలుగా ‘ఆమ్రపాలి’ కథను తీర్చిదిద్దారు.
జ్ఞానానందకవిగారు తండ్రి పాత్రను పోషించటంలో ఔన్నత్యాన్ని, నైతిక విలువలను పాటిస్తూ సమయోచితంగా, సందర్భోచితంగా వర్ణించినట్లు అవగతమవుతుంది. దీనికి ముందు నుండే కథను చక్కని ప్రణాళిక వేసుకొన్నారనిపిస్తుంది. రాచకార్యాల్లో పాల్గొనడం, ఆమ్రపాలికి ఏర్పాటుచేసిన ‘స్వయంవర సభ’లోనే గణభోగ్య నిర్ణయం జరిగినట్లూ రాశారు.
కరటూరి వారి కావ్యంలో అప్పటికే తప్పు చేసి ఉండటం వల్ల, తండ్రి అప్పటికే ఆమెను గణభోగ్యగా అంగీకరించటం వల్ల ‘గణభోగ్య’గా ఆమె అంగీకరిస్తూ, పైకి దేశభక్తి పూత పూసినట్లు అనుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ, కావ్యాన్ని చదువుతున్న పాఠకునికి ఆ నాటకీయత అబ్బురపరుస్తుంది.

జ్ఞానానందకవీ, కరటూరి వారూ ఇద్దరూ కూడా ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత తండ్రి పాత్రను బాగా చిత్రించారు. జ్ఞానానందకవిగారు, ఆమ్రపాలి తండ్రి పాత్రను కావ్యంలో మరలా ప్రవేశపెట్టకుండానూ, కరటూరివారు, ఆమ్రపాలి తండ్రి బెంగ పెట్టుకొని మరణించినట్లు బాగా రాశారు. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత కథను ఆమె నుండే చూశారు. పెంచిన తల్లిదండ్రుల కోణం నుంచి చూడలేదు. ఇది చక్కని కథన శిల్పం.
లల్లాదేవిగారి నవలలో ‘ఆమ్రపాలి’ వేశ్యగా ముద్ర వేయబడుతుంది. ఆమెకు తెలియకుండానే వేశ్యావాడకు పోతుంది. అక్కడకొంతమంది యువకులు ఆమెను నిర్బంధించి వేశ్యగా మార్చినట్లు రాశారు. అక్కడ వేశ్య జీవితచిత్రణను వర్ణించటంలో లల్లాదేవి పరిశీలన చక్కగా వ్యక్తమవుతుంది. దొంగల గుంపుకి దొరికిన ఉదాయి అడవిలో పాడుపడిన దేవాలయం మీద ఉన్న నాట్యభంగిమలను చూసి, ఆమె నాట్యాన్ని అభ్యసించాలనుకొన్నది. సాధన వలన నాట్యాన్ని సాధించింది. ఆ నాట్యమే ఆమ్రవనాన్ని, నర్తకి పదవిని వచ్చేలా చేసింది. అదే ఆమెను ‘వేశ్య’గా అనుమానించేలా చేసింది. ఆ అనుమానంలో నుండి వచ్చిన అవమానమే ఆమెను బౌద్ధభిక్షువుగా మార్చి, సన్మార్గంవైపు పోయేటట్లు చేసింది.

యస్.టి. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ బింబిసారుణ్ణి ప్రేమించింది. బింబిసారుడూ ఆమెను కోరుకున్నాడు. తర్వాత ఇరువురిలో ఎవరిని ఎవరూ ద్వేషించుకోలేదు. బింబిసారుడు మాత్రం ఆరురోజులు ఆమె భవనంలో ఉండి, దొంగచాటుగా వచ్చిన అతని రాకను లిచ్ఛవులు పసిట్టడం, అతడిని జాగ్రత్తగా దాచటం, ఆమెను విడిచి వెళ్ళిపోయేటపుడు ఒక ఉంగరాన్ని ఇవ్వటం, ఒకవేళ కొడుకు పుడితే, ఉంగరమిచ్చి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం చిత్రించిన చిత్రపటంలో బింబిసారుణ్ణి ఆకర్షించి, ఆలోచిస్తుండగా చెలికత్తె ఆమె హృదయాన్ని పసిగట్టడం, రాయబారం నడపడం వంటివన్నీ చేస్తుంది. బింబిసారుని పాత్రను కావాలనే కావ్యనాయకునిగా, కవి తీర్చిదిద్దలేదేమో ననిపిస్తుంది. ఆమెను బింబిసారుడు అనుభవించటానికే ప్రయత్నించినట్లు తేలుతుంది. అయితే ఉంగరాన్ని ఇచ్చి, కొడుకు పుడితే, ఉంగరం చూపితే తన పుత్రునిగా స్వీకరిస్తానని చెప్పటం అతని స్వభావాన్ని తేటపరిచే విషయాలుగా గమనించే వీలుంది.

‘గణభోగ్య’గా జీవితాన్ని గడుపుతున్న ఆమ్రపాలి తనలో తాను తీవ్ర సంఘర్షణకు లోనై ఒకసారి తాను దొరికిన ఆమ్రవనానికి ప్రశాంతత కోసం రావటంతో, అక్కడ తొలిసారిగా బుద్ధుని దర్శనమవుతుంది. ఆనాటి నుండే ఆమెలో బుద్ధుని ప్రవచనాలు లౌకిక విషయాల పట్ల కోరికను తగ్గించి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. బుద్ధుని రాక కోసం నిరీక్షిస్తూ, తీరా బుద్ధునికి భిక్షను పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ నగరంలోని ధనవంతులు వ్యతిరేకిస్తారు. బుద్ధుని దర్శనాన్నీ బుద్ధుని శిష్యుడు కూడా అడ్డుకుంటాడు. కానీ బుద్ధుని జోక్యం వల్ల ఆమెకు అతని దర్శనం కలగటం, ఆమె పూర్వజన్మలో నెమలి అనీ, ఇంద్రుని శాపం వల్ల ‘ఆమ్రపాలి’గా జన్మించిందని, ఆమె జన్మ వృత్తాంతాన్ని బుద్ధుడు వివరించటంతో ప్రజల్లో ఎక్కడలేని ఆదరణ కలుగుతుంది. బుద్ధునికి భిక్షను పెట్టి, తన సర్వవిద్యలనూ బౌద్ధ సంఘ వ్యాప్తికే వినియోగిస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొంటుంది.

జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని చారిత్రక తత్త్వకావ్య లక్షణాలతో చక్కగా అన్వయించే ప్రయత్నం చేశారు. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో బుద్ధుని బోధనలు అడుగడుగునా కన్పిస్తుంటాయి. మరో విశేషమేమంటే, ఈ కావ్యంలో అన్ని పాత్రలూ ఆమ్రపాలి వైపు నడవగా, ఆమ్రపాలి బుద్ధుని ధర్మాలవైపు, బుద్ధుని వైపు పయనిస్తుంది. బౌద్ధమతంలోని ఆర్యసత్యాలనూ, త్రిరత్నాలనూ, అష్టాంగమార్గాన్ని కావ్యానికి అన్వయించి బౌద్ధ ధర్మేతిహాసంగా మలచగలిగారు.

జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.
ఆమ్రపాలి గణభోగ్యగా జీవితాన్ని గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయి, సంఘర్షణ పడుతూ, తీవ్రవ్యధకు లోనై గుండెల్లో దుఃఖాన్ని పోగొట్టు కోవాలని తాను దొరికిన ఆమ్రవనంలోకి వస్తుంది. కరుణ హృదయుడైన బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతడిని ఆమె ఎవరో ముని అనుకొని ఆమెలో తీరని కోరికను నర్మగర్భితంగా వ్యక్తీకరించి అతనిని తన ఇంటికి రమ్మనమనీ, సర్వసౌఖ్యాలనూ సమకూరుస్తానంటుంది.
బుద్ధుడు ఆమె మనోవాంఛను గమనిస్తాడు.

చాలా మృదువుగా, ప్రశాంతంగా, జీవిత సత్యాలను వివరిస్తాడు. అంతేకాక ఆమె బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత ఆమెతోపాటు బౌద్ధారామానికి వచ్చిన మిగిలిన ప్రజలకు నాలుగు ఆర్యసత్యాలను వివరిస్తాడు.
బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.
ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు.

మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించారు. దృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యమేనని దానివల్ల తెలుస్తుంది.
దుఃఖానికి కారణం కోరికలు అనేది బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల్లో రెండవది.
ఇంద్రియాలకు ప్రియమైన విషయ సంపర్కం, వాటి స్మృతి, కోరిక (తృష్ణ)లకు కారణమవుతుంది. ఆ కోరికలు పూర్తి కాగా త్యజించగలిగినపుడు దుఃఖం నివారింపబడుతుంది. ఇది మూడవ ఆర్యసత్యం.
ఆమ్రపాలి ఎన్నో కోర్కెలతో రగిలిపోతూనే బుద్ధుని ప్రథమ దర్శనం చేసుకొన్నది. బుద్ధుడు జీవితం క్షణికమైనదనే జీవిత సత్యాన్ని బోధించడం, తన తపస్సు పూర్తయిన తరువాత భిక్షను స్వీకరించటానికి వస్తానని చెప్పి పంపితే బుద్ధుని పునరాగమనం వరకూ భిక్షను సమర్పించటానికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికి ఆమెలో కోరికలు నశించిపోయాయి. తాత్కాలికమైన లౌకిక భోగాల నుండి శాశ్వతమైన విముక్తి మార్గానికి సిద్ధమై ఉంది. దీనికంతటికీ కారణం ఆమెలో వివాహం చేసుకోవాలనీ, సర్వసౌఖ్యాలను అనుభవించాలనీ ఉన్న కోర్కెలన్నీ నశించటమే. కొడుకుని, తండ్రిని, సర్వస్వాన్నీ వదిలి బుద్ధుని శిష్యగణంలో చేరిపోతుంది. ఆమె దుఃఖం నుండి విముక్తి పొందుతుంది. ఈ విధంగా చారిత్రక తత్త్వ కావ్యంగా జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని తీర్చిదిద్దారు.

బుద్ధుని బోధనలు సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపాయనేది తెలియజేసే కథలు ఎన్నో వస్తున్న నేపథ్యంలోనే ‘ఆమ్రపాలి’ కావ్యాలు, నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. మానవ విలువలను, మానవ సంబంధాలను పటిష్టపరచడంలో బౌద్ధేతివృత్త కావ్యాలు చాలావరకూ తోడ్పడ్డాయి. అలా నిరూపించే బౌద్ధజాతక కథలలో ఆమ్రపాలి కథ ఉత్తమమోత్తమ కథ. ఇంకా చాలామంది తెలుగు రచయితలు కూడా ఆమ్రపాలి కథను తీసుకొని వివిధ ప్రక్రియలలో రచనలు చేసినవారు ఉండవచ్చు.

 

 

Add comment September 2, 2008


Calendar

September 2008
M T W T F S S
    Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Posts by Month

Posts by Category