మెరిసిన ఆంధ్రపురాణ సౌందర్యం
February 24, 2009
విమర్శకునికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ‘భావుకత’ ఒకటి. కవి భావించిన భావాన్ని విమర్శకుడు పట్టుకోగలిగే సామర్థ్యమే భావుకత. ‘ధ్వన్యాలోకం’ వ్యాఖ్యాత అభినవగుప్తుడు ‘లోచనం’ వ్యాఖ్యానంలో కూడా ‘సహదయత’ గురించి చర్చించాడు. అయితే కవి వర్ణించిన ‘కావ్యం’ పాఠకులు అర్థం చేసుకోవడంలో విమర్శకుడు చాలావరకు దోహదపడతాడు. పాండిత్యం బాగా ఉన్న విమర్శకునికి భావుకత, సహృదయత తోడయితే, కవి అప్రయత్నంగా వెలువరించిన భావాల్లోనే మహోన్నతమైన ‘విషయాల్ని’ బయటకు తీయగలుగుతాడు. ఆ విషయాన్ని చదివి, ‘కవిగారే’ ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా కలగవచ్చు. తెలుగు సాహిత్య విమర్శకుల్లో పాండిత్యం, సహృదయత, భావుకత ముప్పేటలా కలిగినవారు చాలా మంది ఉండబట్టే కొత్త కొత్త దృక్పథాలు, ధోరణులు బయటకు వస్తున్నాయి. అలాంటి సహృదయ విమర్శకుల్లో ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారొకరు. ఇటీవల ‘ ఆంధ్రపురాణం భారతీయ సంస్కతి వైభవం’ పేరుతో ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు ‘ ఆంధ్రపురాణం’ రచించి, ప్రచురించి యాభై సంవత్సరాలైంది. మొదటిసారి 1954లో ప్రచురింపబడిన ఈ ‘ ఆంధ్రపురాణం’ గురించి భూమయ్యగారి కంటే ముందు ఎందరో రాశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశంగా ఈ గ్రంథాన్ని అనేక వేల మంది విద్యార్థులు దీన్ని చదువుకున్నారు. బి. నాగిరెడ్డిగారు ‘ ఆంధ్రపురాణం – సమగ్ర పరిశీలనం’ పేరుతో పరిశోధన చేశారు. యువభారతి వారి ‘ ఇతిహాస లహరి’లో జి.వి. సుబ్రహ్మణ్యం గారు మంచి వ్యాసం రాశారు. ఇంత మంది ‘ ఆంధ్రపురాణం’ గురించి రాయగా, మళ్లీ భూమయ్యగారు ఎందుకు రాశారనే దాన్ని తెలుసుకోవడమే ఈ చిరు సమీక్ష ఉద్దేశం. ఆంధ్రపురాణం గురించి ఇంతకు ముందు రాసినవారి కంటే అదనంగా భూమయ్య గారు భారతీయ సంస్క¬ృతీ వైభవాన్ని చూడగలిగారు. సంస్క¬ృతిలో ధర్మం ప్రధానంగా భావించి కావ్యానికి సౌందర్యభరితం చేశారు. ‘కావ్య కథకు మూలం చరిత్ర, ఎన్నుకొన్నది కావ్యకళా మార్గం. చెప్పదలచుకున్నది ధర్మం. ఇది ఆంధ్రపురాణంలోని విషయం. ఈ కావ్యరచనకు రాజుల చరిత్ర సారకథనం ఒక మిష. ధర్మకథనమే ప్రధానాంశం’ అని కావ్యాత్మను ఆవిష్కరించగలిగి పాఠకునికి కావ్య పఠనాభిరుచితో పాటు రచన ఔన్నత్యాన్ని మరింత పెంచగలిగారు. ఆంధ్రపురాణంలో మధునాపంతులవారు రాజ వంశాల పేర్లతో తొమ్మిది పద్యాలు రాస్తే, భూమయ్యగారు ధర్మరక్షణ, భారతీయత, కళాసంపద, కావ్యకళ వంటి పేర్లతో తొమ్మిది విభాగాల్లో విశ్లేషించారు. మొత్తం రెండూ కలిస్తే పద్దెనిమిది సంఖ్య అవుతుంది. భారతీయ సాహిత్యంలో పద్దెనిమిదికి ప్రముఖ స్థానం ఉంది. ఈ దృష్టితో కూడా ఆంధ్రపురాణాన్ని పద్దెనిమిది సంఖ్యతో ముడిపడేట్లు చేసి దాన్ని భారతీయ సంస్క¬ృతి వైభవంగా నిలుపగలిగారు. సుమారు రెండు వేల నూట అరవై రెండు పద్యాలు గల కావ్యంలో 196 పద్యాల్ని అందిస్తూ పద్యాలన్నింటిలో గల కళాత్మక సౌందర్యాన్ని వి«శదీకరించారు. రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారతాన్ని రాయించడానికి కారణాలు అనేకం ఉన్నా ధార్మికత కూడా ఉండబట్టే రాజ్యం, రాజులు పోయినా సాహిత్యం నేటికీ నిలబడి ఉంది. ఈ సందర్భంలో మధునాపంతుల సత్యనారాయణ గారు వర్ణించిన పద్యాన్ని భూమయ్యగారు చమత్కారభరితంగా వ్యాఖ్యానించారు. ఆ పద్యం, వ్యాఖ్యానం చూస్తే మనకే తెలుస్తుంది. “కావున శ్రుత మత ధర్మపు¬ జీవకు జివురిచ్చి పూల దేలించు వసం తావిర్భావమునకు మీ దీవన కావలయు గని సుధీ మధుమూర్తీ” ఇది రాజరాజనరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని రచించమని కోరిన సందర్భంలో వర్ణించగా దీన్ని ఆచార్య భూమయ్యగారు “నన్నయను కవి సు«ధీ మధుమూర్తీ’ అని సంబోధించినవాడు కవి. ఇది ‘మధు’నాపంతుల కవిని సంబోధించినట్లు తెలుస్తుంది. ఇది రాజరాజు నన్నయను కోరినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మధునాపంతుల కవి స్ఫురిస్తున్నాడు. ఆనాడు, నన్నయ వైదిక ధర్మ పునరుద్ధరణకు రాజరాజు ప్రేరణతో వ్యాసభారతాన్ని తెనిగించాడు. నేడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ‘శ్రుత మత ధర్మపు జీవకు జివురిచ్చి పూల దేలించ’టానికి ఈ ఆంధ్ర పురాణ రచనకు పూనుకొన్నట్లు తెలుస్తుంది”. ఇలాంటి వ్యాఖ్యానాలు ఆలోచనాపరులైన పాఠకుల్ని ఆహ్లాదంలో ముంచెత్తి ఆంధ్రపురాణ సౌందర్యం మెరుపు మెరిసినట్లు అవుతుంది. ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాల్ని వివిధ కథల్లో వర్ణించిన మధునాపంతుల వారి సుధారసాన్ని గొప్పగా ఈ విమర్శక పరిశోధకుడు వ్యాఖ్యానించారు. మగధ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న సాతవాహనులు స్వతంత్ర రాజులై తొలి తెలుగు రాజులుగా కీర్తి గాంచడం, వీరిలో హాలుని కథ రసవత్తరంగా ఉన్నాయి. చాళుక్య, కాకతీయ పర్వాల్లో చరిత్రను చెప్తున్నట్లు ఉన్న ధర్మం అంతర్లీనంగా దాగిన వైనాన్ని చక్కగా విశదీకరించగలిగారు. ప్రతాపరుద్రుడి ఆత్మహత్య సంఘటన హృద్యంగా ఉంది. ఆంధ్రుల చరిత్ర, సంస్క¬ృతి చదివే విద్యార్థులకు, తెలుసుకోవాలనుకునేవారికి మధునాపంతులవారి పద్యాలు చదివిన వెంటనే అర్థం చేసుకోలేనివారికి లేదా ఆ సామర్థ్యం లేనివారికి భూమయ్యగారి గ్రంథం అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది. గ్రంథం ఆసాంతం చదివితే చక్కని శైలి, పరిశోధనా పద్ధతి, సత్యాన్వేషణకు పురికొల్పుతుంది. ముఖచిత్రం హిమాలయాలు, అట్ట వెనక కాకతీయ తోరణం, వేయి స్తంభాల గుడి ఎంతో ఆకర్షణీయంగా మల్టీకలర్‌లో ముద్రించి చరిత్రలో కాకతీయ శిల్పానికి శాశ్వతత్వం సిద్ధింపజేశారు. భారతీయ సంస్క¬ృతిని హిమాలయ చిత్రం ద్వారా, తాను నివసించే ఓరుగల్లు శిల్పాల్ని కాకతీయ తోరణం, వేయిస్తంభాల ద్వారా చూపి భారతీయతలో తెలుగు సంస్క¬ృతి అంతర్భాగమనేది ఔచిత్యవంతంగా, ప్రతీకాత్మకంగా నిరూపించారు. ( ఆంధ్రపురాణం: భారతీయ సంస్కతీ వైభవం; రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య; వెల: రూ. 75/-; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగుడా, హైదరాబాద్) – డా. దార్ల వెంకటేశ్వరరావు 30062005
Entry Filed under: సమీక్ష. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed