Archive for February, 2009

కైతునకల దండెం కవితాసంకలనం గురించి పత్రికలు

సూర్య దిన పత్రిక (అక్షరం) లో16-2-2009 న వచ్చిన వ్యాసం
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (హైదరాబాదు టాబ్లాయిడ్) 14-2-2009 న ప్రచురించిన వార్తావిశే॑షాలు

Friday, February 13, 2009

ఇక పై మాదిగసాహిత్యంలో అంతర్భాగమే దళిత సాహిత్యం: కైతునకల దండెం కవితాసంకలనం ఆవిష్కరణ సభ విశేషాలు

Dr.Darla Venkateswara Rao
Assistant Professor,Dept. of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India

vrdarla@gmail.com

13-2-2009 సాయంత్రం ఆరు గంటలు కాకుండానేహైదరాబాదు ప్రెస్ క్లబ్బులో కైతునకల దండెం (అనేక కులాల వాళ్ళు రాసిన మొట్టమొదటి మాదిగ కవిత్వ సంకలనం) ఆవిష్కరణ సభ ప్రారంభమైంది. నిజానికి అది ఒక సాహిత్య సదస్సులా జరిగింది. రాష్ట్ర నలు మూలల నుండీ కవులూ, రచయితలు, కళాకారులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడం వల్ల ఆరున్నరకు గానీ నేను వెళ్ళలేక పోయాను. అప్పటికే దండోరా ప్రచురణల సమన్వకర్త, కవితా సంకలనం సంపాదకుడు కృపాకర మాదిగ మాట్లాడుతున్నారు. నన్ను గమనించి వేదిక పైకి ఆహ్వానించారు. అప్పటికే వేదిక పై ఆచార్య ననుమాసస్వామి, డా//అద్దేపల్లి రామమోహన రావు, డా//కనకయ్య, వేముల ఎల్లయ్య, షాజహానా, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు, చెప్పులు కుట్టుకొనే మాదిగ వృత్తి కార్మికుడు ఈతకోటి తుక్కేశ్వరరావు లు వేదిక పై కూర్చున్నారు.

సభాధ్యక్షుడుగా వేముల ఎల్లయ్య గారు, సమీక్షకులుగా డా//కనకయ్య, నేను (డా//దార్ల వెంకటేశ్వరరావు) పాల్గొనగా, మిగతావాళ్ళు సందేశాన్నిచ్చే అతిధులు గాను, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు శ్రీమతి సిర్రాసులోచన., ఈతకోటి తుక్కేశ్వరరావులు గ్రంథావిష్కర్తలుగా పాల్గొన్నారు.

ఈతకోట తుక్కేశ్వరరావు అమలాపురం లో అనేక సంవత్సరాలుగా చెప్పులు కుట్టుకుంటూనే మాదిగ హక్కుల దండోరా కోసం కృషి చేస్తున్న వారు. వీరిద్దరి చేతా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

వారి అనుభవాలను మాదిగ కవులు బ్లాగులోపెట్టిన వీడియో ద్వారా వినవచ్చు.

పుస్తకాన్ని సమీక్షిస్తూ డా// కనకయ్య మంచి కవితలను ఎంపిక చేశారనీ, అయితే అనేక కవితల్లో మాదిగల ఆహార విషయాలే ముఖ్యంగా మాంసం, ఎండు తునకలు వంటి పదాలను పదేపదే చెప్పుకోవలసిన అవసరం లేదనీ, మరికొన్ని కొత్త ఆలోచనలతో కవిత్వం రాయాలని సూచించారు.

నేను తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకు రాబోతున్న కవిత్వసంకలనం కైతునకల దండెం అని అభివర్ణించాను. గతంలో మా మాదిగ సాహితీవేత్తలు ఆశించిన రీతిలో నేటికైనా మాదిగహక్కుల దండోరా వాళ్ళు సాహిత్యాన్ని కూడా ప్రచురించడం సంతోషించదగిన పరిణామమని చెప్పాను. కేవలం సామాజిక ఉద్యమాలే కాకుండా, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు ఏజాతినైనా తాత్త్వికంగా నిలబెడతాయని, ఆ దిశగా ఈ పుస్తకం రావడం వల్ల మాదిగల సాంస్కృతిక అంశాలను వివరించి, మాదిగలను మరింత చైతన్యవంతంగా జీవించేటట్లు చేసే ఆలోచనకు ఇది అంకురార్పణ కాపోతుందని అన్నాను. దీనికి కైతునకల దండెం పేరుపెట్టడంలోనే మాదిగల సాంస్కృతిక చైతన్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఆరాటం కూడా కనిపిస్తుందని వ్యాఖ్యానించాను.ఈ పుస్తకంలో కేవలం మాదిగల కవితలే కాకుండా , అనేక కులాల వారి కవితలు ఉండటం, సభలో కేవల మాదిగలే పాల్గొనేటట్లు, మాట్లాడేటట్లు కాకుండా అన్ని వర్గాల వారిని ఆహ్వానించడాన్ని మాదిగల సమైక్యతకు నిదర్శనంగానూ, తమ గురించి మాట్లేడే వారిని, రాసే వారిని, తమని ఆదరించేవారిని ఎప్పుడూ గౌరవించుకుంటామని చెప్పడానికి ఈ సభే నిదర్శనం అని వ్యాఖ్యనించాను. దీని వల్ల మాదిగలు అనైక్యతను కోరుకోవడం లేదనీ, సమైక్యతనే కోరుకుంటున్నారని, అయితే ఆ సమైక్యత ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని కోరుకోవడాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాదిగలు చేసేది దళితులను విడదీసే చర్యగా వక్రీకరిస్తున్నారని వివరించాను. మా సమస్యలు ముందు పెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మాకే పీఠాలు దక్కాలనేమీ లేదనీ, దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కృపాకర్ మాదిగ, జూపాక సుభద్రలేనని , వాళ్ళు ఈ కవితలను సేకరించడానికీ, పుస్తకంగా తీసుకొనిరావడానికి పడిని శ్రమను కూడా మరిచి పోయి, వాళ్ళు వేదిక పైన కాకుండా, సభలో అందరితోనూ కూర్చున్నారని చూపించాను.

ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర,, సంస్కృతి, మాదిగలకు జరుగుతున్న అన్యాయం, ఆ అన్యాయం నుండి వస్తున్న అనుభూతులను, ఆవేదనలను, న్యాయం కోసం పడుతున్న తపనను చూడవలసిఉంటుందన్నాను. మాదిగలు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన వర్గీకరణ ఫలాలను సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక కారణాలను చూపి రాజ్యాంగ రీత్యా వర్గీకరణ చెల్లదనడంతో మాదిగల జీవితాల్లో ప్రవేశించిన శూన్యాన్ని, నిస్సహాయతనూ, దిక్కుతోచని తనాన్నీ కూడా ఈ పుస్తకంలో కవిత్వమై పలకరించడాన్ని చూడవచ్చని వివరించాను. తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాదిగల జీవితాన్నే ఆధారంగా చేసుకొని దళితులను వర్ణించారనీ, అయినా దళితుల్లో అంతర్భాగంగా నే మాదిగలను చూస్తున్నారని, అలా చూడ్డంలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుందని వివరించాను. సాహిత్యంలో దళిత సంస్కృతి అంతా మాదిగ జీవన విధానం చుట్టూనే అలముకున్నా, మాదిగల వృత్తి చిహ్నాలను, సంస్కృతిని వాడుకుంటూనే మాదిగల వేదనను పైకి రానివ్వడం లేదని పేర్కొన్నాను. ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయ స్థాయిల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే, ఇక పై మాదిగసాహిత్యంలో అంతర్భాగమే దళిత సాహిత్యంగా పరిగణించడం సమంజసమని, ఆదిశగానే మాదిగ సాహిత్యం పేరుతోనే ముందుకు వస్తామని, ఈ కొత్త ప్రతిపాదనను సాహితీ మేధావులు ఆహ్వానించాలని కోరాను. ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర, సాంస్కృతిక పరమైన అంశాలను ఆయా కవులు చెప్పేటప్పుడు తమ అనుభవాలను చిలకరిస్తున్నప్పుడు విడివిడిగా అవి స్వతంత్ర అస్తిత్వాన్నీకలిగి ఉంటాయనీ, అయితే అవన్నీ ఇలా పుస్తకరూపంలోకొచ్చినప్పుడు పునరుక్తిలా కనిపిస్తాయని అది మాదిగ కవుల దోషం కాదనీ స్పష్టం చేశాను. అంతే కాకుండ వక్రీకరణకు గురికాబడుతున్న చరిత్రను, సంస్కృతిని కాపాడుకొనే దిశగా ప్రయత్నిస్తున్న మాదిగలు బలవంతంగా తమపై రుద్దిన సాంస్కృతిక అంశాలను, మళ్ళీ ఇప్పుడు మంచివి కాదనడాన్ని తరస్కరించడంలో కనిపించే దిక్కారస్వరాన్ని గుర్తించాలని కోరాను. గొడ్డు మాంసం తినడం వెనుక గల చారిత్రక అంశాలను పరిశోధించవలసి ఉందన్నాను,

ఈ కవితాసంకలనానికి సంపాదకులు రాసిన ముందుమాట మాదిగ సాహిత్యానికి మ్యానిఫెష్టో వంటిదని, మాదిగ సాహిత్యం స్వతంత్ర అస్తిత్వాన్ని కోరుకోవడం వెనుక గల చారిత్రక అంశాలను సోదాహరణంగా వివరించడం జరిగిందని కొన్నింటిని చదివి వివరించాను. మాదిగ సాహిత్యాన్ని ఎవరైనా రాయవచ్చనీ, అయితే మాదిగల హృదయాన్ని ఆవిష్కరించేలా, జీవితం ప్రతిఫలించేలా ఉండాలని ముందుమాటలో ప్రకటించిన విషయాన్ని గుర్తించాలని చెప్పిన అంశాన్ని వివరించాను. మాదిగ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి ఈ కవితా సంకలనం రచయితల్లో పునరుజ్జీవనం తీసుకొస్తుందని ప్రకటించాను.

సభలో పాల్గొన్న షాజహానా కవితల్లో కనిపించే స్త్రీవాద దృక్పథాన్ని విశ్లేషించారు. ప్రాంతీయ కోణంతో కూడా కవితలు ఉంటే బాగుండేదని, అలాగే ముస్లిం రచయితలు కూడా మాదిగల గురించి రాసిన కవితలను తీసుకుంటే మరింత సమగ్రంగా ఉండేదని సూచించారు. తన జీవితంలో ఎదురైన వివిధ సంఘటనలను వివరించారు.

డా//అద్దేపల్లి రామమోహన రావు మాదిగ సాహిత్యాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఆచార్య ననుమాస స్వామి కవితలను, గేయ బాణీలతో ఉన్న కవితలను విశ్లేషించారు. సభలో మధ్యమధ్యలో కవులను పిలిపించి మాట్లాడించడం, కళాకారులను పిలిచి పాటలు పాడించడం, వీటితో పాటు మాదిగేతర సాహితీవేత్తలను మాట్లాడించి మాదిగ హక్కుల ఉద్యమాన్నిబలపరిచే వ్యూహంతో సభను జరిపారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన చెప్పులు కుట్టుకొని జీవించే ఈతకోటి తుక్కేశ్వరరావు మాట్లాడుతూ ఇలా తనతో ఒక పుస్తకాన్ని, అదీ హైదరాబాదులో ఆవిష్కరించడాన్ని జన్మలో మరిచిపోలేనని మాదిగ వాడిగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైందని అశ్రునయనాలతో స్పందించారు. కారంచేడులో జరిగిన సంఘటన దళితులను, అందులోనూ మాదిగనే ఊచకోత కోసిన మారణకాండను, అప్పుడు జరిగిన సంఘటనల్లో ప్రాణం పోగొట్టుకున్న తన భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమైయ్యారు శ్రీమతి సిర్రాసులోచన. ఈ రెండు స్పందనలూ అందరినీ కదలకుండా చేసేశాయి.

ఇలా ఒక చారిత్రక ఘట్టంగా కైతునకలదండెం కవితాసంకలనం ఆవిష్కరణ సభ జరిగింది. మరలా దిగంబర సాహిత్యం ఆవిష్కరణ సభలను గుర్తుతెచ్చేలా ఈ సభ జరిగిందని అక్కడికి వచ్చిన వారంతా అభిప్రాయపడ్డారు.

దీన్ని మన సాహిత్య చరిత్ర కారులు ఎంతవరకూ, ఎలాంటి ప్రాధాన్యతనిస్తూ గుర్తిస్తారో వేచి చూడాలి

Add comment February 24, 2009

ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం

-డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,గచ్చిబౌలి,
హైదరబాదు.

1.0 ప్రస్తావన:

తెలుగులో స్త్రీవాదం వచ్చిన తరువాత, దళిత , ముస్లిం మైనారిటీ వాదంలోనూ స్త్రీ లు తమ సమస్యలను కవిత్వీకరిస్తున్నారు. అంతకు ముందు పురుషులే స్త్రీ సమస్యలను కొంతవరకూ స్పర్శిస్తూ కవిత్వం రాశారు. అయితే స్త్రీలు రాసిన కవిత్వంలో మరింత బలంగా ముస్లిం స్త్రీ సమస్యలు అభివ్యక్తయ్యాయి.
ముస్లిం స్త్రీ సమస్యలను షాజహానా, మున్వీరునిసా, మహేజబీన్, షహనాజ్ ఫాతిమా మొదలైన వాళ్ళు స్త్రీవాద దృక్పథంతో కవిత్వీకరిస్తున్నారు. షాజహానా రాసిన “నఖాబ్”( 2005) కవితా సంకలనం ముస్లిం స్త్రీ వాదానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతకు ముందు వచ్చిన ‘’జల్ జలా’’(1998) కవితా సంకలనంలో కూడా స్త్రీ వాద సమస్యలను వర్ణిస్తూ పురుషులు కవిత్వం రాశారు. ఖాదర్ మొహియుద్దిన్ ‘’పుట్టుమచ్చ’’(1991)లో, గుజరాత్ సంఘటనల తరువాత ‘’గుజరాత్ గాయం’’, ‘’ఆజా’’, ముస్లింల సాహిత్య ప్రత్యేక సంకలనం’’ ముల్కి’’(2005), ‘’అలావా’’(2006) కవితా సంకలనం, స్కై బాబా రాసిన ‘’జగన్కీరాత్’’, ఖాజా ‘’ఫత్వా’’(1998) మొదలైన వాటిలో ముస్లిం స్త్రీ వాదం కనిపిస్తుంది.
ఇంటిలో స్త్రీ పురుషుల మధ్య కనిపించే వివక్ష ఇతర స్త్రీలకున్నట్లే ముస్లిం స్త్రీలలోనూ ఉంది. కానీ, ఉన్నత విద్యనభ్యసించనివ్వకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడం మొదలైన వాటి విషయంలో ముస్లిం స్త్రీలు మరింత వివక్షకు గురవుతున్నారు. బయటకు కనిపించే బురఖా, ఆ బురఖా వెనుక ఎన్నో నిర్భందాలు, బహు భార్యత్వ సమస్య, బహు సంతానోత్పత్తి కోసం అనుభవించే లైంగిక వివక్ష, భర్త చనిపోతే స్త్రీ పునర్వివాహం పట్ల తలెత్తుతున్నఅనేక పరిణామాలు మొదలైన సమస్యలు ముస్లిం స్త్రీ వాదంలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా, పురుషాధిపత్యం, కుటుంబ హింస, ఆర్థిక, సాంస్కృతిక విద్యా కారణాల వల్ల చాలామంది విడాకుల కోసం “తలాఖ్” చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ కారణాల వల్ల పరదే్శాలకు వలస పోయిన తరువాత స్త్రీలు పొందే కష్టాలు, బాలికలను ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేసే పద్ధతి, దాని వెనుక స్త్రీ ఆంతరంగిక మనస్తత్వం వంటివన్నీ ముస్లిం స్త్రీ వాదంలో కవయిత్రులు వర్ణిస్తున్నారు. దీని తెలుసుకొనే ముందు ముస్లిం మైనారిటీ సాహిత్యం అంటే ఏమిటో సంక్షిప్తంగానైనా తెలుసుకొంటే బాగుంటుంది.
1.1 ముస్లిం మైనారిటీ వాదం:
తెలుగు సాహిత్యంలో “మైనారిటీ వాదం” అనే పేరు వినిపిస్తుంది. Minority అనగా “అల్ప సంఖ్యాకులు” అని అర్థం. భారతీయ జనాభా లెక్కలప్రకారం హిందువుల తర్వాత స్థానంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన వారు సంఖ్యాపరమైన క్రమంలోకనిపిస్తున్నారు. హిందువులు తప్ప మిగిలిన వారంతా ఇంచుమించు అల్పసంఖ్యాకులే. అయినప్పటికీ అల్ప సంఖ్యాకులైన ముస్లింలు తమ కష్టనష్టాలను అభివ్యక్తి కరించే సాహిత్యాన్ని “మైనారిటీ వాదం” అంటున్నారు. తెలుగు సాహిత్యంలో ‘మైనారిటీ వాదం’ అనేది ఒక పారిభాషిక పదంగా మారింది. ప్రపంచ వ్యాప్త పరిస్థితులను బట్టి తమ సమస్యలలోప్రత్యేకత ఉందని అల్ప సంఖ్యాక వర్గం కావడం వల్ల అభద్రత భావం నెలకొందని భావిస్తున్న ముస్లింల మనోభావాలను ప్రతిఫలిస్తు వస్తున్న సాహిత్యమే మైనారిటీ వాద సాహిత్యం. దీన్ని “మైనారిటీ వాద సాహిత్యం”,” ముస్లిం సాహిత్య వాదం”, “మైనారిటీవాదం” వంటి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ స్వరూప స్వభావాలను సాధారణీకరించి తెలుగు సాహిత్యంలో ముస్లింల ప్రత్యేక అనుభవాలవ్యక్తీకరణను గుర్తించ గలిగే విధంగా దీనిని “ముస్లిం మైనారిటీ వాదం” అని పిలవడం సమజసంగా ఉంటుంది.
1.2 ముస్లిం మైనారిటీ వాదం – నిర్వచనం:
1) ముస్లిం మనోభావాలను శక్తి వంతంగా “పుట్టు మచ్చ” కవిత ద్వారా వ్యక్తీకరించిన ఖాద్దర్ మొహియిద్దిన్‌ గారి ప్రకారం – “ముస్లిం వాదం అంటే ముఖ్యంగా ముస్లిం ఆలోచనల చట్టం అన్నారు. దీన్ని మరింత వివరిస్తూ “ముస్లిం తత్త్వం, ముస్లిం తాత్త్విక దృక్పథం,ముస్లింలు గతాన్ని ఎలా చూడాలి ?తమ భవిష్యత్ ను ఎలా నిర్మించుకోవాలి? ఈ రెండింటికి సబంధించిన వివిధ అంశాల పట్ల ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి? వీటిని వివరించేదే ముస్లిం తాత్త్విక దృక్పథం. ఈదృక్పథాన్ని సాహిత్య కళారంగాల్లో ఎలా ప్రతిఫలింపజేయాలో వివరించేదేముస్లిం సాహిత్య దృక్పథం” అని ముస్లిం సంస్కృతి కవిత్వం”అలావా ” కు రాసిన ముందుమాట (సూఫీతత్వమే సరైనా మార్గం..)లోఖాద్దర్ మొహియిద్దిన్ అన్నారు. ఈయనే ముస్లిం మైనారిటీ వాదాన్ని ఇంకొంచెం లోతుగా వివరిస్తూ “ముస్లిం వాదమంటే ఒక ధార్మిక సముదాయంగా తన గతిని స్థితిని తను దర్శించుకునే చైతన్యం. తనవైన ప్రతీకలు చిహ్నల ద్వారా తనదైన ఒక అభివ్యక్తి అంతేకాదు . ముస్లిం వాదం అంటే భారతీయ ముస్లిం సంస్కృతిక విలువల పట్ల , ఆ మాటకి వస్తే మొత్తం ప్రాశ్చ ప్రపంచ సాంస్కృతిక విలువల పట్ల, సార్వజనీయమైన మానవత విలువల పట్ల ఒక నిబద్ధత, ఒక జాగురూకత . వాటిని పరిరక్షించుకునే ఒక ప్రయత్నం. వాటి అభివృద్ధి ని కాంక్షించే ఒక సంకల్పం. తెలుగు ద్వారా భారతీయ సాహిత్యాన్నికి తద్వారా మానవ నాగరీకతకి అందుతున్న అపూర్వమైన ఒక అదనపు విలువ ముస్లింవాదం.ముస్లింవాదం తనలోనే తానొక ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ముస్లిం వాదం తనకోసం తనదైన పద్ధతిలొ తన ఉనికిని లోకాన్నికి చాటి చెప్పేందుకు సృష్టించిన సృజనాత్మక నినాదం” అని అన్నారు.
2)ముస్లిం మైనారిటీ వాదం గురించి కొన్ని వ్యాసాలు రాసిన ప్రముఖ విమర్శకురాలు ముదిగంటి సుజాతరెడ్డి గారి అభిప్రాయంలో “మైనారిటీ వాదం అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన మతపరంగా అల్పసంఖ్యలో ఉన్నవారందరూ ఉండాలి. కాని వారు ఎవ్వరూ ఈ అభివ్యక్తిలో లేరు. క్రిస్టియన్ ల వేదన కొంత వరకు దళిత వాద కవిత్వంలో ప్రకటితమవుతుంది. ఇంక కేవలం ముస్లింల వేదన ప్రకటించేదే మైనారిటీ వాదంగా కనిపిస్తుంది. భారతదేశపు విశాలమైన దేశీయ సమాజంలో భాగంగా గుర్తింపబడక పోవడం అనే ఆవేదన అందరిచేత కాకున్న కొందరి లెక్కల్లో దేశ ద్రోహులుగా తప్పుడు ప్రచారం చేయబడుతున్న బాధ మైనారిటీ వాదంలోని ముస్లిం సాహిత్యంలో వ్యక్తమవుతున్నది. ఇది కేవలం కాషాయమూకలకు వ్యతిరేకంగాను, ఫ్యాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగాను లేస్తున్న సాహిత్యోద్యమం కాదు. కాని మతోన్మాద శక్తులు చూపే వివిక్ష ,అంటగట్టే దేశ ద్రోహత్వం , జరిపే హింసకు కుమిలిపోతు బయటకు వ్యక్తం చేసే వేదన మైనారిటీ కవిత్వంలో కనిపిస్తుంది.” అని ఈ మైనారిటీ సాహిత్య స్వభావం గురించి వివరించారు. ( “ముల్కి- ముస్లిం సాహిత్య సంకలనం, 2005: 93)
3) ముస్లిం మైనారిటీ వాదాన్ని ఉద్యమప్రాయంగా ముందుకు తీసుకువెళితున్న స్కై బాబా అభిప్రాయంలో – “భారతదేశంలోని ముస్లింలు ప్రత్యేక పరిస్థితుల రీత్యా ముస్లిం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాల్ని గురించి ముస్లిం వాదం మాట్లాడుతుంది. మతం వ్యక్తిగతం అనే స్పృహతో మతం జోలికి ముస్లింవాదం వెళ్లదు. కాని, ముస్లింల జీవన మార్గాని కి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులుగా నిలుస్తున్న అంశాల పట్ల స్పందిస్తుంది. ముస్లింలను అణిచి వేస్తున్న మూల శత్రువుతో పోరాడుతునే అంతర్గత వైరుధ్యాలను వదలకుండా బాహ్య అంతర రెండు పోరాటాలు చేయడం ముస్లింవాదం ప్రత్యేకత. హిదుత్వ దాష్టీకాన్ని ప్రశిస్తూనే అంతర్గతంగా ముస్లిం స్త్రీల గురించి, దూదేకుల గురించి ముస్లింలోని ఛాందసత్వం గురించి, ముస్లిం సమాజంలో జరగవలసిన సంస్కరణ ల గురించి, తమ మూలాల వెతుకులాట గురించి ఎంతో సాహిత్యాన్ని సృష్టించటం ఆ సాహిత్య ప్రత్యేకత “అని అన్నారు. ( “అలావా ” ముస్లిం సంస్కృతి కవిత్వం, 2006 :18)
మొత్తం మీద ముస్లిం మైనారిటీవాద సాహిత్యం ఒకవైపు స్వీయమతంలోని మూఢాచారాలను ఖండిస్తూ మరొక వైపు మాతృదేశంలోతమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ అగ్ర వర్గానికి కింది వర్గానికి మధ్య నలిగిపోతూ తాము ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తూ రాసున్న సాహిత్యం “ముస్లిం మైనారిటీ వాద సాహిత్యం” అని నిర్వచించుకోవచ్చు.
1.3 ముస్లిం మైనారిటీ కవిత్వం – స్త్రీవాద దృక్పథం:
ఈ వ్యాసంలో ముందే ప్రస్తావించినట్లు వివక్షను ఆధారంగా చేసుకొని ముస్లిం స్త్రీవాదం వచ్చింది. మతాన్ని ఆధారంగా చేసుకొనే ఇంచుమించు అన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికి ఆయా సమస్యలను బట్టి కింది విధంగా ముస్లిం స్త్రీవాదాన్ని వివరించుకునే అవకాశం ఉంది.
1.3.1 మతాంతరీకరణ – భాషా సమస్య:
వివిధ పాలన, సాంఘిక, మతకారణాల వల్ల కొన్ని సామాజిక వర్ణాల వాళ్ళు ముస్లింలుగా మతాంతరీకరణ చెందడం వల్ల భాష, ఆచార వ్యవహారాల్లో కలిగే ఇబ్బందులను కూడా ముస్లిం స్త్రీలు కవిత్వీకరిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని కవితా ఖండికలను చూస్తే ముస్లిం స్త్రీ వాదం ఎలా ఉందో తెలుస్తుంది. ముస్లిం స్త్రీ పరంగా వారి మనోభావాలను వర్ణించడంలో చేయి తిరిగిన రచయిత్రి షాజాహానా. ఆమె “లద్దాఫ్ని ” పేరుతో రాసిన కవితలో ముస్లింలలో ‘లద్దాఫ్ ‘ స్త్రీ మానసిక జీవితాన్ని చిత్రించారు. వచ్చీ రాని ఉర్దూ పదాలతో మాట్లాడుతుంటే ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడం కోసం ఉర్దూ నేర్చుకోవాలనే వారి ప్రయత్నం, ఆ భాష రాక, తన మాతృ భాషలోనే మాట్లడితే వచ్చే నష్టమేమిటనే ప్రతిఘటన స్వరాన్ని కూడా వినిపించగలిగారు కవయిత్రి. ‘భాష ‘ భావాభివ్యక్తికి బలమైన వాహిక మాత్రమే తప్ప. ఫలానా భాషలోనే మాట్లాడాలనే నియమం లేదని ఒక శాస్త్రీయమైన ఆలోచనను ప్రతిఘటన స్వరంతో ప్రతిధ్వనిస్తూ…”వచ్చోరాదో – నా ఉర్దూ పరిజ్ఞానం మీదవాళ్ళ కుతూహల ప్రావీణ్య ప్రదర్శన జరిగినప్పుడు -”తెగించి – బయటకు రాలేని మొహమాటపు నీటి చుక్కలుకంటె కొనల్లో ఇరుక్కొని అచ్చం నాలాగే అల్లాడతాయ”ని వర్ణించారు. ముస్లిం స్త్రీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిని వర్ణిస్తూ -”వాళ్ళ ఉరుదూ జరీ చీరల సమూహాల గల గలల మెరుపుల ముందునా గొంతు కాటన్ చీరై బిక్కు బిక్కుమంటూఒంటరిగా ముడుచుకుంటుంది.” అని ఆ పరిస్థితిని జరీ చీరల మధ్య కాటన్ చీర తెల్లబోయిన దృశ్యాలతో పోల్చారు కవయిత్రి. జరీ చీరలను ముస్లింల లోని ఉన్నత వర్గానికి, కాటం చీరను కింది వర్గానికి ప్రతీక చేసి వర్ణించారు కవయిత్రి. దీని ద్వారా ముస్లింలలోని వర్గ సమస్యను కూడా చెప్పినట్లయింది. అవమానాల నుండి ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తూ -” నీ దూదేకుల తనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడుఅస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?” అంటుంది కవయిత్రి “లదాహీ రహూంగీ” అంటూ కవితను ముగించారు.
1.3.2 సంతానోత్పత్తి – లైంగిక హింస:
ముస్లిం స్త్రీ అనగానే చాలా మందిలో వినిపించే మాట అనేకమందికి జన్మనివ్వడానికి పుట్టిన స్త్రీ! ఈ సమస్యను శక్తి వంతంగా కవిత్వీకరించారు ‘షహనాజీ పాతిమా”!” ఓపిగ్గా అసంఖ్యాక వారసుల్నిచ్చేసంతానోత్పత్తి కర్మాగారం…అనాదిగా ఆధారపడ్డం అలవాటు చేయబడినస్వయం ప్రతిపత్తి లేని పరాధీన ” గా ముస్లిం స్త్రీ బతుకుని వెళ్ళదీస్తున్న దృశ్యాన్ని అభివర్ణించారు కవయిత్రి . ‘ఖబర్దార్’ అనే కవితలో ముస్లిం స్త్రీ అనుభవిస్తున్న లైంగిక హింసను షాజహానా ఇలా వర్ణించారు.” మీ సుఖంకోసంప్రాణం చీల్చుకు పన్నెండు మందిని కనమనండిలేకపోతే నరకంఇప్పుడు అనుభవిస్తున్నదే పక్కా స్వర్గం”ఇలా వర్ణించి వదిలేయలేదు కవితను. తిరుగుబాటు తత్వాన్ని పేరేపిస్తూ ఇలా అంటారు.” మమ్మల్ని మౌన మాంసాలుగాఉత్పత్తి యంత్రాలుగా బతకమన్న మీ సంప్రదాయానికో సలాం”ఇక్కడ షాజహానా కవితలో ముస్లిం స్త్రీ వేదనను వర్ణించటమే కాకుండా సమస్య పరిష్కారానికి మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. సంప్రదాయంలో ఉన్నంత కాలం స్త్రీకి విముక్తి లేదనేది ముస్లిం స్త్రీలు గుర్తించాలని కవయిత్రి భావిస్తున్నారు.
1.3.3 వివాహం -బహు భార్యత్వం:
ముస్లింలకు పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ లో ముస్లిం వివాహ వ్యవస్థ గురించిఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బహూ భార్యాత్వాన్ని అంగీకరించ వచ్చునని స్పష్టంగానే ఉంది. దీన్ని వక్రీకరిస్తూ, మత పెద్దల అండ దండలతో స్త్రీ మనోభి ప్రాయాలను విలువనివ్వకుండా జరుగుతున్న వివాహం గురించి, ఆ వివాహాల వెనుక ఉండే దయనీయ గాథల గురించి కూడా కవిత్వం వచ్చింది.” నేనొక అరబ్బు కామ వాంఛకుబలైన బొమ్మను…..పరదేశానికి అమ్ముడైనఅంగడి బొమ్మను నేను….కన్న వాళ్ళ అసహాయితకుకటిక పేదరికానికిబలిపీఠం ఎక్కుతున్న వాళ్ళంమేము కేవలం బొమ్మలం ” ఒకవైపు పేదరికం, మరొక వైపు మూఢత్వం చేసే పెత్తనం. ఈ రెండింటి మధ్య బొమ్మల్లా మారిపోతున్న స్త్రీల గురించి మున్వీరున్నీసా రాసిన “గుడియా” కవిత గొప్ప నిదర్శనం!
1.4 ఉపసంహారం:
ముస్లిం స్త్రీవాదం గురించి మాట్లాడుతూ డా// ఎండ్లూరి సుధాకర్ ఇలా అన్నారు. “ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది. ఇక్కడ సానుభూతికి తావులేదు. ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం స్త్రీ ఉనికిని నిర్ధారిస్తుంది.” (ముల్కీ 2005 – 95) ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే ముస్లిం స్త్రీవాదం గురించి ముస్లిం స్త్రీల రచనలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతరుల రచనలను తీసుకున్న ముస్లిం స్త్రీలు రాసినదానికున్నంత ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం లేదని గుర్తించాలి. అంతే తప్ప ఇతరులు రాయకూడదని కాదు. ఈ పత్రంలో ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వాన్నే ప్రధానంగా తీసుకొని విశ్లేషించడం జరిగింది. ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వంలో వారి బాధలు వెల్లడవుతున్నాయి. ఇతర మతాలు, వర్ణాలలో కంటే ముస్లిం స్త్రీ ఇస్లాం మతంలో మరింత పీడనకు గురవుతుందని ముస్లిం స్త్రీవాదం వల్ల స్పష్టమవుతుంది. వస్తువులో వచ్చిన నవ్యత శిల్పంలో కూడా ప్రవేశించి తెలుగు సాహిత్యానికి మరింత సొగసుని అందించిందని చెప్పుకోవచ్చు. ముస్లిం సాహిత్యం రాస్తున్న కొద్దిమందిలో స్త్రీవాద దృక్పథంతో రాస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలోను శక్తివంతంగా రాసే కవయిత్రిగా నిలుస్తున్నారు. ఈ విధంగా విశ్లేషించుకున్నపుడు ముస్లిం స్త్రీవాదం షాజహానా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ముస్లిం సమస్యలు మరిన్ని బయటకు రావాలంటే ముస్లిం మహిళలు మరింత మంది చదువుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇస్లాం మతంలోని కొన్ని లోపాలు స్త్రీ పాలిట శాపాలుగా వక్రీకరించని పరిస్థితి నెలకొంటుంది.
ఆధార గ్రంథాలు:
1. నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం) షాజహానా, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. ఫిబ్రవరి, 20052. ముల్కీ (ముస్లిం సాహిత్య సంకలనం) సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్. జూలై, 2005.3. అలావా (ముస్లిం సంస్కృతి కవిత్వం) సంపాదకులు: షాజహానా, స్కైబాబ, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. జూలై, 2006.
Published an article on Muslim Minority Kavithvamlo streevaadadrukptham , Hyderabad Mirror Daily Literary Supplement on Dec.02nd2007,( Page No:06), and also published in UGC National seminar special issue, published by Dept.of.Telugu, Bandlamudi Hanumayamma Hindu Mahila Degree Kalasala, Guntur, A.P., Page No :74-76

1 comment February 24, 2009

కులం – వర్గం : శంబుక దృక్పథం

డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,గచ్చిబౌలి,
హైదరబాదు
సమాజాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, సమకాలీన సాహిత్యాన్నీ, అందులోనూ దళిత సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అవసరం ! దళితుల భాగస్వామ్యంలేని భారతీయ సమాజాభివృద్ధిని ఊహించడం అసాధ్యం. కులవివక్షను అనుభవిస్తూ, తప్పనిసరై చేస్తున్న వృత్తులు, కులవృత్తులుగా వంశపారంపర్యం కావడం , అవి దేశ సంపదకు ప్రధానమైనా, వాళ్ళెలా అప్రధానమయ్యారో శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యడం ప్రస్తుత అవసరం. నిషేధాలు , సానుభూతులు, సంఘర్షణలు, సహకారాలు దళిత జీవితాల్లో ఎలా పెనవేసుకుపోయాయో, అవన్నీ భారతీయ సమాజంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలియకపోతే, సంక్లిష్టమైన సమాజాన్ని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. ఈ సంక్లిష్టత అర్థం కావాలంటే, దళిత జీవితం, దళిత సాహిత్యం అవగాహనకు రావాలి . చాలామంది రచనలు చేసేవాళ్ళు, సమాజ సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో , అవగాహన చేసుకోవడంలో, వాటిని ఆవిష్కరించడంలో, రచనలు చేసే వారి జీవన నేపథ్యాలను బట్టి కూడా సాహిత్య ప్రతిఫలనం జరుగుతుంటుంది. ఈ ప్రతిఫలనం దళిత సాహిత్యంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది . అయితే, కేవలం రచనలను బట్టే , రచన చేసిన వారి స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయడానికీ కొన్ని సమస్యలున్నాయి.
ప్రత్యక్షంగా దళితులను వ్యతిరేకిస్తూ, అణచివేస్తూ, ఆ దళితులనే పునాదులుగా చేసుకొని ‘ అభివృద్ధి ‘ లోకి వస్తున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు . అలాగే చదువుకున్న మేథావులు కూడా, దళిత సాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ , బయటకొచ్చి, వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలను దంచేస్తుంటారు . అవసరమైతే రాశామని చెప్పుకోవడానికి సానుభూతి దిగతుడుపుగా, దళిత సాహిత్యాన్ని రాస్తుంటారు . దానివల్ల వస్తే, గిస్తే, సన్మానాలు, బహుమతులు అందుకోవడానికీ వెనుకాడరు. దళితులుగా పుట్టిన వాళ్ళూ దళితులం కాదంటునే , దళితులకొచ్చే అన్ని అవకాశాల్నీ కొల్లగొట్టేయడంలో, ఇతర కులాలకే మాత్రం తీసిపోలేదని కొంతమంది నిరూపిస్తున్నారు . నిజానికి ఇతర కులాల వాళ్ళు, వీళ్ళకంటే కొంత నయమనిపిస్తుంటుంది . ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు , చైతన్యవంతులైతే ఏదొకరూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారిలో ‘ శంబుక ‘ ఒకడు !
1.1. శంబుక దళిత చైతన్యం:
శంబుక పేరుపెట్టుకున్న ప్రత్తిపాటి మల్లేశ్వరరావు సమకాలీన సమాజంలో కనిపించే హిపోక్రసీని చూస్తూ, నోరు మూసుకుని , కాళ్ళూ చేతులుకట్టుకొని, ఏమూలనో దాక్కుంటూ, తన పబ్బం గడిపేసుకుందామనుకోలేదు . మాటై, పాటై, ఉద్యమ బాటై స్పందించారు . తన భావాలను కవిత్వంగా అందించారు. తన ఆలోచనలను పరిశోధనాత్మకంగా ” ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం – ఒక పరిశీలన ” లోనూ, ” చరిత్రలో క్రైస్తవం – ఒక పరిశీలన ” లోనూ స్పష్టంగానే చెప్పారు .
ఆశలు రేపినా కూడా ఆవేశంతో ముంచేసింది మార్క్సిస్టుల మార్గం, ఆవేశాన్ని అణచివేసి, కులం రంగు పూసుకుని , వివక్షను ప్రదర్శించే ‘మతం’ మార్గంలో మరొకటి దళితులను దగా చేసిందని నోరెత్తి, హోరెత్తి అక్షరమై ఆ గ్రంథాల్లో ధ్వనింప చేశారు శంబుక .
కుల నిర్మూలనకు, దాని అవగాహనకు, తద్వారా సమాజం చైతన్యవంతం కావడానికీ ఆధునిక ఆలోచనలనూ పంచాలనే ఆశయంతో నాస్తిక సమాజంలో చేరి , ప్రతీ విషయాన్ని దేవుడితో ముడిపెట్టే కర్మసిద్ధాంతాన్ని ఖండించారు. ఆధునిక భారతీయ సమాజంలో దళితపల్లె కూడా ఒకటవ్వాలని కలలుగన్నారు .
‘శంబుక ‘ చరిత్రను చెప్పడానికీ వ్యాసం రాయడం లేదు! శంబుక చైతన్యాన్ని మరొకసారి స్మరించుకోవడానికే ఈ ప్రయత్నం. దళిత సాహిత్యంలో తమకోసం జీవితాలను త్యాగాలను చేసిన వారిని స్మరించుకొంటూ, చైతన్యం పొందడమనే లక్షణం ఒకటి ఉంది. దీనిలో భాగమే ‘ శంబుక ‘ పై ఈ వ్యాసం. శంబుక రాసిన కవిత్వంలో కనిపించే దళిత దృక్పథాన్ని చెప్పాలనుకుంటున్నాను. 1958 డిసెంబర్ 9 న పుట్టి, గుంటూరు పరరిసరాలు చైతన్యవంతం చేయడంలో తనవంతు పాత్ర నిర్వహించిన శంబుకను మార్క్సిస్టు దళారీలు ఏప్రిల్ ఒకటో తేదీ, 1995 న దారుణంగా హత్య చేశారు.
‘శంబుక’ ఆశించిందేమిటి? ఆయన కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలో, దళిత సాహిత్యం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని వివరించుకునే ముందు దళిత కవితాభివ్యక్తిలో ఉండే ప్రత్యేక అంశాలను చర్చించుకుంటే మంచిదేమో!
1.2. దళిత కవిత్వాభివ్యక్తి:
దళితులను చైత్యన్యపరచటం దళిత సాహిత్యం, ప్రయోజనాల్లో ప్రధానమైంది. కనుకనే, అభివ్యక్తిలో భాషలో తీసుకొనే అలంకారాలలో, శిల్పనైపుణ్యంలో అన్నీ దళితులకు అనుగుణమైన , తెలిసిన, అనుభవంలో ఉన్న వాటినే ఉపయోగించుకోవడం కనిపిస్తుంది. నిత్య జీవితంలో ముడిపడిన వాటినే ఊపమానాలుగా , ప్రతీకలుగా గ్రహించటం జరుగుతుంది. ‘ కళ కోసం కళ ‘ అనే శుద్ధ కళావాదుల వలే కాకుండా ‘ కళ ప్రజలకొరకే ‘ అనే నైతిక కళావాదుల వర్గంలోకి దళిత కవిత్వం చేరుతుంది . అయితే, దళిత కవిత్వ అభివ్యక్తి మూడు మార్గాల్లో పయనిస్తుందని చెప్పే అవకాశం ఉంది.
1) సాధారణమై పదాలు, నిత్య వ్యవహారంలో కలసిపోయిన సంభాషణ వలే కనిపిస్తూ, భాషకంటే వస్తుతత్వంపైనే దృష్టిని పెట్టేటట్లు చేయడం
2) భాష, వస్తుతత్త్వ వ్యక్తీకరణకి సమ ప్రాధాన్యతనిస్తూనే సౌందర్యాభివ్యక్తిలో మరే ఇతర సాహిత్యానికీ దళిత సాహిత్యం తీసిపోదని నిరూపించే ప్రయత్నం చేయడం.
3) ప్రతిదాన్నీ వ్యవస్థగా మార్చే ప్రయత్నం కూడా కనిపిస్తుంది.
దీనిలో మొదటి వర్గానికి శంబుక కవిత్వం చేరుతుందనిపిస్తుంది. ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంది. దళిత కవిత్వ అభివ్యక్తీకరణ పద్ధతులను , స్థాయిలను పేర్కొనడమనేది, విశ్లేషణకు వీలుగా, అధ్యయన సౌలభ్యం కోసమే తప్ప, ఆధిక్యతలను, ఉచ్చనీచ భావాల్ని కలిగించడానికి మాత్రం కాదు ! ‘ శంబుక ‘ కవిత్వం దళితుల కోసం. దళిత సామాన్య ప్రజల కోసం రాసింది.
కవిత్వాన్ని తూచే పద్ధతుల్లో కొంతమంది దళిత కవులను ప్రత్యక్షంగా విమర్శించక పోయినా , పరోక్ష విమర్శలు చేస్తూ, అభివ్యక్తి నైపుణ్యం లేక, రాసిన దానినంతటికీ గొప్ప కవిత్వాభివ్యక్తిగా కీర్తించుకుంటూ, వస్తూరూపాల్లో, వస్తువుకే ప్రాధాన్యమని వాదిస్తున్నారనే వాళ్ళూ అక్కడక్కడా కనిపిస్తున్నారు . అలాంటి వాళ్ళకి సరైన సమాధానమిస్తూనే వస్తు రూపాల్లో సమప్రాధాన్యత నివ్వగలిగి, ఏ సాహిత్యానికైనా పోటీ పెట్టగల దళిత సాహిత్య సృష్టికర్తలు ఎంతోమంది ఉన్నారు . శివసాగర్, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చంద్ర , మద్దూరి నగేష్‌ బాబు, శిఖామణి, పైడి తెరేష్‌బాబు, కలేకూరి ప్రసాద్‌, షాజహానా తదితరుల కవిత్వాన్ని పరిశీలిస్తే, దళిత సౌందర్యాభివ్యక్తి ఎంత సమర్థవంతంగా వ్యక్తమయ్యిందో తెలుస్తుంది. దళిత సౌందర్యం వస్తువు వల్లా, దాన్ని అభివ్యక్తీకరించడం వల్లా సమర్థవంతంగా కావడం ‘ శంబుక ‘ కవిత్వంలోనూ కనిపిస్తుంది. ” పోయేదేమీ లేనోళ్ళం ” అని తన కవితా సంపుటికి పేరు పెట్టుకోవడంలోనే, దళితుల పోరాట స్ఫూర్తినీ తెలియపరుస్తున్నారు కవి.
1.3. శంబుక దళిత దృక్పథం:
“శంబుక” రాసిన కవితల్లో కొన్నింటిని “పోయేదేమీ లేనోళ్ళం” పేరుతో ఒక పుస్తక రూపంలోకి తెచ్చాడు. వీటిలో శంబుక దళిత దృక్పథం, దళిత సాహిత్య అధ్యయనంలో ఒక ప్రధానవర్గ కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంది. శంబుక దళిత దృక్పథంలో కిందివి ప్రధానంగా కనిపిస్తాయి.
1) సమాజంలో కులం కనిపించడం ఒక విస్మరించలేని వాస్తవం.
2) “కులం” పేరుతో దోపిడీ జరుగుతుంది. ఇది భిన్న రూపాల్లో ఉంది .
3) కుల నిర్మూలనకు కృషి చేస్తున్నదెవరు? వ్యతిరేకిస్తున్నదెవరు? గమనించవలసి అవసరాన్ని నొక్కి చెప్పడం.
4) కులాన్ని వాడుకుంటూనే, కులాన్ని విస్మరించే వాళ్ళని వ్యతిరేకించడం.
5) కులపరంగా, ఆర్థికపరంగా మార్క్సిస్టులు పోరాటాల్ని నిర్మించవలసిన అవసరాన్ని చాటడం.
6) మార్క్సిస్టు పార్టీలో నాయకత్వం అగ్రవర్ణాలనబడే వారి చేతుల్లోనే మారు రూపాల్లో చేరడంవల్ల, మార్క్స్‌ లెనిన్‌మావో ఆశయాలు నెరవేరడంలేదనే అనుభవ సత్యాన్ని చాటడం .
7) దళితుల ఆత్మ గౌరవ ప్రకటనతో స్వీయ ఉద్యమాల నిర్మాణావశ్యకత వివరించటం
వీటితోపాటు మరికొన్ని అంశాలనూ తన కవిత్వంలో శంబుక శక్తివంతంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
1.3.1. విస్మరించలేని స్థితిలో కులం:
“కులమయమిదం భారత్” కవితలో “శంబుక” సమాజ అంతరాల్లో కులం చొచ్చుకుపోయిన మార్గాలను అన్వేషించి చూపాడు. గుడిలో, బడిలో, మతంలో, ప్రేమలో, పెళ్ళిలో, ఉద్యోగంలో నిరుద్యోగిగా ఉండిపోవడంలో, ప్రభుత్వంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, ఓట్ల సీట్లలో, కాలేజీల్లో, కార్ఖానాల్లో, పండితునిలో, పామరునిలో, నీటిబోరుల్లో, విద్యుద్దీపాల్లో, జైళ్ళలో, నల్లకోట్ల న్యాయంలో, నాయకత్వంలో, రౌడీయిజంలో, పల్లెల్లో, పట్నాల్లో, పార్టీల్లో, చివరికి చావులో కూడా ‘ కులం ‘ ప్రస్తావన అనేది లేకుండా లేదు. కాకపోతే, ఆచారంగానో, సంప్రదాయంగానో కలసిపోయి , ఆంతర్యాన్ని వ్యక్తం చేస్తూ కులం తన స్వభావాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. దీనివల్ల కులానికీ ‘ ఒక్కో సంస్కృతి ‘ రూపొందడంలో ఆశ్చర్యపోవలసిన పనేమీలేదు . కానీ, భారతీయ సమాజాన్ని చూసినట్లయితే, నాటి నుండి నేటి వరకూ దళితులను రకరకాల పీడనలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ పీడనల నుండి రక్షించుకోవడానికి మతమార్పిడిలను తప్పనిసరి పరిస్థితులలో అంగీకరించవలసి వచ్చింది . ఏ కొందరో ఇష్టపడి కొన్ని మతాల్లోకి వెళ్ళినా, ఆ మతాల్లోనూ దళితులకి దక్కిన గౌరవం అనుభావంలోకొచ్చే సరికి , అందులొను ఇమడ లేని పరిస్థితులు! ఇలా హిందువులు , ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులుగా దళితులు మారిపోవటం వెనుక తరతరాల పీడన నుండి బయటపడాలనే ఆలోచనే ప్రధాన లక్ష్యం. దీని ఫలితంగా, సంస్కృతీ వైవిధ్యం దళితుల్లో ఎక్కువగా కనిపించినా, కులంలోని అంటరానితనం దళితులనందరినీ ఏకసూత్రంలో కట్టిపడేసింది .
భారతదేశ వ్యాప్తంగా పరిశీలించి చూసినట్లయితే కులానికో సంస్కృతి ఉన్నా, విభిన్న సంస్కృతులతో పాటు అస్పృశ్యత దళితుల్లోనే కనిపిస్తూ వంశపారంపర్యమయ్యింది. ‘కులం’ ఒక కాదనలేని సత్యమై కూర్చొంది! ” కులమయమిదంభారత్ ” కవితలో శంబుక! తన సైద్ధాంతిక భూమికనంతా ఈ కవితలో కవిపించేటట్లు చేసుకున్నారు . సిద్ధాంత వివరణ చేస్తున్నట్లుగా మిగిలిన కవితలను వర్ణించారు. అయితే ఈ సందర్భంలో సాహిత్య అభివ్యక్తి గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఉంది . ‘ కులమయమిదం భారత్ ‘ కవితలో సామాన్య పదాలతోనే ‘కవిత్వం’ చేశారు కవి . అలంకారాలు తొడగడం కంటే అలవోకగా చెప్పినట్లే కనిపిస్తుంది కవిత. “దళిత కవిత్వం ఇలాగే వుంటుందా”? అనే అనుమానం కూడా కలగవచ్చు. ఆధునిక సాహిత్యంలోనూ వ్యక్తి , వ్యక్తి చైతన్యం, వైయక్తికానుభూతులు మాత్రమే ఆధునిక చైతన్యం కాదనీ, మార్మికంగా వ్యక్తం చెస్తేనే సాహిత్యం గొప్పదనడం వంటి వాటిలో దళిత సాహిత్యానికి కొన్ని విభేదాలున్నాయి వాటిని గమనించకపోతే, శిల్పాభివ్యక్తి గురించే ఎవరైనా మాట్లాడతారు!
1.3.2.నిలదీసిన అనుభవం :
ఒక మాదిగ వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే చూసే చూపులకీ, అగ్రవర్ణమని పిలవబడే వ్యక్తి బట్టలు ధరించకపోవడంలో నిరాడం బరత్వాన్ని పోలిక చేసి “ఆహా కులమా!” పేరుతో రాసిన కవితలో ఒకడిది దర్పం, మరొకడిది నిరాడంబరత్వం అనడంలో చూసే చూపు సరిగ్గా లేదంటున్నారు కవి. ఈ కవితలో డా.అంబేడ్కర్‌, గాంధీలను స్ఫురింపజేస్తారు. దీన్ని సమాజంలో కుల నిర్మూలన ఆదర్శ ప్రకటనకు అనుసంధానిస్తూ –
” బాపనోడు కులం లేదంటే
మహోన్నత సంఘ సంస్కర్త, ఆదర్శ జీవి
మాలోడు ఇదే అంటే
ప్రమాదకరమైన పచ్చి కులతత్త్వవాది
‘ ఓసి ‘ కులమా
నీవెంత కసాయిదానివే?!” – అని ప్రశ్నించటంలో కనిపించే ఆధిపత్య భావజాలాన్ని వివరిస్తున్నారు కవి. దళితులపై సంస్కరణ పేరుతో చెలాయించే నాయకత్వాన్ని, దాని స్వభావంలో కనిపించే హిపోక్రసీని బహిర్గతం చేస్తున్నారు. “ఓసి” కులమా అనడంలో అగ్రవర్ణం అనే పార్శ్వాన్ని కూడా చూడగలిగే అవకాశం ఉంది. “ఓసి” కులమా అనే దానిలో కులాన్ని నిందించడమూ ఉంది. కులాంతర వివాహాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. నిజంగా ప్రేమించేవారికి ఆ కులం ప్రతిబంధకేమీకాదు. సరే, ముందుకెళ్ళి కులాంతర వివాహం చేసుకోకుండా సిద్ధపడితే, వ్యతిరేకించేదెవరో గమనించాలంటున్నారు కవి ఇలాంటి వైరుధ్యాలు నిండుగా పెట్టుకున్న ఆధిపత్య భావజాలం గలవాళ్ళు, తమ పిల్లలను వాళ్ళకు ఇష్టం ఉన్న లేకపోయినా తమ కులం వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. దానికి అనేక కథలల్లుతారు అంటారు కవి! “ఎర్రదొంగలు” కవితలో ” సమాజంలో కౌటిల్య కులాలేవీలేవంటూ
‘వర్గం వర్గం’ అంటూ కొంగ జపం చేస్తున్న
మార్స్కిస్టు అద్వైతులు
తన కొడుకులూ, కూతుళ్ళకు
తన కులపోళ్ళను మాత్రమే ఏరిఏరి
పెళ్ళిళ్ళు చేస్తున్న మార్స్కిస్టు మనువులు
ఇంటి గుమ్మంలో మార్క్స్, లెనిన్‌ల ఫోటోల తగిలించు” కునే ‘ఇంటి లోపలి దేవుని ఫొటోలు తగిలించే /హిందూ కమ్యూనిస్టుల డొల్లత్నాన్ని బట్టబయలు చేస్తున్నారు కవి. కులం వద్దంటూనే కులాన్ని పాటించే వాళ్ళలో వర్గవాదులు కూడా ఏ మాత్రం తీసిపోవట్లేదంటున్నారు కవి . వీళ్ళు ఎప్పటికీ కుల నిర్మూలనకి ఆదర్శవంతులు కాలేరనీ, దళితులు ఇటువంటి వారిపట్ల జాగురూకులై ఉండవలసిన అవసరాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు కవి . చరిత్రలో ఆదర్శవంతుల జాబితా కోసమే ప్రయత్నించే కుల నిర్మూలన సంస్కర్తల చరిత్రలను పునరాలోచించమంటున్నారు కవి .
1.3.3. ప్రత్యామ్నాయ పోరాటమార్గం:
‘వర్గ’ వాదులలో కనిపిస్తున్న ‘కులం’ ప్రభావాన్ని గుర్తించమంటున్నారు కవి . దీనికి స్వీయానుభవం, ‘కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం’ పరిశోధనతో కూడిన గ్రంథం రాయడం శంబుక కవిత్వ అనుభవానికి బాగా తోడ్పడి ఉండవచ్చు. ‘ దళిత ‘గర్జన’ కవితా ఖండికలో –
” నిన్నడిగేది ఒక్కటే కామ్రేడ్!
వర్ణధర్మం పేరుతో వాడు నన్ను ఈసడిస్తే
వర్గ పోరాటం పేరుతో
నీవు నన్ను విస్మరిస్తున్నావు ” అని చెప్పడమే గాకుండా, నాయకత్వంలో ఉన్న వాళ్ళు వర్గవాదులూ దళితులను ప్రతిభలేని వాళ్ళుగా ముద్రవేస్తున్నారనీ, పార్టీ క్రమశిక్షణ పేరుతో సేవకులుగా మారుస్తున్నారనీ, మార్స్కిస్టు పడికట్టు పదాలతో గందరగోళానికి గురిచేయడం కంటే వాస్తవాన్ని గుర్తించాలంటున్నారు కవి. వినే పరిస్థితుల్లో లేని’ నాయకత్వ పరిరక్షణ జిత్తుల్ని పసిగట్టిన దళితులు’ ఎర్రజెండా వ్యాపారం చేస్తున్న
“ఈ ఎర్ర బూర్జువా/ వామపక్షీయుడో, రామపక్షీయుడో గానీ/ మా వ్యతిరేక పక్షీయుడవుతున్న వైనాన్ని గుర్తించారని ” పోయేదేమీ లేనోళ్ళం ” లో స్పష్టం చేసి, అన్నింటా మోసపోయిన పరిస్థితుల్లో, నమ్మిన వాళ్ళు కూడా దళితులను బానిసలుగా మార్చుకోవడాన్ని వ్యతిరేకించడం, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించుకోమని ప్రభోధించడం కవి భావాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
1.4. శంబుక మార్క్సిజం:
దళితులు స్వతంత్ర పోరాటాల్ని నిర్మించుకుంటున్నారు. దానికి కారణాలేమిటి? మార్క్సిజంలోగల నాయకత్వ వైఫల్యం వల్లనా? మార్క్సిజం పునాదుల్లో ‘ కులం ‘ భాగం కానందువల్లనా ! అనేది శంబుక జీవితం, సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం చదివే వారికి స్పష్టంగానే తెలుస్తుంది. జెండాలు మోయడానికే ఉపయోగపడుతున్న దళితులు పార్టీ పేరుతో మార్క్సిస్టు భావజాలంలో , ఆదర్శంలో, ఆచరణలోకి రాకపోవడానికి కులమే కారణమవుతున్నా, దాన్ని అంగీకరించకుండా, కులాధిపత్య భావజాలంగల నాయకులే అడ్డుతగలడంవల్ల , ఆత్మగౌరవాన్ని చంపుకొని, ప్రాణాలను బలిపెట్టడానికే ఆ పోరాటాల్లో మిగిలిపోవడం కంటే, ఆత్మగౌరవ స్వతంత్ర కుల పోరాటం నిర్మించుకోమంటున్నారు కవి. దళితుల సమస్యలు ఎజెండాలో పెట్టమంటే , కుల తత్త్వాన్ని అంటగట్టడం, గతితార్కిక భౌతికవాదాల్ని వినిపించడం , ఉపరితల అంశాలన్నింటికీ, పునాదిలోని ఆర్థిక అంశాలే కారణమంటూ సాధారిణీకరించడాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు కవి . వ్యతిరేకించవలసిన అవసరాన్ని భవిష్యత్ తరాలకి కవిత్వంలో అందించి స్ఫూర్తిదాయకమయ్యారనుకోవచ్చు!
” ఈ సాంఘిక-ఆర్థిక అసమానతలపై
సాయుధంగా తిరగబడతాం
మాకు మేము మార్గదర్శకులమౌతాం
మేము కారల్‌మార్క్స్ చెప్పిన
పోయేదేమీ లేనోళ్ళం” అంటూ తాము మార్క్సిజాన్ని వ్యతిరేకించడంలేదనీ, మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పులచేసి, కులాన్ని కూడా ఎజెండా చేయాలని వాదించారు కవి. అలా కుదరదనుకున్నప్పుడు డా.అంబేడ్కర్ తాత్త్విక భూమికకు చేరువుగా మార్క్సిజాన్ని దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనే దృక్పథం ‘శంబుక’లో కనిపిస్తుంది !
శంబుక రాసిన దళిత కవిత్వంలో ఇలా అనేక నూతన పార్శ్వాలు ప్రతిఫలించాయి సాంఘిక ఆర్థిక పార్శ్వాలు అందులో ప్రధానమైనవి. దళితులు కులం వర్గం రెండింటిని పట్టించుకోవలసిన అవసరం ఉందనే ఆలోచన బలంగానే వ్యక్తం అయ్యింది. అయితే శంబుక తాత్త్విక పోరాట దృక్పథంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. కానీ, కవి ప్రత్యక్షంగా అనుభవించిన జీవితం నుండి ‘పోరాటమార్గం’ దళిత ఉద్యమం’ గా రూపొందిందేమో అర్థం చేసుకోవలసి ఉంది.’ శంబుక దళిత దృక్పథంలో కనిపించేవన్నీ వర్తమాన దళిత ఉద్యమం ఈ అన్ని భావాలను అంగీకరించాలనేమీ లేదు! కానీ, ‘శంబుక దృక్పథం’ లో అనేక అంశాలను వర్గవాదులు గుర్తించే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి . చికాగోలోని ‘హే’ మార్కెట్‌లో ఎనిమిది గంటల పనిదినం కోసం రక్తాన్ని చిందించిన కార్మికుల సమరత్యాగాన్ని నిత్యం స్మరించుకుంటూనే, కార్మికవర్గ చేతిలో నిలవ వలసిన ఎర్రజెండా, బూర్జువా, పెటీ బూర్జువాలు లాక్కోవడాన్ని వ్యతిరేకించినందుకు, దాన్ని బహిరంగంగా ఉద్యమ ప్రాయం చేసినందుకు ఆత్మత్యాగాన్ని చేయవలసి వచ్చింది శంబుక. తన ప్రాణం కోల్పోయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసమే జీవించిన దళితవీరుడిగా దళితుల, పీడితుల హృదయాల్లో కలకాలం నిలిచిపోతారు కవి శంబుక .

Add comment February 24, 2009

తెలంగాణ అస్తిత్వానికి ‘గుక్క’

సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక కవి గొంతులో ప్రజల ఆర్తి పలుకుతుంది. తన అస్తిత్వం ఏమిటో అంచనా వేసుకోవటం కన్పిస్తుంది. అత్యవసర పరిస్థితి ధ్వనిస్తుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి వస్తున్న కథల్లో, కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పథం వ్యక్తమవుతుంది. కవికి దృక్పథదం ఉండటం వల్ల తన కవిత్వం ఎవరి కోసమో, తన కవిత్వ ప్రయోజనం ఏమిటో గుర్తెరిగినట్లవుతుంది. కాసుల ప్రతాపరెడ్డి ఈ కోవలోనే తెలంగాణ అస్తిత్వం కోసం నిజాయితీతో ఉద్యమప్రాయంగా కవిత్వం, కతలు, వ్యాసాలు రాస్తున్నాడు. తెలంగాణ కథలు, కవిత్వంపై వచ్చిన వ్యాసాల్ని పుస్తకాలుగాను అందుబాటులోకి తెస్తున్నాడు. ‘భౌగోళిక సందర్భం’, ‘కొలుపు’, ‘తెలంగాణ తోవలు’, ‘తెలంగాణ కథ – దేవులాట’ వంటి వ్యాససంపుటాల్లో గానీ, తన కథల పుస్తకం ‘శిలువకు తొడిగిన మొగ్గ’లో గానీ, ఇప్పుడు ప్రచురించిన ‘గుక్క’ కవితాసంపుటిలో గానీ దేన్ని చూసినా తెలంగాణ బాగోగుల గురించిన తపన కనిపిస్తుంది. తన తెలంగాణ చరిత్ర, సంస్క¬ృతుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యత ప్రతిఫలిస్తుంది. తన విమర్శవ్యాసాల్లో, కథల్లో తనకి కావాల్సిందేమిటో వాచ్యంగానే, స్పష్టంగానే, ధైర్యంగానే నిలదీసి అడిగితే కవిత్వంలో మాత్రం అందరి చేతా తెలంగాణ సమస్యను, ఆవేదనను అర్థం చేయించి, అనుభవింపజేసి, తన వాదనను అంగీకరింపజేసేలా ప్రయత్నిస్తాడు. ‘గుక్క’ దీర్ఘకవితతోపాటు ఈ పుస్తకంలో మరికొన్ని కవితలూ ఉన్నాయి. తెలంగాణా సంస్క¬ృతినీ, జానపద పౌరాణిక, చారిత్రక గాధల్నీ, సందర్భాల్నీ, చివరికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ల నోళ్లలో కూనిరాగాలయ్యే పాటల్ని కూడా తన కవిత్వంలో అంతర్భాం చేసి, తల్లి తెలంగాణ ‘గుక్క’ పట్టి దుఃఖిస్తున్న దయనీయ దృశ్యాన్ని చూపిస్తాడు. గ్రంథ ముఖచిత్రంలో కూడా నెత్తి బాదుకుంటూ రోదిస్తున్న స్త్రీమూర్తి తల్లి తెలంగాణని స్ఫురింపజేస్తుంది. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. స్వరూపస్వభావాల్లో తేడాలున్నా సిద్ధాంత నేపథ్యం మాత్రం పీడన, పరాయాకరణల నుండి విముక్తి కోరుకోవటమే తెలంగాణా పోరాటాల తత్త్వం! “చినిగిన బట్టలేసి కుట్టిన నేల/ మొగుల కింద గన్నుల కోలాటాలు/ పెయ్యంతా తూట్లే తూట్లు” అని కవి కాసుల ప్రతాపరెడ్డి వర్ణించడంలో తెలంగాణ ప్రాంత పరిస్థితి కండ్లకు కట్టినట్లుంది. “బట్టలేసి కుట్టిన నేల” అనే ప్రయోగం చేయడంలో గొప్ప ఔచిత్యం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వివిధ రాజ్యాధికార జెండాలు ఎగిరిన చారిత్రక స్థితిగతుల్ని స్ఫురింపజేస్తున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం సంస్థానంలో తెలంగాణ, మరఠ్వాడా, కర్ణాటకలో గల భిన్న ప్రాంతాలతో, భిన్న సంస్క¬ృతులతో నిండి, అధిక శాతం తెలుగు మాట్లాడే వాళ్లున్నా ‘ముక్కు మొగం లేని దిక్కుమాలిన తెలుగువాళ్లు’ (తెలంగీ బేడంగీ)గా ఎగతాళికి గురికాబడ్డారు. రజాకార్ల దురంతాలు, దాని నుండి రక్షించుకొని భూస్వాముల దురంతాల నుండి కాపాడుకోవడానికి సాయుధ పోరాటం చేయటం, 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చర్య తీసుకోవటం, 1950లో ముందుగా పౌరప్రభుత్వం, తర్వాత 1952లో సాధారణ ఎన్నికలు జరగటం, హైద్రాబాదు రాష్ట్రం ఏర్పడడం వంటి చారిత్రక సంఘటనలు జరిగాయి. అంటే అధికార జెండాలు మారాయి. ఆ తర్వాత అప్పటికే కుంఫిణీ వ్యాపారులు వాళ్ల సౌలభ్యం కోసం తెలుగు మాట్లాడే వాళ్లందర్నీ ఒక ప్రాంతంగా కాకుండా సర్కారు జిల్లాలు, దత్తమండలాలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలవారిని మద్రాసు ప్రెసిడెన్సీలో కొంతమందిని విభజించటంతో తెలుగువాళ్లు, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ భాషా సంస్క¬ృతుల పట్ల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక రంగాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించగలిగారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ఆకాంక్ష హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న తెలంగాణను, మద్రాస్ ప్రెసిడెన్సీలో బాధితులైన తెలుగువాళ్లను కలిసిపోవడానకి ప్రేరేపించింది. ఇక్కడ ‘విశాలాంధ్ర’ ఉద్యమం వరకూ ముందున్న తెలంగాణను పరిశీలించినా కవి ‘చినిగిన బట్టలేసి కుట్టిన’ అనే ప్రయోగ ఔచిత్యం వెల్లడవుతుంది. సాయుధ పోరాటంలో, నేటి నక్సల్ (మావోయిస్టు) రాజకీయాల్లో ప్రభుత్వం తరఫు నుండీ, నక్సల్స్ నుండీ జరుగుతున్న కాల్పుల్ని, పోతున్న ప్రాణాల్ని ‘మొగులు కింద గన్నుల కోలాటం’గా చెపపడంలో, కురవాల్సిన మేఘాలు, చల్లదనం అందించాల్సిన మేఘాల కింద నెత్తురు చారికలకు కవి ఆవేదనకు అక్షరరూపమే! దీనిలో ఒకానొక చారిత్రక పరిణామం, దాని ఫలితంగా దయనీయంగా మారిన తెలంగాణ బతుకు చిత్రం చూపగలిగాడు కవి. గతానికీ, వర్తమానానికీ ముడివేస్తూ ‘పత్తి పంటల మీద పురుగుల మందు/ పొలాల నిండా కొయ్యకాళ్లే/ పర్రె కాలువలేవి, చెరువు ఊటలేవి?/ మింటికీ ఒంటికీ ఏకధారగా కురుస్తున్న చీకటి/ రెక్కలిరిగినై, కాల్లు విరిగినై/ చిలుకెగిరిపోతున్నది, ఎగిరిపోతున్నది/ ఊగరా, ఊగరా!!/ వాసాలు అందుకుని ఊగరా” అని వెలుతురివ్వని, దక్కనివ్వని పోరాటాల స్థితిగతుల్ని చెప్తూ ప్రస్తుత తెలంగాణ స్థితికి ఆవేదనతో కుమిలిపోవటం కనిపిస్తుంది. త్యాగాలకు దక్కిన ఫలితం పేదరికమేనా అని ప్రశ్నిస్తున్నాడు. విశాలాంధ్ర ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అన్నీ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించగలవని అనుకున్నా, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపించడం పట్ల కూడా కవికి ఆవేదన ఉంది. ఈ నేలపై ఉంటూ ఈ సంస్క¬ృతిలో బతుకుతూ భాషనీ, ప్రజల్నీ తక్కువగా అంచనావేస్తూ, తన వాళ్లవల్లనే ఒక పరాయాకరణ జీవితాన్ని గడపవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోయే “నీ యావ వేరు/ నీ రంది వేరు/ నువ్వేమన్నా మా బాస రాసినవా?/ మా యాస రాసినవా?/ నీ రాతలకు మా తలరాతలకు పొంతనేది?/ మనిసివిక్కడ, మనసక్కడ!/ పాలు మర్సిన బిడ్డవైతివి, నీకేమెరుక?” అని నిలదీస్తాడు. తెలంగాణ భాషను మాండలికంగా తీసిపారేయటం, సినిమాల్లో హీరోలకు కాకుండా రౌడీ పాత్రల చేత పలికించడం, కించపరచడం వంటివెన్నో జరుగుతున్న నేపథ్యాలన్నింటినీ గుర్తు చేస్తూనే తెలంగాణ ప్రజల్ని గుర్తించమంటున్నాడు కవి. తెలంగాణకు ఈ పరిస్థితి రావడానికి కారాణాన్ని అన్వేషించమంటూ – ” ఎవరికి పుట్టిన బిడ్డరా అంటే/ ఎక్కెక్కి ఏడ్చే తల్లి/ ఏ గాలి సోకిందో, ఏ తూర్పు గాలి విసిరిందో/ కాకులు దూరిన ఇల్లు/ గుడ్లగూబలు చొచ్చిన ఇల్లు” అని చెప్పడంలో ఆవేశం కూడా ఉంది. వర్షాలు లేవు. తన నేల నుండే ప్రవహించినా, తన నేల ఉపయోగించుకోలేని దుస్థితిలో గోదావరి జలాలు. పోనీ వర్షాలు కురవడం లేదు. పోనీ వర్షాలు కురవటం లేదు. దీనికి ఏవో పథకాలంటూ ఇజ్రాయెల్, నెదర్లాండ్ వ్యవసాయ పద్దతులంటూ చేసినవన్నీ ‘పథకాలకు పాతరేసి, పైసలెత్తుకుపోయిన గద్దలు’గా మారటం విషాదకరం. వ్యవసాయం ఎలా ఉన్నా తాగటానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ బారిన పడిన జీవితాలెన్నో! దీన్ని – విషమై పారుతున్న పాతాళగంగ/ కాల్లొంకర, కండ్లొంకర/ పసి పోరగాల్లయినా పండ్లిగిలిస్తే నల్లని గారలు” అని ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన జీవితాల్ని చూపిస్తాడు. భగీరథుడుతన వంశాన్ని రక్షించుకోవడానికి తపస్సు చేసి ఆకాశగంగను పాతాళం దాకా ప్రవహించేట్లు చేశాడు. వాళ్లకు శాపవిముక్తి అయ్యిందో లేదో తెలియదు గానీ, వందలాది మీటర్ల లోతుల్లోకి తలతాకట్టు పెట్టయినా బోర్లు వేస్తే, వచ్చే నీళ్లు ఫ్లోరోసిస్‌ను తెచ్చి, తెలంగాణ ప్రలజకి విషంగా మారి నీటి శాపం వెంటాడుతున్న కతల్ని వినిపిస్తాడు. ఇంత జరుగుతున్నా, పీడితుల పక్షం వహించవలసిన పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం పట్ల కూడా అధిక్షేపాన్ని ప్రకటిస్తూ – “మంత్రమేసెనో, మాయ చేసెనో, మరుగు మందే పెట్టెనో/ ఆత్మపంజరంలో పిట్ట/ కదం తొక్కుతూ, పదం పాడుతూ/ ఎర్రెర్రని పలుకులు, ఎదురొడ్డిన రొమ్ములు/ వీరభక్త హన్మంతులు/ గుండె చీల్చుకుంటే సూర్యుళ్లే/ నిన్ననా, మొన్ననా, ఆవలి మొన్ననా/ కాలచక్రం కింద నలిగిన దేహాలెన్నో” అని చరిత్రలో పోరాటాల వల్ల ప్రాణాల్ని కోల్పోయిన వారిని గుర్తు చేస్తూ వారి పోరాటాలకి ప్రతిఫలం దక్కాలనే ఆశయాన్ని ప్రకటిస్తున్నాడు. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కాదనీ, సోది చెప్పటమో, శాంతి చేయటమో పరిష్కారానికి మార్గం చూపలేవంటూ – “మార్మానమొచ్చినోడు మదమెక్కి కూస్తుండు/ కావాల్సింది యిడుపు కాయితాలే” అనీ, ” ఏరుపడటం తప్ప మాకు వేరు లేదు/ నువ్వేంది చెప్పు తీర్పు చెప్పేది/ మేమప్పుడే చెప్పినం/ మాకు గట్టి గింజలు కావాలె, తాలు మాటలొద్దు” అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ప్రతాపరెడ్డి కవిత్వంలో తెలంగాణ సమస్యను జడ్జీ అనే పాఠకుడి మందు లాయర్‌లా తన వాదనాపటిమను ఆర్ద్రంగా వినిపిస్తున్నాడు. ‘గుక్క’ పట్టి ఏడుస్తున్న తల్లి తెలంగాణ దుఃఖాన్ని ఆపాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు దాహం తీర్చాలి. గొంతు తడపాలి. గొంతు తడిసి, దాహం తీర్చి, జీవశక్తి నివ్వగలిగదే నీళ్లు కావాలి. కన్నీళ్లు తుడవాలి. జానపద సాహిత్యంలో ఆణిముత్యం వంటి కథ ‘బాలనాగమ్మ’ కథ తెలంగాణ ప్రాంతానికి చెందిందే. దీన్ని కవిత్వంలో ఉపయోగించుకొంటూ, సంస్క¬ృతిపరమైన కథల్ని తెలుసుకోమంటూనే చైతన్యానికి ఊపిరి కోణాల్ని చూపుతున్నాడు. “సోది చెప్పవచ్చిన తల్లి/ శాంతి చేయాలంటున్నది/ కాగల కార్యం తీర్చే గంధర్వులేరి?/ బాలనాగమ్మవో తల్లి, తెలంగాణా// చెర విడిపించే బాలవద్దిరాజేడి?” అని ఒక చోట, మరో చోట- ” ఏడేడు సముద్రాలు దాటావా, నా చిట్టి తండ్రీ/ మర్రిచెట్టు తొర్రలో చిలుక దొరకనే లేదు/ పిడికిలి నిండా పట్టి పిసికేయడానికి/ పరిగెడుతూ వుంటావా, ఎక్కడి దాకా?” అనటంలోనూ, తెలంగాణ సమస్య పరిష్కారానికి చేయవలసిందేమిటో కూడా స్ఫురింపజేస్తున్నాడు. ఇలా కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించుకున్న ప్రత్యేక శిల్పాన్ని కూడా వివరించుకుంటూ పోతే కవిత్వనిర్మాణాల్లో ఎన్నో రహస్యాలు బయటపడుతుంటాయి. మీడియాని, జానపద గేయాల్ని, విప్లవ గీతాల్ని కూడా తెలంగాణ సాధనకు ఎలా వినియోగించుకోవచ్చో తన కవిత్వంలో రహస్యంగా అందరికీ అందంగా అందిస్తున్నాడు. వింటున్న పాటనూ, చూస్తున్న దృశ్యాన్నీ, రమ్యంగా చెబుతున్న కథనీ కూడా తెలంగాణ దృష్టితో చూడగలిగే విశిష్టశైలిని కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో చూడగలిగే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల దొరకని ఏకాంతాన్ని వెతుక్కొనే సన్నివేశంలో ‘కన్నులో మిసమిసలు కనిపించనీ, గుండెల్లో గుసగుసలు వినిపించనీ’ అని హీరోగారు ఓ సినిమా (దేవత?)లో పాడుతుంటాడు. కాసులకవి దీన్ని “కన్నుల్లో బుసబుసలు కనిపించనీ/ గుండెల్లో బాకు దించనీ” అని అనుకరణరూపంలో కవిత్వమవ్వటం ఓ చైతన్యస్రవంతి శిల్పం నుండి పుట్టిన కొత్త ఊహ! మరో సినిమా అల్లూరి సీతారామారాజులో తెల్లవాడిని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ “ఎవడు వాడు, ఎచటి వాడు/ ఇటువంటి నల్లవాడు/ ఎందుకొచ్చిండో ఎరుకలేదాయె/ కాకితో కబురైనా పెట్టకుండా వచ్చిన చుట్టమని/ అంగలార్చి అక్కున చేర్చుకుంటి/ నా నల్లనల్ల రేగళ్ల మీద పచ్చిపుండ్లు పడె” అని తెలంగాణ సమస్యవైపు దృష్టి మరల్చేటట్లు కవిత్వీకరించాడు. సినిమా పాటల్నే కాదు విప్లవ పాటల్ని, పిల్లల్ని ఆడించే జాబిల్లి పాటల్లో కూడా చైతన్యాన్ని నింపే ప్రయత్నంలో “నీళ్లు మనవిరో, నేల మనదిరో/ వాడి ఎవుసమేందిరో, వాడి దున్నుడేందిరో”, “పైలం కొడుకో, కొమరన్న/ జర భద్రం కొడుకో” అనటంలో విప్లవ చైతన్యంలోని చైతన్యాన్నీ వినియోగించుకోవాలనే తపన ఉంది. “గొంగట్ల మెతుకులేసి ఏరుకోవడమే/ చీకటి అర్రల ఒంటరి మొత్తుకోలు/ చందమామ రాకె, జాబిల్ల రాకె” అనగలిగేదంతా ఆలోచించవలసిందే. సరదా కోసం వీటిని ప్రయోగించడం లేదు. ఒక విశిష్ట ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగిస్తున్నాడు కవి. గ్లోబలైజేషన్ పట్లా, ఆర్థిక సరళీకృత విధానాల పట్లా కడూ స్పష్టత ఉంది. సమకాలీన తెలంగాణ రాజకీయ పొత్తుల పట్ల కవి అభిప్రాయం ఉంది. తన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఆర్తి తన కవిత్వం నిండా ఉంది. తెలంగాణ ప్రజలందరూ హత్తుకొదగింది. కవి, విమర్శకుడు గౌరీశంకర్ అన్నట్లు “కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో భావోద్వేగం, పదునైన ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణా పటానికి అల్లుకున్న వలస గూడును తన చేతులతో చీరేసే ప్రయత్నం చేస్తున్నాడు”. కవి రచనకు, నిబద్ధతకూ నిత్యం నిదర్శనంగా నిలుస్తూ ‘గుక్క’ పట్టి దుఃఖిస్తున్న తల్లి తెలంగాణ దాహాన్ని తీర్చమని ఆహ్వానిస్తున్నాడు. ‘వలస’ను నిర్వచించవలసిన అవసరం ఉన్నా, సమస్యను పరిష్కరించడం మాత్రం అత్యవసరం. సొంత అస్తిత్వానికై ‘గుక్క’ పట్టిన తెలంగాణ కవిత్వం ఒక ఎమెర్జెన్సీ పోయిట్రీ. ( గుక్క (కవితా సంకలనం; కవి: కాసుల ప్రతాపరెడ్డి; వెల: రూ. 15/-; ప్రతులకు: అన్ని ప్రధాన బుక్ షాపులల్లో)

-డా॥ దార్ల వెంకటేశ్వరరావు 23092005

Add comment February 24, 2009

దళిత ఉద్యమానికి చైతన్య గీతిక వర్గీకరణీయం

దళిత ఉద్యమానికి చైతన్య గీతిక వర్గీకరణీయం “అగ్రవర్ణాల మీద ఉగ్రవాదుల్లా విరుచుకుపడ్డారు కదా ‘డాష్‌లో తంతామని’ రాష్‌గా రాశారు కదా మా దగ్గరెందుకు ముడుచుకుపోయారు” అని దళితకవుల్ని నిలదీసి అడుగుతూ, ఉపకుల విభజన జరిగినప్పుడు లబ్ధి పొంది, దాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేయడంతో, ఆ లబ్ధిదారుల ఆందోళన, ఆవేదనల అక్షరరూపం ఎండ్లూరి సుధాకర్ ‘వర్గీకరణీయం’లో వ్యక్తమైన కవితా ఖండిక అది. ‘వర్గీకరణీయం’ దళిత కవుల్లోని నిబద్ధతను, ఆచరణను ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో ఎస్.సి.ల మధ్య తమకి రావాల్సిన హక్కుల్ని పొందడంలో కొన్నేళ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్.సి.లను విభజించకూడదని, దళితుల ఐక్యత చెడగొట్టకూడదని, అందుచేత దళిత సమైక్యత అవసరమంటూ ఒక వర్గం, ‘ఐక్యత’కేమీ నష్టం రాకుండా రావాల్సిన రాయితీలను కుటుంబంలో సభ్యుల మాదిరి పంచుకోవాలని మరొక వర్గం వివిధ ఉద్యమాలు చేస్తూనే ఉంది. అసలు రిజర్వేషన్లు భారత సమైక్యతకు గొడ్డలి పెట్టని, కాబట్టి వాటిని వ్యతిరేకించే వర్గమూ ఉంది. ఈ వర్గాన్ని వ్యతిరేకిస్తూ ‘సమైక్యదళితులు’గా చాలా తీవ్ర పదజాలంతో కవులు కవిత్వాన్ని రాశారు. దీనికి వ్యతిరేకంగా కొందరు తమ ఆవేదనల్ని అక్షరీకరిస్తూ చకోనా సంపాదకత్వంలో ‘పాట చిక్కబడుతుందా?’ కవితా సంకలనాన్ని కూడా ప్రచురించుకోవాల్సి వచ్చింది! తర్వాత చాలా చర్చలు ( ఈ విషయంలో) జరిగాయి. అంత తీవ్ర పదజాలంతో, తమ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాసిన కవులు వర్గీకరణను సమర్థిస్తూ గానీ వ్యతిరేకిస్తూ గానీ ఏదో ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకుండా ‘ప్రముఖ దళితకవులు’ మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తున్నాడు కవి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఇప్పటికే రెండు సార్లు వర్గీకరణను సమర్థిస్తూ తీర్మానాలు చేసింది. అంటే దళితుల్లో ఒక వర్గానికి ‘న్యాయం’ జరడం లేదని, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. వర్గీకరణ చేసిన తర్వాత విద్య, ఉద్యోగ రంగాలలో ఎన్నో ఆవకాశాల్ని అన్ని వర్గాల (ఎస్.సి.లలోని) వారు పొందడం, సుప్రీంకోర్టు తీర్పుతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళనతో ఉండడాన్ని కవి – “అరుంధతీ సుతుల కళ్లలో కన్నీటి కాటుక రేఖలు రెప్పల కింద చెప్పుల మేకులు గుండెలన్నీ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకున్నాయి ఉద్యోగాలు ఏమవుతాయోనని ఉద్వేగాలు పెరిగిపోతున్నాయి ఎవరిని కదిలించినా దిగులు మబ్బుల జల్లులు ప్రతి ఇల్లూ ఒక ఎమర్జెన్సీలా ఉంది… కన్నీళ్లు మింగి మింగి కడుపు నిండిపోయింది…..” ఇలా వర్గీకరణ వల్ల లబ్ధి పొందిన వారి జీవితాల్తో మమేకమై, వారి ఆవేదనను ఆత్మీకరించుకున్నారు. నిజానికిది అక్షరాలుగా రాయలేకపోయి, అభిప్రాయంగా చెప్పలేకపోయినా వర్గీకరణ ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరిదీ! ‘వర్గీకరణ ప్రయోజనం’ అనడంలో మాల, మాదిగ, రెల్లి అన్ని ఉపకులాలూ ఉన్నాయి. వర్గీకరణ రద్దయితే ఎబిసిడిల విభజన ప్రకారం జరిగి అన్ని ఉద్యోగాల భర్తీ ఆగిపోయి, కొత్త భర్తీ జరిగితే, బాధ అనుభవించడంలో ‘మాల – మాదిగ’ తేడా ఉండదు. ఎందుచేతనంటే మళ్లీ ఇంతకు ముందు వచ్చినవాళ్లకే సీట్లయినా, ఉద్యోగాలైనా మళ్లీ వస్తాయనే గ్యారంటీ లేదు. ‘సమైక్యత’ గురించి మాట్లాడుకొనేటప్పుడు భిన్న జాతుల వస్తు ప్రదర్శనశాలగా పిలువబడుతున్న భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భిన్న సంస్క¬ృతులూ ఉన్నా అవసరమైనప్పుడు సమైక్యంగానే భారతీయులు సమాధానం చెప్తున్నారు. అలాగే బి.సి.లు వెనకబడిన తరగతులు వివిధ గ్రూపులుగా విభజన జరిగి తమకు రావాల్సిన రాయితీలను పొందుతున్నారు. వీరిలో సమైక్యతకు నష్టం వాటిల్లిందా! అలాగే ఎస్.సి.లు కూడా! విభజన జరిగినంత మాత్రాన సమైక్యతకు నష్టం జరగదు. వర్గీకరణ కోసం ఉద్యమాలు జరిగినా, అవి సాధించుకున్న తర్వాత, సామాజిక ఉద్యమాలు కలిసే చేయాలనేది ఆ ఉద్యమనేతలే కార్యరూపం కూడా సూచించారు. ఉత్తర భారతదేశంలో కూడా ఎస్.సి.ల్లో ఒక వర్గమే అన్నింటినీ అనుభవిస్తుందని, అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఒక వర్గమే ప్రధానంగా హక్కుల్ని పొందుతున్నాయనే వాదనలు ఉన్నాయి. అసలు రిజర్వేషన్లు అనేవి దీర్ఘకాలికంగా కాకుండా కొన్ని సామాజిక అసమానతలు తొలగిపోయేందుకు మాత్రమే పాటించవలసిన అవసరం ఉంది. ఎస్.సి.ల్లోనూ క్రీమీలేయర్ పెట్టాలి. అగ్రవర్ణాలని పిలువబడుతున్న వారిలోనూ ఆర్థికంగా అణచివేయబడిన వారికి కొంత శాతం రిజర్వేషన్లు కొంత కాలం కల్పించాలి. హక్కుల్ని పొందడంలో అందరూ సమానులే అనేది నినదించాలి. ఈ భావాలను కొన్నింటిని కవిత్వ రూపంలో ‘వర్గీకరణీయం’గా వర్ణించడంలో చక్కని వ్యంగ్యాన్ని అసుసరించారు కవి. శిల్ప దృష్ట్యా కూడా చాలా తోలుగా విశ్లేషణ చేయాల్సిన కావ్యం. వక్రోక్తి, ధ్వని చమత్కారం వంటివి కావ్యం నిండా ఉన్నాయి. శ్రీశ్రీ కవిత్వ ప్రవాహం, అనుకరణ అక్కడక్కడా కనిపిస్తుంది. సమకాలీన దళిత సాహిత్యాన్ని రికార్డు చేయడంలో కొత్త గబ్బిలం తర్వాత ఈ కవిది ఇది రెండవదైనా, సాహిత్యంలో మాత్రం ఏకైక దీర్ఘకావ్యంగా నిలుస్తుంది. ( వర్గీకరణీయం (దళిత దీర్ఘకవి); కవి: ఎండ్లూరి సుధాకర్; వెల: ఇరవై రూపాయలు; ప్రతులకు: ఎండ్లూరి సుధాకర్, అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి) – డా. దార్ల వెంకటేశ్వరరావు

Add comment February 24, 2009

మెరిసిన ఆంధ్రపురాణ సౌందర్యం

విమర్శకునికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ‘భావుకత’ ఒకటి. కవి భావించిన భావాన్ని విమర్శకుడు పట్టుకోగలిగే సామర్థ్యమే భావుకత. ‘ధ్వన్యాలోకం’ వ్యాఖ్యాత అభినవగుప్తుడు ‘లోచనం’ వ్యాఖ్యానంలో కూడా ‘సహదయత’ గురించి చర్చించాడు. అయితే కవి వర్ణించిన ‘కావ్యం’ పాఠకులు అర్థం చేసుకోవడంలో విమర్శకుడు చాలావరకు దోహదపడతాడు. పాండిత్యం బాగా ఉన్న విమర్శకునికి భావుకత, సహృదయత తోడయితే, కవి అప్రయత్నంగా వెలువరించిన భావాల్లోనే మహోన్నతమైన ‘విషయాల్ని’ బయటకు తీయగలుగుతాడు. ఆ విషయాన్ని చదివి, ‘కవిగారే’ ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా కలగవచ్చు. తెలుగు సాహిత్య విమర్శకుల్లో పాండిత్యం, సహృదయత, భావుకత ముప్పేటలా కలిగినవారు చాలా మంది ఉండబట్టే కొత్త కొత్త దృక్పథాలు, ధోరణులు బయటకు వస్తున్నాయి. అలాంటి సహృదయ విమర్శకుల్లో ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారొకరు. ఇటీవల ‘ ఆంధ్రపురాణం భారతీయ సంస్కతి వైభవం’ పేరుతో ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు ‘ ఆంధ్రపురాణం’ రచించి, ప్రచురించి యాభై సంవత్సరాలైంది. మొదటిసారి 1954లో ప్రచురింపబడిన ఈ ‘ ఆంధ్రపురాణం’ గురించి భూమయ్యగారి కంటే ముందు ఎందరో రాశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశంగా ఈ గ్రంథాన్ని అనేక వేల మంది విద్యార్థులు దీన్ని చదువుకున్నారు. బి. నాగిరెడ్డిగారు ‘ ఆంధ్రపురాణం – సమగ్ర పరిశీలనం’ పేరుతో పరిశోధన చేశారు. యువభారతి వారి ‘ ఇతిహాస లహరి’లో జి.వి. సుబ్రహ్మణ్యం గారు మంచి వ్యాసం రాశారు. ఇంత మంది ‘ ఆంధ్రపురాణం’ గురించి రాయగా, మళ్లీ భూమయ్యగారు ఎందుకు రాశారనే దాన్ని తెలుసుకోవడమే ఈ చిరు సమీక్ష ఉద్దేశం. ఆంధ్రపురాణం గురించి ఇంతకు ముందు రాసినవారి కంటే అదనంగా భూమయ్య గారు భారతీయ సంస్క¬ృతీ వైభవాన్ని చూడగలిగారు. సంస్క¬ృతిలో ధర్మం ప్రధానంగా భావించి కావ్యానికి సౌందర్యభరితం చేశారు. ‘కావ్య కథకు మూలం చరిత్ర, ఎన్నుకొన్నది కావ్యకళా మార్గం. చెప్పదలచుకున్నది ధర్మం. ఇది ఆంధ్రపురాణంలోని విషయం. ఈ కావ్యరచనకు రాజుల చరిత్ర సారకథనం ఒక మిష. ధర్మకథనమే ప్రధానాంశం’ అని కావ్యాత్మను ఆవిష్కరించగలిగి పాఠకునికి కావ్య పఠనాభిరుచితో పాటు రచన ఔన్నత్యాన్ని మరింత పెంచగలిగారు. ఆంధ్రపురాణంలో మధునాపంతులవారు రాజ వంశాల పేర్లతో తొమ్మిది పద్యాలు రాస్తే, భూమయ్యగారు ధర్మరక్షణ, భారతీయత, కళాసంపద, కావ్యకళ వంటి పేర్లతో తొమ్మిది విభాగాల్లో విశ్లేషించారు. మొత్తం రెండూ కలిస్తే పద్దెనిమిది సంఖ్య అవుతుంది. భారతీయ సాహిత్యంలో పద్దెనిమిదికి ప్రముఖ స్థానం ఉంది. ఈ దృష్టితో కూడా ఆంధ్రపురాణాన్ని పద్దెనిమిది సంఖ్యతో ముడిపడేట్లు చేసి దాన్ని భారతీయ సంస్క¬ృతి వైభవంగా నిలుపగలిగారు. సుమారు రెండు వేల నూట అరవై రెండు పద్యాలు గల కావ్యంలో 196 పద్యాల్ని అందిస్తూ పద్యాలన్నింటిలో గల కళాత్మక సౌందర్యాన్ని వి«శదీకరించారు. రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారతాన్ని రాయించడానికి కారణాలు అనేకం ఉన్నా ధార్మికత కూడా ఉండబట్టే రాజ్యం, రాజులు పోయినా సాహిత్యం నేటికీ నిలబడి ఉంది. ఈ సందర్భంలో మధునాపంతుల సత్యనారాయణ గారు వర్ణించిన పద్యాన్ని భూమయ్యగారు చమత్కారభరితంగా వ్యాఖ్యానించారు. ఆ పద్యం, వ్యాఖ్యానం చూస్తే మనకే తెలుస్తుంది. “కావున శ్రుత మత ధర్మపు¬ జీవకు జివురిచ్చి పూల దేలించు వసం తావిర్భావమునకు మీ దీవన కావలయు గని సుధీ మధుమూర్తీ” ఇది రాజరాజనరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని రచించమని కోరిన సందర్భంలో వర్ణించగా దీన్ని ఆచార్య భూమయ్యగారు “నన్నయను కవి సు«ధీ మధుమూర్తీ’ అని సంబోధించినవాడు కవి. ఇది ‘మధు’నాపంతుల కవిని సంబోధించినట్లు తెలుస్తుంది. ఇది రాజరాజు నన్నయను కోరినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మధునాపంతుల కవి స్ఫురిస్తున్నాడు. ఆనాడు, నన్నయ వైదిక ధర్మ పునరుద్ధరణకు రాజరాజు ప్రేరణతో వ్యాసభారతాన్ని తెనిగించాడు. నేడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ‘శ్రుత మత ధర్మపు జీవకు జివురిచ్చి పూల దేలించ’టానికి ఈ ఆంధ్ర పురాణ రచనకు పూనుకొన్నట్లు తెలుస్తుంది”. ఇలాంటి వ్యాఖ్యానాలు ఆలోచనాపరులైన పాఠకుల్ని ఆహ్లాదంలో ముంచెత్తి ఆంధ్రపురాణ సౌందర్యం మెరుపు మెరిసినట్లు అవుతుంది. ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాల్ని వివిధ కథల్లో వర్ణించిన మధునాపంతుల వారి సుధారసాన్ని గొప్పగా ఈ విమర్శక పరిశోధకుడు వ్యాఖ్యానించారు. మగధ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న సాతవాహనులు స్వతంత్ర రాజులై తొలి తెలుగు రాజులుగా కీర్తి గాంచడం, వీరిలో హాలుని కథ రసవత్తరంగా ఉన్నాయి. చాళుక్య, కాకతీయ పర్వాల్లో చరిత్రను చెప్తున్నట్లు ఉన్న ధర్మం అంతర్లీనంగా దాగిన వైనాన్ని చక్కగా విశదీకరించగలిగారు. ప్రతాపరుద్రుడి ఆత్మహత్య సంఘటన హృద్యంగా ఉంది. ఆంధ్రుల చరిత్ర, సంస్క¬ృతి చదివే విద్యార్థులకు, తెలుసుకోవాలనుకునేవారికి మధునాపంతులవారి పద్యాలు చదివిన వెంటనే అర్థం చేసుకోలేనివారికి లేదా ఆ సామర్థ్యం లేనివారికి భూమయ్యగారి గ్రంథం అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది. గ్రంథం ఆసాంతం చదివితే చక్కని శైలి, పరిశోధనా పద్ధతి, సత్యాన్వేషణకు పురికొల్పుతుంది. ముఖచిత్రం హిమాలయాలు, అట్ట వెనక కాకతీయ తోరణం, వేయి స్తంభాల గుడి ఎంతో ఆకర్షణీయంగా మల్టీకలర్‌లో ముద్రించి చరిత్రలో కాకతీయ శిల్పానికి శాశ్వతత్వం సిద్ధింపజేశారు. భారతీయ సంస్క¬ృతిని హిమాలయ చిత్రం ద్వారా, తాను నివసించే ఓరుగల్లు శిల్పాల్ని కాకతీయ తోరణం, వేయిస్తంభాల ద్వారా చూపి భారతీయతలో తెలుగు సంస్క¬ృతి అంతర్భాగమనేది ఔచిత్యవంతంగా, ప్రతీకాత్మకంగా నిరూపించారు. ( ఆంధ్రపురాణం: భారతీయ సంస్కతీ వైభవం; రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య; వెల: రూ. 75/-; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగుడా, హైదరాబాద్) – డా. దార్ల వెంకటేశ్వరరావు 30062005

Add comment February 24, 2009

విప్లవ, దళిత ఉద్యమ నాయకత్వ విశ్లేషణ

విప్లవ, దళిత ఉద్యమ నాయకత్వ విశ్లేషణ సమకాలీన సాహిత్యంలో ‘విప్లవ కవిత్వం’ ఎప్పుడూ ఒక నిత్య స్రవంతిగానే కనిపిస్తుంటుంది. సమస్యలు ఉన్నంత వరకూ పోరాటాలు తప్పవని, అందుకు నిరంతర సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయని విముక్తి పోరాటాలు నిరూపిస్తూనే ఉన్నాయి. విప్లవోద్యమంలో స్థలాతనికీ, వ్యక్తికీ చరిత్రలో ప్రాధాన్యం కనిపిస్తూ, అది వర్తమాన, భవిష్యత్తు తరాలవారికి ప్రేరణగా నిలుస్తుంటుంది. అందుకే వీరి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన/ కోల్పోయిన వారిని వీరులుగా స్మరించుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. నక్సల్‌బరీ ప్రాంతానికీ, చారు మజుందార్‌కీ ప్రాధాన్యం ఇవ్వడంలో స్థల, వ్యక్తుల్ని గుర్తిచటమంటే ఆ ఉద్యమ ఆవయాల్ని ప్రచారం చేయడమే! ఈ నేపథ్యంలో కాశీం ‘గుత్తికొండ’ పేరుతో ఒక దీర్ఘకవితను ప్రచురించి, విప్లవ పార్టీల్లో చర్చనీయాంశాలవుతున్న కులం, వర్గం, అగ్రవర్ణ నాయకత్వం, ఉద్యమంలో నుండి బయటికి వచ్చేసినవారు చేసే ప్రకటనల్ని, దళిత – విప్లవ సంఘాల మధ్య ఉన్న అభిప్రాయాల్ని, గ్లోబలైజేషన్ ప్రభావాన్ని, దాన్ని ఎదుర్కోవటానికి ప్రేరణని, మతవాద శక్తులతో అధికారం కోసం ఆరాటపడి పొత్తులు పెట్టుకొనే పార్టీల భావజాలాల్ని తనదైన దృక్పథంతో హృద్యంగా కవిత్వం చేస్తూనే, మేధోపరంగా ఆలోచనలకు పురిగొల్పడంతో వస్తు, రూపాలకు చక్కని సమన్వయాన్ని సాధించడం కనిపిస్తుంది. గ్రంథం మూడు భాగాల్లో కవి స్వీయానుభవ ముద్ర మొదటి భాగంలోనూ, రెండవ భాగంలో అంతర్జాతీయంగా కుట్ర జరుగుతున్న ప్రపంచీకరణ ప్రభావాన్నీ, దాన్ని విప్లవకారులు ఎదుర్కొంటున్న తీరుతెన్నుల్ని, మూడవ భాగంలో హైదరాబాద్‌లో విప్లవకారులతో జరిగే/ జరగబోయే శాంతిచర్చల వల్ల మారిపోతున్న వాతావరణాన్ని, మరో వైపు ఉద్యమం నుండి బయటకు వచ్చినవాళ్లు తీసుకునే నిర్ణయాల్ని ఖండిస్తూ పోరాటాల వైపు మరలమనే ప్రబోధాన్ని చేయడం వంటివాటిని వర్ణించారు. కొన్ని విప్లవ పార్టీలు కూడా ‘కులాన్ని’ అంగీకరిస్తున్నాయి. కుల ప్రభావాన్ని గమనిస్తున్నాయి. దళిత సంఘాలు/ పార్టీలు విప్లవ పార్టీలను ‘కులం’ గురించి నిలదీయడంలో శత్రువైరుధ్యం కంటే మిత్రవైరుధ్యమే గమనించవలసి ఉంది. విప్లవ పార్టీల్లో, ఉద్యమాల్లో అత్యధికులు దళితులే ఉండటం, పీడితులుగా దళితులే ముందుగా నష్టపోవడం వంటివే కాకుండా ‘పీడితుల’ పక్షం కోసం పోరాడే వాళ్లయిన విప్లవ పార్టీల్ని దళితులు నిలదీయడంలో ‘ ఆత్మీయమైన హక్కు’ ఉన్నట్లు భావిస్తారు. మతవాద పార్టీల్ని ఇదే ప్రశ్నతో దళితులు నిలదీయకపోవడానికి కారణం, అవి ఎలాగూ వ్యతిరేకమనే అభిప్రాయం ఉండటమే. అందుకనే విప్లవ పార్టీలవాళ్లు దళితులను చేజార్చుకోలేరు. కనుక, తమ పోరాట ఎవరి క్సోమో చెప్తూ కాశీం “ప్యాపిలిలో / మనవాడు కాని/ గణేషుడి కోసం గొడవెందుకు/ నిశ్శబ్దంగా కనిపించే ఈ గణేష్/ నడిరాతిరి నక్షత్రాల వెలుగులో / చంద్రుణ్ని సాయుధుణ్ని చేస్తున్నాడు’ (పు.6) అనడంలో ‘ప్యాపలి’ సంఘటతో కులాన్ని బట్టి హత్యలు జరిగినా విప్లవ పార్టీలు తమదనైన రీతిలో తీర్పు చెప్పడం జరిగింది. మావోయిస్టు నేత రామకృష్ణ ఆధిపత్య కులంలో పుట్టినా అతనికి ‘కుల స్వభావం’ లేదని చెప్తూ “అతడు మా నేస్తం/ వసంతకాల మేఘగర్జనతో/ అంటరాని వాకిట్లో/ మా నొసటిపై రాలిన/ తొలి వానచినుకు” (పు.3)గా ప్రశంసిస్తాడు కవి. ఒకప్పుడు గుత్తికొండలో రాముడు తిరిగి రాడని పురాణాలు చెప్తున్నా, రాముడు ‘మా వాడు కాదని/ శంబూకుడి శిరచ్ఛేదన చరిత్ర తెల్పింది” అని అనడం, వెంటనే ‘ప్పుడేమో/ రామకృష్ణ/ పెదాల మీద చిరునవ్వుతో/ ఎనిమిది కోట్ల ఆంధ్రుల హృదయాలపై/ లాంగ్‌మార్చ్‌కు బాటలేస్తున్నాడు” అని ‘చరిత్ర’కు నిజమైన అర్థం పరమార్థం ‘గుత్తికొండ’ ఏర్పరుచుకుందని గర్విస్తున్నాడు. సైద్ధాంతిక అవగాహన కవికి ఉండబట్టే, చిన్న కావ్యమైనా సుదీర్ఘమైన భావాల్ని సమర్థంగా చెప్పగలిగాడు. ‘పదునెక్కుతున్న ప్రాయాన్ని/ ముక్కలు చేసి/ సైబర్ కేఫ్‌లకు వేలాడదీస్తున్న’ గ్లోబలైజేషన్ ప్రభావాన్ని పట్టుకోగలిగాడు. దళిత ఉద్యమం’లో రాజ్యాధికారం ఒక ముఖ్యమైన అంశమైనా దళిత సాహిత్యం కూడా దీనికి వత్తాసు పలకడంతో కొంతమందికి కొన్ని విభేదాలున్నాయి. రాజ్యాధికారం పొందడమంటే దళితులు పాలకులు కావడమా? దళితులకే ప్రత్యేక రాష్ట్రం/ దేశం కావడమా? అప్పుడు దళితులంతా బాగుపడిపోతారా? ఇప్పటికే ఐదు దశాబ్దాల నుంచి దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజకీయ పార్టీలో సీటు వచ్చేవరకూ, నెగ్గేవరకూ తప్ప పదవుల్లో ఉన్న దళిత నేతలు ఎంత మంది హీనాతిహీనమైన స్థితిలో ఉన్న దళితుల్ని, వారి సమస్యల్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారు? దీనికి అనేక సాకులు చెప్తారు. అధికార పీఠంపై ఉన్నా అధికారం చెలాయించే స్థితి రాలేదని. రిజర్వేషన్లపై పొందిన పదవుల్లో ఉండి రిజర్వేషన్ పొందవలసినవాళ్ల ప్రతినిధిగా వాళ్ల హక్కుల్ని సాధించలేనప్పుడు రాజీనామా చేసి బయటకు రాగలరా? సమాజానికి నేటికి దూరంగానే జీవిస్తున్న వాళ్లలో దళితులు అనేకమంది ఉన్నారు. జీవనస్రవంతిలోకి అటువంటి దళితుల్ని తీసుకు రాగలిగితే, వాళ్లే వాళ్ల హక్కుల్ని సాధించుకోగలుగుతారు. అలా కాకుండా దళితులు రాజ్యాధికారం సాధించినప్పుడే దళితులు ఉన్నతస్థితిలోకి వచ్చేస్తారనడం ఆలోచించవలసిన విసయమే! విప్లవ పార్టీలో ఆధిపత్య కులాలవారే నాయకత్వం వహించడం పట్ల, దళిత వర్గాల్లో నిరసన ఉంది. దాని వల్లనే చాలామంది ఉద్యమం నుండి బయటకి వచ్చేస్తున్నట్లు అప్పుడప్పుడు వచ్చే పత్రికా ప్రకటనలే సాక్ష్యం. ఆధిపత్య కులంలో పుట్టినా కులనిర్మూలన, పీడితుల పక్షం వహించే ఉత్తమ నాయకత్వాన్ని పోగొట్టుకోవలసిన పని లేదు. ఇది ఎలాంటిదంటే, దళితులుగా పుట్టి, ఉన్న పదవుల్లో ఉండి, దళితులకు ఉపయోగపడనివారి కంటే దళితుల అభ్యున్నతి గురించి కృషి చేసే వారెవరైనా దళిత/ పీడిత అభ్యున్నతిని ఆశించినవాళ్లే అవుతారని భావించడం వంటిది. దళిత/ పీడిత కులాల్లో నాయకత్వ స్థాయికి ఎదిగినవాళ్లని గుర్తించినప్పుడు కచ్చితంగా కొన్ని సంఘర్షణలు, సమస్యలు తప్పవు. ఈ విషయాల పట్ల కాశీం తన అభిప్రాయాల్ని స్పష్టం చేశాడు. ‘ ఉట్టి మీద ఒట్టి తునకల్ని/ మునవేళ్లతో ముద్దాడి/ కొవ్వు సృష్టించేశాడు/ ట్రిగ్గర్ పట్టిన అగ్రతనాన్ని/ క్లీన్ చేసిన / మనుషులు వాళ్లు’ అని వాళ్లకు క్లీన్‌చిట్ ఇస్తాడు. అంతేకాదు, సోఫాల్లో కూర్చుని కలలు గనే సోకాల్డ్ దళిత నేతల రాజ్యాధికార వీలునామాల్ని ప్రశ్నిస్తాడు – దళిత కార్డుతో దేశదేశాల్లో దర్జాగా తిరిగే దళిత మేధావుల్ని, హస్తినాపురం (ఢిల్లీ)లో మనువు (మతతత్వశక్తుల)తో జటకట్టడంలో గల సైద్ధాంతిక నిబద్ధతను గమనించమంటున్నాడు. కాశీం రాసింది చిన్న దీర్ఘ కావ్యమే. కానీ విప్లవ పార్టీకి గొప్ప స్ఫూర్తినివ్వడంలో గుత్తికొండ (దీర్ఘకవిత) కావ్యం నిర్వహించే పాత్ర నిర్వచించలేనిది. ఈ దీర్ఘ కావ్యం నిండా దీర్ఘంగా చర్చించవలసినన్ని అంశాలు నిండి ఉన్నాయి. ఇది ఉద్యమంతో సంబంధాలున్నవారికి ఆత్మీయ స్పర్శను కలిగించగలుగుతుంది. ( గుత్తికొండ (దీర్ఘకవిత); కవి: కాశీం, వెల: రూ. 10/-? సేటలు : 24; ప్రతులకు: సహచర బుక్‌హౌస్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్)

Add comment February 24, 2009

సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక కవి గొంతులో ప్రజల ఆర్తి పలుకుతుంది. తన అస్తిత్వం ఏమిటో అంచనా వేసుకోవటం కన్పిస్తుంది. అత్యవసర పరిస్థితి ధ్వనిస్తుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి వస్తున్న కథల్లో, కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పథం వ్యక్తమవుతుంది. కవికి దృక్పథదం ఉండటం వల్ల తన కవిత్వం ఎవరి కోసమో, తన కవిత్వ ప్రయోజనం ఏమిటో గుర్తెరిగినట్లవుతుంది. కాసుల ప్రతాపరెడ్డి ఈ కోవలోనే తెలంగాణ అస్తిత్వం కోసం నిజాయితీతో ఉద్యమప్రాయంగా కవిత్వం, కతలు, వ్యాసాలు రాస్తున్నాడు. తెలంగాణ కథలు, కవిత్వంపై వచ్చిన వ్యాసాల్ని పుస్తకాలుగాను అందుబాటులోకి తెస్తున్నాడు. ‘భౌగోళిక సందర్భం’, ‘కొలుపు’, ‘తెలంగాణ తోవలు’, ‘తెలంగాణ కథ – దేవులాట’ వంటి వ్యాససంపుటాల్లో గానీ, తన కథల పుస్తకం ‘శిలువకు తొడిగిన మొగ్గ’లో గానీ, ఇప్పుడు ప్రచురించిన ‘గుక్క’ కవితాసంపుటిలో గానీ దేన్ని చూసినా తెలంగాణ బాగోగుల గురించిన తపన కనిపిస్తుంది. తన తెలంగాణ చరిత్ర, సంస్క¬ృతుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యత ప్రతిఫలిస్తుంది. తన విమర్శవ్యాసాల్లో, కథల్లో తనకి కావాల్సిందేమిటో వాచ్యంగానే, స్పష్టంగానే, ధైర్యంగానే నిలదీసి అడిగితే కవిత్వంలో మాత్రం అందరి చేతా తెలంగాణ సమస్యను, ఆవేదనను అర్థం చేయించి, అనుభవింపజేసి, తన వాదనను అంగీకరింపజేసేలా ప్రయత్నిస్తాడు. ‘గుక్క’ దీర్ఘకవితతోపాటు ఈ పుస్తకంలో మరికొన్ని కవితలూ ఉన్నాయి. తెలంగాణా సంస్క¬ృతినీ, జానపద పౌరాణిక, చారిత్రక గాధల్నీ, సందర్భాల్నీ, చివరికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ల నోళ్లలో కూనిరాగాలయ్యే పాటల్ని కూడా తన కవిత్వంలో అంతర్భాం చేసి, తల్లి తెలంగాణ ‘గుక్క’ పట్టి దుఃఖిస్తున్న దయనీయ దృశ్యాన్ని చూపిస్తాడు. గ్రంథ ముఖచిత్రంలో కూడా నెత్తి బాదుకుంటూ రోదిస్తున్న స్త్రీమూర్తి తల్లి తెలంగాణని స్ఫురింపజేస్తుంది. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. స్వరూపస్వభావాల్లో తేడాలున్నా సిద్ధాంత నేపథ్యం మాత్రం పీడన, పరాయాకరణల నుండి విముక్తి కోరుకోవటమే తెలంగాణా పోరాటాల తత్త్వం! “చినిగిన బట్టలేసి కుట్టిన నేల/ మొగుల కింద గన్నుల కోలాటాలు/ పెయ్యంతా తూట్లే తూట్లు” అని కవి కాసుల ప్రతాపరెడ్డి వర్ణించడంలో తెలంగాణ ప్రాంత పరిస్థితి కండ్లకు కట్టినట్లుంది. “బట్టలేసి కుట్టిన నేల” అనే ప్రయోగం చేయడంలో గొప్ప ఔచిత్యం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వివిధ రాజ్యాధికార జెండాలు ఎగిరిన చారిత్రక స్థితిగతుల్ని స్ఫురింపజేస్తున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం సంస్థానంలో తెలంగాణ, మరఠ్వాడా, కర్ణాటకలో గల భిన్న ప్రాంతాలతో, భిన్న సంస్క¬ృతులతో నిండి, అధిక శాతం తెలుగు మాట్లాడే వాళ్లున్నా ‘ముక్కు మొగం లేని దిక్కుమాలిన తెలుగువాళ్లు’ (తెలంగీ బేడంగీ)గా ఎగతాళికి గురికాబడ్డారు. రజాకార్ల దురంతాలు, దాని నుండి రక్షించుకొని భూస్వాముల దురంతాల నుండి కాపాడుకోవడానికి సాయుధ పోరాటం చేయటం, 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చర్య తీసుకోవటం, 1950లో ముందుగా పౌరప్రభుత్వం, తర్వాత 1952లో సాధారణ ఎన్నికలు జరగటం, హైద్రాబాదు రాష్ట్రం ఏర్పడడం వంటి చారిత్రక సంఘటనలు జరిగాయి. అంటే అధికార జెండాలు మారాయి. ఆ తర్వాత అప్పటికే కుంఫిణీ వ్యాపారులు వాళ్ల సౌలభ్యం కోసం తెలుగు మాట్లాడే వాళ్లందర్నీ ఒక ప్రాంతంగా కాకుండా సర్కారు జిల్లాలు, దత్తమండలాలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలవారిని మద్రాసు ప్రెసిడెన్సీలో కొంతమందిని విభజించటంతో తెలుగువాళ్లు, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ భాషా సంస్క¬ృతుల పట్ల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక రంగాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించగలిగారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ఆకాంక్ష హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న తెలంగాణను, మద్రాస్ ప్రెసిడెన్సీలో బాధితులైన తెలుగువాళ్లను కలిసిపోవడానకి ప్రేరేపించింది. ఇక్కడ ‘విశాలాంధ్ర’ ఉద్యమం వరకూ ముందున్న తెలంగాణను పరిశీలించినా కవి ‘చినిగిన బట్టలేసి కుట్టిన’ అనే ప్రయోగ ఔచిత్యం వెల్లడవుతుంది. సాయుధ పోరాటంలో, నేటి నక్సల్ (మావోయిస్టు) రాజకీయాల్లో ప్రభుత్వం తరఫు నుండీ, నక్సల్స్ నుండీ జరుగుతున్న కాల్పుల్ని, పోతున్న ప్రాణాల్ని ‘మొగులు కింద గన్నుల కోలాటం’గా చెపపడంలో, కురవాల్సిన మేఘాలు, చల్లదనం అందించాల్సిన మేఘాల కింద నెత్తురు చారికలకు కవి ఆవేదనకు అక్షరరూపమే! దీనిలో ఒకానొక చారిత్రక పరిణామం, దాని ఫలితంగా దయనీయంగా మారిన తెలంగాణ బతుకు చిత్రం చూపగలిగాడు కవి. గతానికీ, వర్తమానానికీ ముడివేస్తూ ‘పత్తి పంటల మీద పురుగుల మందు/ పొలాల నిండా కొయ్యకాళ్లే/ పర్రె కాలువలేవి, చెరువు ఊటలేవి?/ మింటికీ ఒంటికీ ఏకధారగా కురుస్తున్న చీకటి/ రెక్కలిరిగినై, కాల్లు విరిగినై/ చిలుకెగిరిపోతున్నది, ఎగిరిపోతున్నది/ ఊగరా, ఊగరా!!/ వాసాలు అందుకుని ఊగరా” అని వెలుతురివ్వని, దక్కనివ్వని పోరాటాల స్థితిగతుల్ని చెప్తూ ప్రస్తుత తెలంగాణ స్థితికి ఆవేదనతో కుమిలిపోవటం కనిపిస్తుంది. త్యాగాలకు దక్కిన ఫలితం పేదరికమేనా అని ప్రశ్నిస్తున్నాడు. విశాలాంధ్ర ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అన్నీ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించగలవని అనుకున్నా, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపించడం పట్ల కూడా కవికి ఆవేదన ఉంది. ఈ నేలపై ఉంటూ ఈ సంస్క¬ృతిలో బతుకుతూ భాషనీ, ప్రజల్నీ తక్కువగా అంచనావేస్తూ, తన వాళ్లవల్లనే ఒక పరాయాకరణ జీవితాన్ని గడపవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోయే “నీ యావ వేరు/ నీ రంది వేరు/ నువ్వేమన్నా మా బాస రాసినవా?/ మా యాస రాసినవా?/ నీ రాతలకు మా తలరాతలకు పొంతనేది?/ మనిసివిక్కడ, మనసక్కడ!/ పాలు మర్సిన బిడ్డవైతివి, నీకేమెరుక?” అని నిలదీస్తాడు. తెలంగాణ భాషను మాండలికంగా తీసిపారేయటం, సినిమాల్లో హీరోలకు కాకుండా రౌడీ పాత్రల చేత పలికించడం, కించపరచడం వంటివెన్నో జరుగుతున్న నేపథ్యాలన్నింటినీ గుర్తు చేస్తూనే తెలంగాణ ప్రజల్ని గుర్తించమంటున్నాడు కవి. తెలంగాణకు ఈ పరిస్థితి రావడానికి కారాణాన్ని అన్వేషించమంటూ – ” ఎవరికి పుట్టిన బిడ్డరా అంటే/ ఎక్కెక్కి ఏడ్చే తల్లి/ ఏ గాలి సోకిందో, ఏ తూర్పు గాలి విసిరిందో/ కాకులు దూరిన ఇల్లు/ గుడ్లగూబలు చొచ్చిన ఇల్లు” అని చెప్పడంలో ఆవేశం కూడా ఉంది. వర్షాలు లేవు. తన నేల నుండే ప్రవహించినా, తన నేల ఉపయోగించుకోలేని దుస్థితిలో గోదావరి జలాలు. పోనీ వర్షాలు కురవడం లేదు. పోనీ వర్షాలు కురవటం లేదు. దీనికి ఏవో పథకాలంటూ ఇజ్రాయెల్, నెదర్లాండ్ వ్యవసాయ పద్దతులంటూ చేసినవన్నీ ‘పథకాలకు పాతరేసి, పైసలెత్తుకుపోయిన గద్దలు’గా మారటం విషాదకరం. వ్యవసాయం ఎలా ఉన్నా తాగటానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ బారిన పడిన జీవితాలెన్నో! దీన్ని – విషమై పారుతున్న పాతాళగంగ/ కాల్లొంకర, కండ్లొంకర/ పసి పోరగాల్లయినా పండ్లిగిలిస్తే నల్లని గారలు” అని ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన జీవితాల్ని చూపిస్తాడు. భగీరథుడుతన వంశాన్ని రక్షించుకోవడానికి తపస్సు చేసి ఆకాశగంగను పాతాళం దాకా ప్రవహించేట్లు చేశాడు. వాళ్లకు శాపవిముక్తి అయ్యిందో లేదో తెలియదు గానీ, వందలాది మీటర్ల లోతుల్లోకి తలతాకట్టు పెట్టయినా బోర్లు వేస్తే, వచ్చే నీళ్లు ఫ్లోరోసిస్‌ను తెచ్చి, తెలంగాణ ప్రలజకి విషంగా మారి నీటి శాపం వెంటాడుతున్న కతల్ని వినిపిస్తాడు. ఇంత జరుగుతున్నా, పీడితుల పక్షం వహించవలసిన పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం పట్ల కూడా అధిక్షేపాన్ని ప్రకటిస్తూ – “మంత్రమేసెనో, మాయ చేసెనో, మరుగు మందే పెట్టెనో/ ఆత్మపంజరంలో పిట్ట/ కదం తొక్కుతూ, పదం పాడుతూ/ ఎర్రెర్రని పలుకులు, ఎదురొడ్డిన రొమ్ములు/ వీరభక్త హన్మంతులు/ గుండె చీల్చుకుంటే సూర్యుళ్లే/ నిన్ననా, మొన్ననా, ఆవలి మొన్ననా/ కాలచక్రం కింద నలిగిన దేహాలెన్నో” అని చరిత్రలో పోరాటాల వల్ల ప్రాణాల్ని కోల్పోయిన వారిని గుర్తు చేస్తూ వారి పోరాటాలకి ప్రతిఫలం దక్కాలనే ఆశయాన్ని ప్రకటిస్తున్నాడు. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కాదనీ, సోది చెప్పటమో, శాంతి చేయటమో పరిష్కారానికి మార్గం చూపలేవంటూ – “మార్మానమొచ్చినోడు మదమెక్కి కూస్తుండు/ కావాల్సింది యిడుపు కాయితాలే” అనీ, ” ఏరుపడటం తప్ప మాకు వేరు లేదు/ నువ్వేంది చెప్పు తీర్పు చెప్పేది/ మేమప్పుడే చెప్పినం/ మాకు గట్టి గింజలు కావాలె, తాలు మాటలొద్దు” అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ప్రతాపరెడ్డి కవిత్వంలో తెలంగాణ సమస్యను జడ్జీ అనే పాఠకుడి మందు లాయర్‌లా తన వాదనాపటిమను ఆర్ద్రంగా వినిపిస్తున్నాడు. ‘గుక్క’ పట్టి ఏడుస్తున్న తల్లి తెలంగాణ దుఃఖాన్ని ఆపాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు దాహం తీర్చాలి. గొంతు తడపాలి. గొంతు తడిసి, దాహం తీర్చి, జీవశక్తి నివ్వగలిగదే నీళ్లు కావాలి. కన్నీళ్లు తుడవాలి. జానపద సాహిత్యంలో ఆణిముత్యం వంటి కథ ‘బాలనాగమ్మ’ కథ తెలంగాణ ప్రాంతానికి చెందిందే. దీన్ని కవిత్వంలో ఉపయోగించుకొంటూ, సంస్క¬ృతిపరమైన కథల్ని తెలుసుకోమంటూనే చైతన్యానికి ఊపిరి కోణాల్ని చూపుతున్నాడు. “సోది చెప్పవచ్చిన తల్లి/ శాంతి చేయాలంటున్నది/ కాగల కార్యం తీర్చే గంధర్వులేరి?/ బాలనాగమ్మవో తల్లి, తెలంగాణా// చెర విడిపించే బాలవద్దిరాజేడి?” అని ఒక చోట, మరో చోట- ” ఏడేడు సముద్రాలు దాటావా, నా చిట్టి తండ్రీ/ మర్రిచెట్టు తొర్రలో చిలుక దొరకనే లేదు/ పిడికిలి నిండా పట్టి పిసికేయడానికి/ పరిగెడుతూ వుంటావా, ఎక్కడి దాకా?” అనటంలోనూ, తెలంగాణ సమస్య పరిష్కారానికి చేయవలసిందేమిటో కూడా స్ఫురింపజేస్తున్నాడు. ఇలా కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించుకున్న ప్రత్యేక శిల్పాన్ని కూడా వివరించుకుంటూ పోతే కవిత్వనిర్మాణాల్లో ఎన్నో రహస్యాలు బయటపడుతుంటాయి. మీడియాని, జానపద గేయాల్ని, విప్లవ గీతాల్ని కూడా తెలంగాణ సాధనకు ఎలా వినియోగించుకోవచ్చో తన కవిత్వంలో రహస్యంగా అందరికీ అందంగా అందిస్తున్నాడు. వింటున్న పాటనూ, చూస్తున్న దృశ్యాన్నీ, రమ్యంగా చెబుతున్న కథనీ కూడా తెలంగాణ దృష్టితో చూడగలిగే విశిష్టశైలిని కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో చూడగలిగే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల దొరకని ఏకాంతాన్ని వెతుక్కొనే సన్నివేశంలో ‘కన్నులో మిసమిసలు కనిపించనీ, గుండెల్లో గుసగుసలు వినిపించనీ’ అని హీరోగారు ఓ సినిమా (దేవత?)లో పాడుతుంటాడు. కాసులకవి దీన్ని “కన్నుల్లో బుసబుసలు కనిపించనీ/ గుండెల్లో బాకు దించనీ” అని అనుకరణరూపంలో కవిత్వమవ్వటం ఓ చైతన్యస్రవంతి శిల్పం నుండి పుట్టిన కొత్త ఊహ! మరో సినిమా అల్లూరి సీతారామారాజులో తెల్లవాడిని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ “ఎవడు వాడు, ఎచటి వాడు/ ఇటువంటి నల్లవాడు/ ఎందుకొచ్చిండో ఎరుకలేదాయె/ కాకితో కబురైనా పెట్టకుండా వచ్చిన చుట్టమని/ అంగలార్చి అక్కున చేర్చుకుంటి/ నా నల్లనల్ల రేగళ్ల మీద పచ్చిపుండ్లు పడె” అని తెలంగాణ సమస్యవైపు దృష్టి మరల్చేటట్లు కవిత్వీకరించాడు. సినిమా పాటల్నే కాదు విప్లవ పాటల్ని, పిల్లల్ని ఆడించే జాబిల్లి పాటల్లో కూడా చైతన్యాన్ని నింపే ప్రయత్నంలో “నీళ్లు మనవిరో, నేల మనదిరో/ వాడి ఎవుసమేందిరో, వాడి దున్నుడేందిరో”, “పైలం కొడుకో, కొమరన్న/ జర భద్రం కొడుకో” అనటంలో విప్లవ చైతన్యంలోని చైతన్యాన్నీ వినియోగించుకోవాలనే తపన ఉంది. “గొంగట్ల మెతుకులేసి ఏరుకోవడమే/ చీకటి అర్రల ఒంటరి మొత్తుకోలు/ చందమామ రాకె, జాబిల్ల రాకె” అనగలిగేదంతా ఆలోచించవలసిందే. సరదా కోసం వీటిని ప్రయోగించడం లేదు. ఒక విశిష్ట ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగిస్తున్నాడు కవి. గ్లోబలైజేషన్ పట్లా, ఆర్థిక సరళీకృత విధానాల పట్లా కడూ స్పష్టత ఉంది. సమకాలీన తెలంగాణ రాజకీయ పొత్తుల పట్ల కవి అభిప్రాయం ఉంది. తన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఆర్తి తన కవిత్వం నిండా ఉంది. తెలంగాణ ప్రజలందరూ హత్తుకొదగింది. కవి, విమర్శకుడు గౌరీశంకర్ అన్నట్లు “కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో భావోద్వేగం, పదునైన ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణా పటానికి అల్లుకున్న వలస గూడును తన చేతులతో చీరేసే ప్రయత్నం చేస్తున్నాడు”. కవి రచనకు, నిబద్ధతకూ నిత్యం నిదర్శనంగా నిలుస్తూ ‘గుక్క’ పట్టి దుఃఖిస్తున్న తల్లి తెలంగాణ దాహాన్ని తీర్చమని ఆహ్వానిస్తున్నాడు. ‘వలస’ను నిర్వచించవలసిన అవసరం ఉన్నా, సమస్యను పరిష్కరించడం మాత్రం అత్యవసరం. సొంత అస్తిత్వానికై ‘గుక్క’ పట్టిన తెలంగాణ కవిత్వం ఒక ఎమెర్జెన్సీ పోయిట్రీ. ( గుక్క (కవితా సంకలనం; కవి: కాసుల ప్రతాపరెడ్డి; వెల: రూ. 15/-; ప్రతులకు: అన్ని ప్రధాన బుక్ షాపులల్లో)

-డా॥ దార్ల వెంకటేశ్వరరావు 2309200

Add comment February 24, 2009

దళిత స్త్రీ అనుభవాలకు కళాత్మక అభివ్యక్తి

ఆకలికి తట్టుకోలేక మట్టినే తిని ప్రాణం కాపాడుకోవాలనుకున్న ఒక నిరుపేద పిల్ల, ఆ మట్టి తినడం వల్ల చనిపోయినట్లు చిత్రించిన కథ ‘మన్నుబువ్వ’ పేరుతో జాజుల గౌరి ఒక కథల సంపుటిని ప్రకటించారు. ప్రతి కథ హృదయాన్ని ద్రవించే శైలిలో, తెలంగాణా సజీవ భాషలో రాశారు. “సెట్టు కింద సల్లగుంది గానీ నా కడుపులో మంటగుంది” అని రాయడంలో కథకి ఉండాల్సిన వాతావరణ చిత్రణ, కథకెలా ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది. ఆకలికి తట్టుకోలేక, నీళ్లు తాగినా ఆకలి తీరక, ఇంటి ముందరున్న చెట్టు కింద కూర్చున్న పిల్ల, ఆకలి తీరే దాకా మట్టిని తినడంతో చనిపోతుంది. ఉత్తమ పురుషలో కథని నడిపించినప్పుడు, ఇటువంటి కథను ముగించడం కష్టంతో కూడిన పని. దాన్ని రచయిత్రి చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ “నేను బోయేతాలకల్ల అవ్వ బువ్వొండి ఎసరు వంపుతోంది. అన్న, సెల్లె అవ్వ సుట్టూ కూకుని బువ్వెప్పుడైతదా అని జూస్తుండ్రు, గానీ నేను కుండ కాడ్కి బోయి సెంబు నిండా నీళ్లు దీస్కుని గట్ట గట్ట తాగి, అవ్వ దిక్కు పోయి, మీదున్న డేగీస దిక్కు జూస్కుంట కిందనే పండుకున్నా. అప్పటి దాకా బువ్వడిగి గట్ల పండుకున్న, నా దిక్కు అవ్వ, అన్నా సెల్లి సిత్రంగా జూస్తుండ్రు. నాకు ఆ తరువాత ఏమైందో ఏమో! ఇగ లేసి తింటది, అగ లేసి తింటదని ఎదిరిస్తూనే ఉంటరు గావచ్చు” అని ముగించారు. కథలో ఆ బాలిక చనిపోతుంది. మరణించిన తర్వాత పాత్ర ఎలా మాట్లాడుతుందని అనిపిస్తుంది. అందుకనే పడుకునే వరకూ ఉన్న స్థితి తర్వాత ” ఏమైందో ఏమో!” అని అనడం చక్కని మెరుపును సూచిస్తుంది. ఈ ఒక్క కథ చాలు, జాజుల గౌరి కథల్లో ప్రదర్శించిన కథాకథన శిల్పాన్ని గమనించడానికి. ఈ సంపుటిలో 25 కథలున్నాయి. చాలా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. ఈ కథల సంపుటికి సుశీలా నారాయణ రెడ్డి స్మారక ట్రస్టు ఆర్థిక సహాయం, పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయం అందింది. ” ఇప్పటి దాకా రికార్డు కాని దళిత జీవిత కోణాలు, సంస్క¬ృతి ఈ కథల్లో చూడవచ్చు” అని అంటూ ‘సాహిత్యంలో కొత్త నీరు’ పేరుతో ప్రసిద్ద రచయిత బి. ఎస్.రాములు ముందుమాట రాశారు. దీనిలో బి. ఎస్. రాములు ప్రతి కథనీ చక్కగదా విశ్లేషించారు. ‘పట్టాలు’ కథ ఇళ్ల స్థలాల పేరిట జరిగే రాజకీయాల్ని, ‘నీళ్లబాయి’లో స్త్రీపురుష వివక్షనీ, ‘సూరీడు’ కథలో దళితుల్లో రావాల్సిన చైతన్యాన్ని చక్కగా చిత్రించారు. రచయిత్ర తన ఆత్మకథగా చెప్పుకున్న ‘నేన్ నేన్ లెక్కనే’లో ఆత్మగౌరవాభివ్యక్తి ఉంది. కథలన్నింటిలోనూ కన్పించే రచయిత్రి ఆవేదన అట్టడుగు స్థాయి జీవన వేదనలు, దళిత ఉద్యమాలు, దళితులపై జరిగే దాడులు (అవి అనేక రూపాల్లో ఉండవచ్చు) వాటన్నింటి గురించి ఆలోచింపజేయాలనేదే! ‘నా పయనం’ పేరుతో రచయిత్రి రాసుకున్న ప్రస్తావన ఆత్మీయంగా ఉంది. తనకు సహాయం చేసిన వారిని మరిచిపోలేని కృతజ్ఞతను ధ్వనింపజేశారు. కేవలం మాటలుగా కాకుండా ప్రతి దానికీ కార్యకారణాన్ని చూపారు. అలా ఆమె రచయిత్రి కావడానికి కేవలం దళితులే కాకుండా, దళిత స్ప¬ృహ ఉన్న వారెంతో మంది సహకరించినట్లు తెలుస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక పత్రికలో ‘కథలు’ వస్తున్నా, దళిత స్త్రీ, అదీ తెలంగాణా దళిత స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రాంతంలో ఉండే దళితుల ప్రత్యేక సమస్యల్ని అవగాహన చేసుకోవడానికి, కతలో ప్రవేశించవలసిన నేటివిటీ భాషకి ఎలా ఉంటే బాగుంటుందో గమనించడానికి జాజుల గౌరి ‘మన్నుబువ్వ’ కథల సంపుటిని చదవడం చాలా అవసరం. ( మన్నుబువ్వ (కథల సంపుటి), రచయిత్రి: జాజుల గౌరి; ప్రతులకు: విశాల సామాజిక తాత్త్విక విశ్వవిద్యాలయం, రామకృష్ణ నగర్, అంబర్‌పేట, హైదరాబాద్)

- డా॥ దార్ల వెంకటేశ్వరరావు

Add comment February 24, 2009

తెలంగాణ సంఘర్షణ పతాక కదిరె కృష్ణ కవిత్వం


-డా//దార్ల వెంకటేశ్వరరావు

తెలంగాణా ప్రాంతం వెనుకబడిందా? తెలంగాణా ప్రజలు వెనుకబడి ఉన్నారా? తెలంగాణా ప్రజల్నివెనక్కి నెట్టి వేశారా? అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక రాజకీయ కారణాల వల్ల తెలంగాణా ప్రాంతం వెనకబడి పోయిందని ఆ చారిత్రక ఆధారాలు ఎన్నో వివరిస్తున్నాయి. నిజాం పాలన దానికొక కారణంగా చాలా మంది చెప్తున్నారు. తెలంగాణాలోని అత్యధికులు, కింది వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా వెనుకబడ్డారు. వెట్టితో నలిగిపోయారు. పోరాటాలు చేసి చేసి అలసి పోయారని చెప్పలేం గానీ, మరింత రాటుదేలారు. లేకపోతే ప్రపంచంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పిలిచే 1857 నాటి తిరుగుబాటు, తర్వాత అంత శక్తివంతమైన పోరాటం తెలంగాణాలోనే జరిగిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తారా? కనుక ప్రజలు ‘పోరాటం’ చేయడంలో వెనుకబడి లేరు. వెనక్కి నెట్టబడుతున్నారు. పోరాటాల్ని నిజంగా’ గుర్తించని వాళ్ళు పాలకులుగా చెలామణి అవుతున్నారు. అందుకనే ఒకప్పుడు వెట్టి నిర్మూలన నిరంకుశ పాలనను వ్యతిరేకించి సాయుధ పోరాటం చేసి అనేక మంది ప్రాణాల్ని త్యాగం చేసి, విశాలాంధ్ర పేరుతో మళ్ళీ మోసపోతుంటే అది మోసమని ఘోషిస్తుంటే పోరాడుతుంటే ఆ పోరాటాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు నేటి పాలక వర్గమనీ చాలామంది భావిస్తున్నారు. పాలకులు ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుండా రక రకాల సాకుతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. వీటన్నింటిని తెలంగాణా ప్రాంతం మీద అభిమానం, అవగాహన, చైతన్యం ఉన్న కవులు, రచయితలు తమ రచనల్లో రాస్తూనే ఉన్నారు. అలా వచ్చినదే కదిరె కృష్ణ కవిత్వం”బలగం”
మాతృత్వం పైన, మాతృ భూమి పైన మమకారంతో కవిత్వం రాస్తున్నాడు కదిరె కృష్ణ. మత కల్లోలాపై ఆగ్రహం, ఆ కల్లోలాల వెనుక బలైపోయే దళితుల పట్ల ప్రేమ అతని కవిత్వంలో ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతో అన్నీ మారుతున్న ‘కులం’ మాత్రం మాసిపోవడం లేదనే ఆవేదన ఉంది. తెలంగాణ ప్రాంతంలో దళితులు జీవించటమే కష్టమైన పరిస్థితుల్లో, ఒక దళిత మహిళ, అందులోనూ ఒక మాదిగ మహిళ దేశ రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాడం అసమాన్యమని కీర్తిస్తాడు. దళితుల్లోని అంతర్వివక్షనూ ప్రశ్నిస్తూనే మాదిగల గొప్పతనాన్ని వెల్లడిస్తాడు. స్త్రీలను గౌరవిస్తామంటూనే, ఫ్యాషన్స్‌ పేరుతో జరుగుతున్నవ్యాపారం, వ్యభిచారం కూపంలోకి దింపేస్తున్న ఆడపిల్లల్ని చూసి కవి చలించిపోతాడు. ప్రత్యేక తెలంగాణ పట్ల మాదిగల దృక్పథంగా తన అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తున్నాడు. మాదిగల్ని చైతన్య పరిచే సాహిత్యం సృష్టించిన కవుల్ని, కళాకారుల్ని ఉత్తేజ పరుస్తున్నాడు. ఇవన్నీ కదిరె కృష్ణ రాసిన ‘బలగం’(2007) కవితా సంపుటిలో బలంగా కనిపించే సమకాలీన సమాజం సంఘర్షణాత్మక కవితా చిత్రాలు.
ప్రపంచీకరణ ప్రభావం వల్ల గ్రామీణ సంస్కృతిలో వచ్చిన మార్పుల్ని వర్ణిస్తూ ………, “పట్ట పగలే/పల్లెనెవడో దోచుకుంటున్నాడు/నిర్భీతిగా/పొట్టలో తలదూర్చి/ నెత్తురు జుర్రేస్తున్నాడు/ గ్లోబల్ దొంగ / రంగు రంగుల ఛానళ్ళ కులాల దొంగ /మళ్ళీ సమధుల్లోకే పయనం…./……………………………/కళకళలాడిన పల్లె / కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న / “క్రౌంచ మిధునం”…… (బలగం, 2007 : 2) అనడంలో వలసలు పోతున్న జీవితాల్లో చెలరేగే సంఘర్షణను కవిత్వీకరిస్తున్నాడు కవి. ప్రేమానురాగాలతో కలిసి మెలిసి జీవించనివ్వని వలసల్ని, భార్యా భర్తల మధ్య అనివార్యమవుతున్న వియోగాన్ని “క్రౌంచ మిధునం” అనే భావం చేత కవిత్వీకరించాడు. వాల్మీక రామాయణం రావడానికి శోకం నుండి శ్లోకం అప్రయత్నంగా పుట్టడం కారణమని ఒక కథ ప్రచారంలో ఉంది. క్రౌంచ పక్షుల జంటను ఒక బోయ వాడు కొడితే, దానిలోని ఒక పక్షికి బాణం తగిలి, అది నేలపై పడి విలవిలలాడుతూ ప్రాణం విడుస్తుంది. తనకు దూరమైన పోతున్న పక్షి చుట్టూ తిరుగుతూ మరో పక్షి విలవిలలాడిపోతుంది. అలా గ్రామం వలసలతో భార్యాభర్తలు విడిచి ఉండలేక, విడవకపోతే బతకలేక మనోవ్యధకు గురవతన్నారని వర్ణిస్తున్నాడు కవి.
నాగప్పగారి సుందర్రాజు మరణించిన తర్వాత చాలా మంది స్మృతి కవితల్ని రాశారు. కదిరె కృష్ణ, నాగప్పగారి సుందర్రాజు పేరుతో సంభాషణాత్మక శిల్పంతో కవిత రాశాడు. చనిపోయిన సుందర్రాజుతో మాట్లాడుతున్నట్లు రాశాడు కవి. సుందర్రాజు స్థాపించిన “మాదిగ సాహిత్య వేదిక” ఆగిపోయినా, ఆ స్పూర్తితో మాదిగ కళాకారుల వేదికను కొనసాగిస్తున్నట్లు చెప్తాడు కవి. ఆ స్పూర్తి కొనసాగుతుండడం వల్లనే నగర వీధుల్లో డప్పులతో మాదిగలు తమ సంస్కృతిని విస్తరిస్తున్నారంటాడు కవి. ఈ కవితలో మూడు అంశాలున్నాయి.
1. వర్గీకరణ విషయాన్ని కోర్టు కొట్టేయడంతో మాల వర్గానికి చెందిన వారంతా సంతోషంగా ఉన్నారు.
2. అయినా వర్గీకరణ సాధన కోసం, దానితో పాటు మాదిగ చరిత్ర, సంస్కృతులను కొనసాగించే సంస్థలు కొత్త కొత్తగా పుడుతూనే ఉన్నాయని, మాదిగ చైతన్యం కొనసాగుతుందనే హామీ కనిపిస్తుంది.
3. దళిత, మాదిగల భావజాలాన్ని నిరంతరం ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుందనే విషయాన్ని, సుందర్రాజుతో అక్కడి విషయాల్ని తెలుసుకోవడంలో వర్ణించగలిగాడు. బ్రహ్మ, విష్ణు, రంభ, ఊర్వశిలనే హిందూ భావజాలంలో కనిపించే స్వర్గ నరకాలేవి లేవనీ, అవన్నీ అభూతకల్పనలనే భౌతికవాదిగా సుందర్రాజు భావజాలాన్ని వివరించగలిగాడు కదిరె కృష్ణ. ఆ కవితలోని కొంత భాగాన్ని కింద పరిశీలించవచ్చు…
“ఏం బ్రదర్! సోదరులు రెచ్చిపోతుండ్రంట!”/ …………..
…………… “మాదిగ చైతన్య వేదికను/మజ్జెల్నే ఆపిండ్రంటా!/ “అయితేందన్నా…!/మాదిగ కవుల కళాకారుల వేదిక /బెట్నెం!/’డప్పుల మోత’తో దద్దరిల్లుతోంది పట్నం” (బలగం: 2007 : 12)
ఈ కవితా ఖండికల్లో శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగాడు.
స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కులున్నా, వాటిని అందుకోలేని వాళ్ళలో దళితులే ముందున్నారు. ఈ విషయాన్ని వర్ణిస్తూ కవి…
“కలకటేరు బాబు కారుకు వేలాడుతున్న /మూడు రంగుల జెండా సాక్షిగా/ఆ బావి నీళ్ళు తోడడానికి అనర్హుడనని
ఊరు ఊరంతా గర్జిస్తే, పాలిపోయిన మొఖం వేసుకొని /మాటలొచ్చిన మూగదయ్యింది రాజ్యాంగం” (బలగం: 2007 : 18) అని చెప్పడంలో ‘రాజ్యాంగం’ హక్కులిస్తున్నా, వాటినింకా ఎంతోమంది దళితులు అందుకోలేక పోతున్నారనే సత్యాన్ని చెప్పాడు.
బంద్, సమ్మెలు వంటివేమి జరిగినా నష్టపోయేది దళితులేనని చెప్తూ కవి…
“అప్పుడప్పుడు /నగరం చిందులేస్తుంది/ఎలక్షన్ల సొల్లు మత్తు మత్తుగా చిత్తు చిత్తుగా తాగి /నలుగురు దళితుల్ని మింగి /ప్రశాంతంగా /హాయిగా త్రేనుస్తుంది/
………../దీని కడుపులో మనువు రాచపుండు ” (బలగం: 2007 : 18) ఉందనీ, దాన్ని ఆపరేషన్‌ చేయడానికి దళితులంతా ‘వైద్యులై’ కదలవలసిన అవసరం ఉందంటాడు. బంద్, సమ్మెల వంటివి జరిగేటప్పుడు దళితులెంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాడు కవి.
మాదిగవాడిగా కుంగిపోకుండా, ఆ కులంలో ఉంటూనే ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్న మంచి కవిత “నే నెవరో చెప్తుంది…”
“ఏవడ్రా ననుమించిన / ఇంజనీరు/ ఏదిరా నా చెప్పుల్ని మించిన/ మిషనేరు/ గూటం నా కుల గురువు/తంగేడు చెట్టు నా కల్పవృక్షం/కత్తికి కదనం నేర్పినోన్ని/ నెత్తుటి ముద్దలతో/దేశం సరిహద్దులు గీసినోన్ని/ మాదిగోన్ని” (బలగం: 2007 : 56)
మాదిగల కులవృత్తి, ఆ సాధనాలు, ఆ పనితనం, ఆ నైపుణ్యం వంటివన్ని ఈ కవితలో చెప్పటంలో ఆత్మగౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కవి. వాటితోనే జీవితాంతం కొనసాగిస్తానని ఎక్కడా ప్రకటించలేదు. వృత్తులకన్నింటికీ గౌరవం కల్పించాలనే డిమాండ్ కనిపిస్తుంది. సమాజానికి మాదిగలు చేస్తున్న కృషిని గుర్తించమనే, కొందరి సేవనే గొప్పగా గుర్తించడం సరికాదనీ వివరిస్తున్నాడు కవి.
అన్నీ మారుతున్నా, ‘కులం’ మాత్రం పోవట్లేదని చెప్తూ “దీని దినం జెయ్య!” అనే కవితను రాశాడు కవి కదిరె కృష్ణ.
డొంకదారి, రేల పూత బంగారంలా మెరుస్తుంది. గ్రామాల్లో ల్యాండ్ ఫోన్స్‌ స్థానంలో సెల్‌ఫోన్స్‌, ఫోర్టబుల్ స్థానంలో ప్లాస్మా టీ.వీ.లు వస్తున్నాయి. ప్రత్యక్ష ప్రసారాలతో అన్ని సెకన్ల కాలంలో తెలిసిపోతున్నాయి. వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి.
“ఇరవై నాల్గు గంటల ప్రసారం/గుండు సూదుల్తో పెద్దాపరేషన్‌…” అన్నీ జరుగుతున్నాయి.
“మంచిదే! అన్ని మారినైగాని/మా ఊళ్ళె…/కులం మాత్రం/ మారలె…/దీని దినంజెయ్య! (బలగం: 2007 : 66)
ప్రపంచీకరణ ప్రభావంతో అన్ని మారుతున్నా కులం మాత్రం మారడంలేదనేది అనుభవ సత్యంగా చెప్తున్నాడు కవి.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలంతా పోరాడుతున్నారని చెప్తూ నైజాము నవాబుల్ని మట్టి కరిపించిన వీరుల్ని స్మరిస్తాడు కవి. సమకాలీన నాయకుల మీసాల్ని గుర్తిస్తున్నామంటాడు. మాదిగలు కూడా తెలంగాణా పోరాటాన్ని సమర్ధిస్తున్నారంటూ…
“డప్పు గూడ మోగుతున్నది / కన కన /రావాలని తెలంగాణ” (బలగం: 2007 : 71) అని ప్రకటించాడు కవి.తెలంగాణా కవులు అత్యధికులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరుకుంటున్నారు. ఈ ప్రాంత దళిత కవులూ అలాగే కోరుకుంటున్నా, వారికవిత్వంలో కుల నిర్మూలన కావాలనే ఆకాంక్ష బలంగా కనిపిస్తుంది. సమకాలీన సమస్యల్ని శక్తి వంతంగా కవిత్వీకరిస్త్నున్న కదిరె కృష్ణను అభినందించవలసిందే!

Add comment February 24, 2009

Previous Posts


Calendar

February 2009
M T W T F S S
« Sep   Mar »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

Posts by Month

Posts by Category